Abn logo
Jul 23 2021 @ 01:11AM

ఓట్ల కోసమే దళిత బంధు

పాదయాత్రలో ఈటల రాజేందర్‌

- బక్క పలుచని వాడి మీద ఇన్ని కుట్రలా 

- మార్యాద తప్పితే తొక్కి పడేస్తాం 

- మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ 

జమ్మికుంట రూరల్‌, జూలై 22: ఓట్ల కోసమే దళిత బంధు పెట్టడం జరిగిందని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ ఆన్నారు. గురువారం మండలంలోని గోపాల్‌పూర్‌ మీదుగా వావిలాల గ్రామానికి ప్రజా దీవేనయాత్ర చేరుకుంది. ఈటల అభిమానులు మహిళలు, బిజేపి కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులను మరోసారి మోసగించేందుకు కేసీఆర్‌ కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ డబ్బు, అధికారం, పోలీస్‌ బలగాల ముందు తాను గెలువలేక పోతున్నానని, అందుకే ప్రజాక్షేత్రంలోకి వచ్చానన్నారు. వావిలాల మండలం కోసం అప్పటి స్పీకర్‌ మధుసూదనచారిని కాళ్లు మొక్కుతా అన్న.. నాలుగు గ్రామాలు ఇవ్వమని అడిగానని, మొదట ఒప్పుకున్నా తర్వాత ఒప్పుకోలేదని, అందువల్లే వావిలాల మండలం చేయలేక పోయామని గుర్తు చేశారు. తాను మంత్రిగా ఉండి ప్రజల్లో తిరుగుతుంటే పెన్షన్ల కోసం ధరఖాస్తులు ఇస్తూ ఎన్ని సార్లు నీ చుట్టూ తిరుగాలి బిడ్డా అని వారు అంటుంటే కళ్లలో నీళ్లు తిరిగేవని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్ల తాళం కేసీఆర్‌ దగ్గర పెట్టుకున్నారని, ప్రజలకు చెప్పుకునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. తాను ఏనాడు ప్రభుత్వ పథకాలు వ్యతిరేకించలేదని, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు రైతుబంధు ఇవ్వొద్దని చెప్పానన్నారు.  తనలాంటి  బక్క పలుచనోడిని ఓడించేందుకు ఇప్పటికే వందల కోట్లు ఖర్చు చేశారని, సొంత పార్టీ నాయకులను కొనుక్కునే దౌర్భాగ్య పరిస్థితి కేసిఆర్‌కు వచ్చిందన్నారు. తనను ఓడించడానికి కాంగ్రెస్‌ వాడికి డబ్బులు పంపించింది వాస్తవం కాదా అని అన్నారు.  ఉగ్గు పాలతో ఉధ్యమం చేసినోడినని, మర్యాదకు మర్యాద ఇస్తామని, మర్యాద తప్పితే తొక్కి పడేస్తామని అని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు బొడిగె శోభ, ధర్మారావు, జడ్పీ మాజీ  చైర్‌పర్సన్‌ తుల ఉమ పాల్గొన్నారు. 

 కేసీఆర్‌ను ప్రశ్నించేవాడు తెలంగాణలో ఉండకూడదు

ఇల్లందకుంట: తనను ప్రశ్నించే వ్యక్తి తెలంగాణ గడ్డమీద ఉండకూడదని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ అన్నారు. గురువారం ఇల్లందకుంట మండలంలోని మర్రివానిపల్లె, సీతంపేట, బూజూనూర్‌, వంతడుపుల గ్రామాల్లో ఈటల ప్రజా దీవెన పాదయాత్ర నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భారీ వర్షంలోనే ఈటల పాదయాత్ర సాగగా దారి పొడుగునా ఆయనకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ ఓట్ల కోసమే దళితబంధు పథకం ప్రవేశపెట్టామని బరితెగించి మాట్లాడుతున్నారన్నారు. 18 ఏళ్ల పాటు ఉద్యమాన్ని నడిపి జైళ్లలో ఉన్నానని, మంత్రిని అయ్యాక కూడా కేసుల కోసం గంటల కొద్ది కోర్టుల దగ్గర గడిపానని ఆయన గుర్తు చేశారు. ఆనాడు తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిన వాళ్లు నేడు సీఎం పక్కన ఉన్నారని విమర్శించారు. ‘నా ముఖం అసెంబ్లీలో కనిపించొద్దని అంటున్నారు.. ఆనాడు ఆంధ్రోళ్లను ఎదురించింది నా ముఖం కాదా’ అని ప్రశ్నించారు. తన రాజీనామాతోనే ఇప్పుడు హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 11 వేల మందికి కొత్త పింఛన్లు, తెల్ల రేషన్‌కార్డులు వస్తున్నాయని గుర్తు చేశారు. ఇంతటి భారీ వర్షంలో కూడా ఆడబిడ్డలు తనను ఆశీర్వదించి ఆదరిస్తున్నారన్నారు. ఓటుకు పదివేలు ఇస్తారట.. తీసుకోండి, ప్రశ్నించే బిడ్డను, తెలంగాణలో నికార్సయిన బిడ్డను ఆశీర్వదించండని కోరారు. ఎంగిలి మెతుకుల కోసం మోసపోవద్దని, పరిగె ఏరుకుంటే లాభం లేదని, పంట పండితేనే కడపు నిండుతుందని అన్నారు.