గుర్రపు స్వారీ చేసిన దళిత వరుడిపై రాళ్లదాడి.. ఎందుకా అని ఆరాతీస్తే..!

ABN , First Publish Date - 2021-11-27T18:37:11+05:30 IST

పెళ్లిలో వరుడు గుర్రపు స్వారీ చేయడం ఇప్పుడు చాలా చోట్ల సర్వసాధారణమే..

గుర్రపు స్వారీ చేసిన దళిత వరుడిపై రాళ్లదాడి.. ఎందుకా అని ఆరాతీస్తే..!

జైపూర్ : పెళ్లిలో వరుడు గుర్రపు స్వారీ చేయడం ఇప్పుడు చాలా చోట్ల సర్వసాధారణమే.. అదేదో సినిమాలోలాగా ఓ కులానికి చెందిన వ్యక్తి ఇలా పెళ్లి పీటలెక్కేముందు గుర్రం మీద స్వారీ చేస్తూ రావడంతో కొందరు ఉన్నత సామాజిక వర్గానికి చెందిన వారు దాడి చేయడం.. ఆ తర్వాత అది పెద్ద రచ్చే అయిపోతుంది. ఇప్పుడు అచ్చంగా రీల్ జరిగిన సీన్లే రియల్‌గానూ జరిగింది. ఈ ఘటన రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో చోటుచేసుకుంది. అసలేం జరిగింది.. ఎవరు దాడి చేశారు..? ఇంత జరుగుతుంటే పోలీసులేం చేస్తున్నారు..? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం..


జైపూర్‌లోని కోట్‌పుట్లీలోని కెరోడి అనే గ్రామీణ ప్రాంతంలో దళితుడి పెళ్లి వేడుక జరుగుతోంది. అంతా అనుకున్నట్లు జరిగివుంటే మరికొన్ని గంటల్లో పెళ్లి వేడుక పూర్తయ్యేది. ఇంతలో ఊహించని ఘటనే జరిగింది. గుర్రం మీద ఊరేగింపుగా వస్తున్న వరుడితో పాటు ఆయన వెంట వస్తున్న వారిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గుంపుగా వచ్చి రాళ్లతో దాడి చేశారు. ఇలా ఒకట్రెండు కాదు ఏకంగా 15 నిమిషాల పాటు రాళ్ల దాడి జరగడంతో చాలా మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులంతా ప్రస్తుతం జైపూర్‌లోని పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ రాష్ట్రంలో ఇంతవరకూ దళితులు ఇలా స్వారీ చేయలేదు.. రాష్ట్ర చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి.


అయితే.. ఇంత జరుగుతున్నా పోలీసులు సమీపంలో ఉన్నప్పటికీ చోద్యం చూస్తున్నారే తప్ప వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు దీన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసు ఉన్నతాధికారులు ఏఎస్పీ రామ్ కుమార్, డీఎస్పీ దినేష్ కుమార్‌‌లను సస్పెండ్ చేశారు.! అయితే అసలు ఆ రోజు ఏం జరిగిందనే విషయాన్ని సీనియర్ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడి వివరాలు వెల్లడించారు.


10 మంది అరెస్ట్..

గురువారం అర్ధరాత్రి వివాహ వేడుకకు అంతా సిద్ధమైంది. దళితులు ఇలా గుర్రపు స్వారీ చేయడం ఇష్టంలేక కొందరు వ్యక్తులు దాడికి తెగబడ్డారు. వారిలో పదిమందిని ఇప్పటి వరకూ అరెస్ట్ చేశాం. గ్రామంలోని హరిపాల్ బలై అనే వ్యక్తి ఇంటికి బారాత్ వచ్చినప్పుడు రాత్రి 11 గంటల తర్వాత ఈ సంఘటన జరిగింది. వివాహ వేడుకకు సంబంధించిన పూర్తి వివరాలతో ఉన్నతాధికారులకు నివేదిక పంపాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వివాహ వేడుకలు పూర్తయ్యేలా చూసేందుకు దాదాపు 70 మంది పోలీసులు ఆ ప్రాంతంలో మోహరించినప్పటికీ ఈ ఘటన జరగడం దురదుష్టకరం. అయితే కొందరు పోలీసులు ఇంత జరుగుతున్నా అజాగ్రత్తగా ఉన్నారు. వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటాంఅని ఉన్నతాధికారి ఒకరు మీడియాకు తెలిపారు. దళితుడిపై ఇలాంటి ఘటన జరగడంతో ప్రస్తుతం రాజస్థాన్‌లో పెద్ద చర్చే జరుగుతోంది.

Updated Date - 2021-11-27T18:37:11+05:30 IST