Abn logo
Sep 19 2021 @ 10:40AM

వైసీపీ బెదిరింపులు.. రోడ్డునపడ్డ దళిత కుటుంబం

విశాఖ జిల్లా: వైసీపీ నేతల బెదిరింపులకు మరో దళిత కుటుంబం రోడ్డునపడింది. ఊరి నుంచి వెలివేయబడింది. ఆ దళిత కుటుంబం నరకమనుభవిస్తోంది. 20 రోజులుగా సరిగా తినడానికి తిండిలేక, తాగడానికి నీళ్లు లేక ఇబ్బందులుపడుతున్నారు. వారు పుట్టిన ఊరిలోనే పరాయివాళ్లలా బతుకుతూ.. అనుక్షణం అవమానాలుపడుతూ.. చివరికి ఆత్మహత్యకుయత్నించారు. ఇన్ని అవమానాలు పడిన దళిత కుటుంబం వైసీపీ పార్టీకి చెందిన గ్రామ వాలంటీర్ కుటుంబం కావడం గమనార్హం. కులమతాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాలన్న సీఎం జగన్ మాటలను తూ.చా. తప్పకుండా పాటించి.. వైసీపీ సర్పంచ్ మాటలను కాదని అర్హులకు సంక్షేమ పథకాలు అందించడమే ఆమె చేసిన నేరం.


విశాఖ జిల్లా, చోడవరం నియోజకవర్గం, రావికమతం మండలం, వోమవరం గ్రామంలో దళిత కుటుంబానికి చెందిన ఏలుసూరి వనజ గ్రామ వాలంటీర్‌గా పనిచేస్తోంది. ప్రభుత్వం అందిస్తున్న చేయూత పథకానికి తాను చెప్పిన పేర్లు మాత్రమే ఎంపిక చేయాలని గ్రామ సర్పంచ్ సంజీవ్ ఆమెను హెచ్చరించారు. ఆయన మాటలు పట్టించుకోకుండా అర్హులందరికీ పథకాన్ని అందించేందుకు ఆమె చేసిన ప్రయత్నమే శాపంగా మారింది. ఈ విషయం తెలసుకున్న తెలుగుదేశం పార్టీ ఆ కుటుంబానికి అండగా నిలిచింది. టీడీపీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు పుచ్చ విజయ్ కుమార్ ఆ కుటుంబానికి న్యాయం అందించడం కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తీసుకువెళ్లారు. ఆ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని వివరించారు. న్యాయం చేయాలని కోరారు.