‘దళిత సాధికారత’ ఓ మిథ్య!

ABN , First Publish Date - 2021-07-08T05:44:12+05:30 IST

తెలంగాణ కల సాకారంలో దళితుల పాత్ర ప్రధానమైనది. వారి ప్రాణ త్యాగాలకు ప్రధాన కారణం ప్రత్యేక రాష్ట్రంలో తమ జీవితాలు బాగుపడతాయని భావించడమే...

‘దళిత సాధికారత’ ఓ మిథ్య!

తెలంగాణ కల సాకారంలో దళితుల పాత్ర ప్రధానమైనది. వారి ప్రాణ త్యాగాలకు ప్రధాన కారణం ప్రత్యేక రాష్ట్రంలో తమ జీవితాలు బాగుపడతాయని భావించడమే. టీఆర్‌ఎస్‌ తన మ్యానిఫెస్టోలో దళితులకు అనేక హామీలను ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తొలి ముఖ్యమంత్రి దళితుడే అవుతాడని చెప్పిన కెసిఆర్‌ తానే ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటివరకు దళితులకు ఇచ్చిన హామీలను నీరుగార్చడం  మామూలైపోయింది. దళితులకు మూడెకరాల సాగుభూమి కార్యక్రమం కోసం నవంబర్‌ 5, 2014న జరిగిన శాసనసభ సమావేశాల్లో వెయ్యి కోట్లు కేటాయించారు. మూడెకరాల కన్నా తక్కువ భూమి ఉన్న దళితులకు మిగతా భూమిని కొనివ్వడానికి మరో వెయ్యి కోట్లు ఖర్చు చేయాలని ప్రతిపాదించారు. అంతేకాకుండా దళితుల అభివృద్ధికై 2014–2019 మధ్య 50 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని పేర్కొన్నది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఇప్పటివరకు 6890 మందికి 16,418 ఎకరాల భూమి మాత్రమే పంపిణీ జరిగింది. వాస్తవంగా ఈ భూ పంపిణీ లక్ష్యం మూడు లక్షల మందికి లబ్ధి జరగాలి, కానీ, ఆచరణలో మూడు శాతం లక్ష్యం కూడా చేరకుండానే మూలకు పడ్డది. 


రాబోయే హుజురాబాద్‌ ఎలక్షన్లలో ఏ విధంగానైనా గెలవాలన్న లక్ష్యంతో కేసీఆర్‌ దళితుల సాధికారత అంశంపై హడావుడిగా అన్ని పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో ఆయన మళ్ళీ కొత్త రాగం ఎత్తుకున్నారు అదే ‘దళిత ఎంపవర్‌మెంట్‌ స్కీం’. రాష్ట్ర వ్యాప్తంగా 11,900 కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఇస్తామని తెలిపారు. నియోజకవర్గానికి 100 కుటుంబాలనేది చాలా తక్కువ. మరోవైపు ఎంపికలో అధికారపార్టీ కార్యకర్తలకే ప్రాధాన్యం దక్కుతుంది. ప్రస్తుతం ఎస్సీ కార్పొరేషన్‌ కింద లబ్ధిదారుల ఎంపికలో ఇదే జరుగుతోంది. 


ఏడు సంవత్సరాల టిఆర్‌ఎస్‌ పాలనలో సబ్‌ ప్లాన్‌ కింద 80,696 కోట్ల రూపాయల కేటాయింపులు జరిగాయి. కానీ ఇందులో సగం నిధులు కూడా ఈ ప్రభుత్వం ఖర్చు చేయలేదు. మరోవైపు ఈ డబ్బును మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథతోపాటు ఇతర సంక్షేమ పథకాలకు దారి మళ్లిస్తున్నారు. మరి దళితుల అభివృద్ధి ఎలా జరుగుతుంది?

డాక్టర్‌ పెంట కృష్ణ, హైదరాబాద్‌

Updated Date - 2021-07-08T05:44:12+05:30 IST