Uttar Pradeshలో దళిత డిప్యూటీ ముఖ్యమంత్రి...కేబినెట్ కూర్పుపై సీఎం యోగి కసరత్తు

ABN , First Publish Date - 2022-03-14T15:13:35+05:30 IST

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రెండోసారి ఘన విజయం సాధించిన తర్వాత యోగి ఆదిత్యనాథ్ రెండోసారి యూపీ ప్రభుత్వ పగ్గాలు చేపట్టబోతున్నారు....

Uttar Pradeshలో దళిత డిప్యూటీ ముఖ్యమంత్రి...కేబినెట్ కూర్పుపై సీఎం యోగి కసరత్తు

లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రెండోసారి ఘన విజయం సాధించిన తర్వాత యోగి ఆదిత్యనాథ్ రెండోసారి యూపీ ప్రభుత్వ పగ్గాలు చేపట్టబోతున్నారు.యూపీ కేబినెట్ కూర్పుపై యోగి కసరత్తు చేస్తున్నారు. యూపీ డిప్యూటీ సీఎంగా దళితుడికి అవకాశం కల్పించాలని సీఎం యోగి యోచిస్తున్నట్లు సమాచారం.ఇప్పటికే యోగి ఆదిత్యనాథ్ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, బీజేపీ ప్రధాన కార్యదర్శి  బీఎల్ సంతోష్‌తో సమావేశమయ్యారు.  ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర బీజేపీ అగ్రనేతలతో కూడా యోగి సమావేశం అయ్యారు. సోమవారం యోగి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కూడా కలవనున్నారు.


యూపీ కొత్త కేబినెట్‌లో కుల, ప్రాంతాల ప్రాతినిధ్యాల మధ్య సమతూకం పాటించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను పర్యవేక్షించేందుకు పార్టీ పార్లమెంటరీ బోర్డు ఇద్దరు పరిశీలకులను నియమించింది.దళితుడిని ఉప ముఖ్యమంత్రిగా నియమించడం ప్రాథమిక చర్చల్లోనే నిర్ణయించారని పార్టీ సంబంధిత వర్గాలు తెలిపాయి. రాష్ట్ర మంత్రివర్గంలో మరింత మంది షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) శాసనసభ్యులను చేర్చుకునే విషయంపై చర్చలు కూడా జరుగుతున్నాయి.11 మంది బీజేపీ మంత్రులు ఎన్నికల పోరులో ఓడిపోవడంతో కేబినెట్‌లో మరిన్ని ఖాళీలు ఏర్పడే అవకాశం ఉంది. 


కొత్త ముఖాల్లో కన్నౌజ్ నుంచి ఎన్నికల్లో గెలుపొందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అసిమ్ అరుణ్, ఆగ్రా రూరల్ ఎమ్మెల్యే బేబీ రాణి మౌర్యలకు పెద్ద బాధ్యతలు అప్పగించే అవకాశముంది.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు,ఎమ్మెల్సీ స్వతంత్ర దేవ్ సింగ్, లక్నోలోని సరోజినీ నగర్ స్థానం నుంచి ఎమ్మెల్యే రాజేశ్వర్ సింగ్, రిటైర్డ్ ఐఎఎస్, ఎంఎల్‌సి ఎకె శర్మలను కూడా మంత్రులుగా చేయవచ్చని పార్టీవర్గాలు పేర్కొన్నాయి.సిరతు సీటు నుంచి ఓడిపోయిన యోగి ఆదిత్యనాథ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యకు ప్రభుత్వంలో చోటు దక్కే అవకాశం ఉంది. ఎందుకంటే అతను ప్రముఖ ఓబీసీ నాయకుడు కావడమే కాకుండా, శాసనమండలి సభ్యుడు కూడా.కూటమి భాగస్వాములను కూడా వదిలిపెట్టమని పార్టీ నేతలు చెబుతున్నారు. 


అప్నాదళ్ నుంచి ఎమ్మెల్సీ ఆశిష్ పటేల్, నిషాద్ పార్టీ నుంచి డాక్టర్ సంజయ్ నిషాద్‌లకు కేబినెట్ ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది.403 స్థానాలున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీ 255 సీట్లు గెలుచుకోగా, దాని రెండు మిత్రపక్షాలు అప్నా దళ్ (సోనేలాల్), నిషాద్ పార్టీలు మరో 18 సీట్లు గెలుచుకున్నాయి. 

Updated Date - 2022-03-14T15:13:35+05:30 IST