Hyderabad : దళిత పారిశ్రామికవేత్తల స్థలాలే లక్ష్యం.. రాత్రికి రాత్రే..!

ABN , First Publish Date - 2022-01-04T19:08:23+05:30 IST

దళిత పారిశ్రామికవేత్తల స్థలాలే లక్ష్యం.. రాత్రికి రాత్రే..!

Hyderabad : దళిత పారిశ్రామికవేత్తల స్థలాలే లక్ష్యం.. రాత్రికి రాత్రే..!

  • వినియోగంలో లేని స్థలాలపై కన్ను
  • ఖాళీ జాగాల్లో నిర్మాణాలు
  • మొక్కల పెంపకం పేరుతో మరి కొందరు కబ్జా 
  • జీడిమెట్ల పారిశ్రామికవాడలో..
  • వంద కోట్ల విలువైన స్థలాలు అన్యాక్రాంతం



హైదరాబాద్‌ సిటీ/జీడిమెట్ల : జీడిమెట్ల పారిశ్రామికవాడలో టీఎస్ఐఐసీ(తెలంగాణ స్టేట్‌ ఇండస్ట్రీయల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌)కి చెందిన స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. కొందరు వ్యక్తులు ఆ స్థలాలను తమ గుప్పిట్లో పెట్టుకొని దందా చేస్తున్నారు. దళిత పారిశ్రామికవేత్తల కోసం కేటాయించిన స్థలాలు వినియోగంలో లేకపోవడంతో ఇతర పరిశ్రమల యజమానులు వాటిపై కన్నేశారు. రాత్రికి రాత్రే స్థలాల్లో నిర్మాణాలు చేపడుతున్నారు. రూ. వందల కోట్ల విలువైన టీఎస్ఐఐసీ స్థలాలను కాపాడాల్సిన అధికారులు కబ్జాదారుల కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలున్నాయి. 


గాజుల రామారాం రెవెన్యూ పరిధి సర్వేనెంబర్‌ 79లో ఉన్న సుమారు 461.28 ఎకరాల ప్రభుత్వ భూమిని కొన్నేళ్ల క్రితం టీఎ్‌సఐఐసీకి కేటాయించారు. ఆ స్థలంలో ఫేజ్‌-3, ఫేజ్‌-4 కింద లే అవుట్లను వేసి పారిశ్రామికవేత్తలకు విక్రయించారు. ప్రస్తుతం ఫేజ్‌-6 పేరుతో 64,579 చదరపు గజాల్లో 29 ప్లాట్లలో లే అవుట్‌ వేస్తున్నారు. దీన్ని ఆనుకొని ఉన్న సర్వే నెంబర్‌ 79లో భూదందా చేస్తున్నారు. సుమారు ఎకరం స్థలాన్ని స్థానికంగా ఇద్దరు అన్నదమ్ములు చెరబట్టారు. పేదల నుంచి లక్షల రూపాయలు తీసుకొని నేతల అండతో నిర్మాణాలు చేపడుతున్నారు. కొందరితో గుడిసెలు వేయించారు. ఒక్కో కుటుంబం నుంచి సుమారు రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలిసింది. 60 నుంచి 70 చ.గజాల స్థలాన్ని రూ. ఐదు లక్షలకే విక్రయిస్తుండడంతో వాటిని కొనుగోలు చేస్తున్న వారు ఇబ్బందుల పాలవుతున్నారు.


హడావిడి చేసి..

భూ దందా చేస్తున్న అన్నదమ్ముల అంశం ఇటీవల టీఎ్‌సఐఐసీ అధికారుల దృష్టికి వెళ్లింది. హడావిడిగా వెళ్లి కొన్ని నిర్మాణాలను తొలగించారు. ఆ తర్వాత మిన్నకుండిపోయారు. అనంతరం సోదరుల దందా మరింత అధికమైంది. అధికారులకు కూడా ఇక్కడ ప్లాట్లు ఇచ్చి, వాటిని అమ్మి నగదు ఇస్తున్నట్లు తెలిసింది. స్థానికంగా ఇబ్బందులు రాకుండా పలు సంస్థలు, వ్యక్తులను తమ గుప్పిట్లో పెట్టుకున్నారనే ఆరోపణలున్నాయి. సర్వే నెంబర్‌ 79/1లో రాష్ట్ర ప్రభుత్వం పదేళ్ల క్రితం కేటాయించిన ఎకరా స్థలంలో ధోబీఘాట్‌ నిర్మాణ పనులను మూడేళ్ల క్రితం జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రారంభించారు. అక్కడ నీటి సదుపాయం లేకపోవడంతో వినియోగంలో లేదు. ఆ స్థలం పక్కనే యథేచ్ఛగా నిర్మాణాలు వస్తున్నాయి. అయినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు.


ఆ స్థలాలపై కన్ను

జీడిమెట్ల పారిశ్రామికవాడలోని ఫేజ్‌-3లో పలు స్థలాలను వివిధ సంస్థలకు కేటాయించారు. కొందరు పరిశ్రమలను నిర్మించారు. దళిత పారిశ్రామికవేత్తలకు ఖరారైన స్థలాలను కొందరు వినియోగించడం లేదు. ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయి. తాజాగా జీడిమెట్ల పారిశ్రామికవాడలోని జైరాజ్‌ఇస్పాత్‌ (స్టీల్‌కంపెనీ) పక్కనున్న దాదాపు రెండెకరాల స్థలంలో కొందరు వ్యక్తులు ఎక్స్‌కవేటర్లతో గుంతలు తవ్వుతున్నారు. ఖాళీ స్థలాల్లో షెడ్ల నిర్మాణాలకు యత్నిస్తున్నారు. టీఎ్‌సఐఐసీ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే కబ్జా తంతు కొనసాగుతున్నా అధికారులు చర్యలు చేపట్టడం లేదు. కొన్ని పరిశ్రమల యజమానులు ఖాళీ స్థలాల్లో మొక్కల పెంపకం పేరుతో తమ అధీనంలోకి తీసుకుంటున్నారు. సుదీర్ఘకాలంగా డిప్యూటేషన్‌పై పని చేస్తున్న ఓ ఉన్నతాధికారి కనుసన్నల్లోనే కబ్జాల పర్వం సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రూ. వంద కోట్లు విలువ చేసే టీఎస్ఐఐసీ స్థలాల కబ్జా పర్వంపై జీడిమెట్ల పారిశ్రామికవాడ జోనల్‌ మేనేజర్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన ఫోన్‌ తీయలేదు.

Updated Date - 2022-01-04T19:08:23+05:30 IST