ఆన్‌లైన్ క్లాసులు మిస్స‌వుతున్నాన‌ని బాలిక ఆత్మ‌హత్య‌

ABN , First Publish Date - 2020-06-03T18:12:07+05:30 IST

కేరళలోని మలప్పురంలో ఆన్‌లైన్ క్లాసులు మిస్స‌వుతున్నాన‌ని 9 వ చదువుతున్న 14 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి దగ్గ‌ర పోలీసుల‌కు సూసైడ్ నోట్ ల‌భ్య‌మ‌య్యింది.

ఆన్‌లైన్ క్లాసులు మిస్స‌వుతున్నాన‌ని బాలిక ఆత్మ‌హత్య‌

తిరువంతపురం: కేరళలోని మలప్పురంలో ఆన్‌లైన్ క్లాసులు మిస్స‌వుతున్నాన‌ని 9వ చదువుతున్న 14 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి దగ్గ‌ర పోలీసుల‌కు సూసైడ్ నోట్ ల‌భ్య‌మ‌య్యింది. దానిపై... నేను వెళుతున్నాను అని రాసి ఉంది.  కరోనా మహమ్మారి నివారణకు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలులో ఉంది. దీంతో పాఠశాలల‌ను  మూసివేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆన్‌లైన్ తరగతులు నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఆధీనంలోని విక్టర్స్ టీవీ ఛానెల్‌లో ఆన్‌లైన్ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ తరగతులను 9 వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల దేవిక మిస్స‌వుతోంది. ఆమె ఇంటిలోని టీవీ చెడిపోయిన కార‌ణంగా ఈ పరిస్థితి ఏర్ప‌డింది. దీంతో ఆ విద్యా‌ర్థిని తీవ్రంగా క‌ల‌త చెందింది. దీనికితోడు వారి ఇంటిలో ఎవ‌రి ద‌గ్గ‌రా స్మార్ట్‌ఫోన్ లేదు. ఈ ప‌రిస్థితిని గ‌మ‌నించిన దేవిక తండ్రి త్వ‌ర‌లోనే టీవీని బాగు చేయిస్తాన‌ని ఆమెకు హామీ ఇచ్చాడు. అయితే ఇంత‌లోనే ఆ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించే ముందు రాష్ట్ర ప్రభుత్వం అన్ని అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేద‌ని ఆరోపించారు. కాగా ఈ ఘ‌ట‌న‌పై కేర‌ళ‌ విద్యాశాఖ మంత్రి సి రవీంద్రనాథన్ విద్యా శాఖ డిప్యూటీ డైరెక్టర్ నుంచి సమగ్ర నివేదిక కోరారు. 

Updated Date - 2020-06-03T18:12:07+05:30 IST