దరిచేరని ‘దళిత బంధు’!

ABN , First Publish Date - 2022-08-20T06:13:10+05:30 IST

దళితులను ఆర్థికంగా మరింతగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం ఇంకా దళితుల దరికి చేరడమే లేదంటున్నారు. ప్రారంభంలో అధికారు లు హడావుడి చేసినా.. ఆ తర్వాత అంతా మాములుగానే మారిపోయింది.

దరిచేరని ‘దళిత బంధు’!
లబ్ధిదారుడికి కారును అందజేస్తున్న దృశ్యం(ఫైల్‌)

జిల్లాలో పూర్తికాని మొదటి విడత యూనిట్ల పంపిణీ

దళితబంధు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలపై ఫ్రీజింగ్‌

కొన్నిచోట్ల యూనిట్లను అమ్మేసుకుంటున్న వైనం

రెండో విడత కోసం తప్పని ఎదురుచూపులు

జిల్లావ్యాప్తంగా పథకం అమలుపై బిన్నాభిప్రాయాలు

ఆదిలాబాద్‌, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): దళితులను ఆర్థికంగా మరింతగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం ఇంకా దళితుల దరికి చేరడమే లేదంటున్నారు. ప్రారంభంలో అధికారు లు హడావుడి చేసినా.. ఆ తర్వాత అంతా మాములుగానే మారిపోయింది. జిల్లాలో పథకాన్ని ప్రారంభించి నాలుగు నెలలు గడిచిపోతున్నా.. ఇంకా పూర్తిస్థాయిలో యూనిట్లను పంపిణీ చేయడం లేదు. ఇప్పటికే దళిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం దళితబస్తీ కింద అర్హులైన నిరుపేదలకు మూడు ఎకరాల భూమిని పంపిణీ చేసింది. అలాగే ఎలాంటి అర్హత, ఆంక్షలు లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ దళిత కుటుంబానికి రూ.10 లక్షల నిధులను అందించి ఆర్థికపరమైన సహకారం అందించాలని నిర్ణయించింది. కానీ పథకం అమలుపై ప్రత్యే క దృష్టిని సారించకపోవడంతో జిల్లాలో దళితబంధు పథకం ఓ అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్నట్లుగా కనిపిస్తోంది. జిల్లాకు 249 యూనిట్లు మంజూరు కాగా, ఇందులో ఆదిలాబాద్‌ నియోజకవర్గానికి వంద యూనిట్లు, బోథ్‌కు వంద యూనిట్లు, ఆసిఫాబాద్‌కు 23 యూనిట్లు, ఖానాపూర్‌ నియోజకవర్గానికి 26యూనిట్లను మంజూరు చేసి.. లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేశారు. ఇందుకు ప్రభుత్వం రూ.24కోట్ల 90లక్షల నిధులను విడుదల చేసింది. ఇప్ప టివరకు రూ.22 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. యూనిట్ల ఎంపికపై లబ్ధిదారులకు సరైన అవగాహన లేకపోవడం, యూనిట్ల గ్రౌండింగ్‌లో జాప్యం జరుగుతూనే ఉంది. దీంతో క్షేత్రస్థాయిలో పథక అమ లుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

డబ్బులున్నా.. ఖర్చు చేయలేని పరిస్థితి

దళితబంధు పథకం కింద ఎంపికైనా లబ్ధిదారుల ఖాతాల్లో ఇప్పటికే అధికారు లు నగదును జమ చేసిన ఆర్థిక ఆంక్షలు విధించడంతో ఖాతాల్లో డబ్బులున్నా.. ఖర్చు చేయలేని పరిస్థితి ఏర్పడిందని లబ్ధిదారులు వాపోతున్నారు. డ్రైవింగ్‌ అనుభవం కలిగి ఉన్న లబ్ధిదారులు కార్లను కొనుగోలు చేసుకుని అద్దెకు నడుపుతూ ఆదాయం పొందుతుండగా.. డెయిరీ, గొర్రె, మేకల యూనిట్లు మాత్రం ఇంకా గ్రౌండింగ్‌ కావడం లేదు. పశుగ్రాసం కొరత, షెడ్డు నిర్మాణం లేదంటూ అధికారులు జాప్యం చేస్తూ నిధులపై ఆంక్షల ను ఎత్తివేయడం లేదు. దీంతో లబ్ధిదారులకు గత నాలుగు నెలలుగా ఎదురుచూపులు తప్పడం లేదు. డెయిరీ ఫాంల ఏర్పాటుకు ప్రస్తుతం అనుకూల సమయే ఉన్నప్పటికీ.. పశుగ్రాసం పేరిట అధికారులు కొర్రీలు పెట్టడం ఏమిటన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వర్షాకాలం కావడంతో పుష్కలంగా పశుగ్రాసం అందుబాటులో ఉన్నా.. నిధులపై ఫ్రీజింగ్‌ ఎత్తి వేసేందుకు అధికారులు ఆసక్తి చూపడం లేదు. పశు సంవర్దక శాఖ ఆదేశాల మేరకే డెయిరీ, గొర్రె మేక ల యూనిట్లను అందజేస్తామని శాఖాధికారులు పేర్కొంటున్నారు. నెలల తరబ డి యూనిట్ల గ్రౌండింగ్‌లో జాప్యం జరుగడంతో లబ్ధిదారులు ఊగిసలాటలో పడుతున్నారు. దళితబంధు పథకం కింద ఎంపిక కావడంతో యూనిట్లపై ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నారు. ఇప్పటికే  కొన్నిచోట్ల గొర్రె, మేకల యూనిట్లను లబ్ధిదారులకు అందజేసినా.. అక్కడక్కడ అమ్మేసుకున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో అధికారులు ఆచితూచి అడుగులు వేస్తునట్లు తెలుస్తుంది. 

నేతల వద్దకు పరుగులు

మొదటి విడత దళితబంధు పథకం అమలు ప్రారంభం కావడంతో రెండో విడతపై ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నారు. లబ్ధిదారుల ఎంపిక కోసం అధికార పార్టీ నేతల వద్దకు పరుగులు తీస్తున్నారు. దాదాపుగా మొదటి విడత పూర్తికావడంతో రెండో విడత ఎప్పుడనే దానిపై ఆసక్తి కనిపిస్తోంది. ఇప్పటికే నియోజకవర్గానికి వంద యూనిట్ల చొప్పున ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. రెండో విడతలో నియోజకవర్గానికి 1500 నుంచి మూడు వేల వరకు లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై జిల్లా అధికారులతో రాష్ట్ర స్థాయి నేతలు సమీక్ష సమావేశాన్ని కూడా నిర్వహించినట్లు తెలుస్తుంది. దీంతో మొదటి విడతలో అవకాశం దక్కని వారంతా రెండో విడతపై ఆశతో ఉన్నారు. ఇప్పటికే పలు మండలాల్లో రెండో విడత కింద యూనిట్లను ఇప్పిస్తామంటూ కొందరు అధికార పార్టీ నేతలు దళిత కుటుంబాల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తుంది. అధికార పార్టీకి చెందిన వారికే మొదట అవకాశం దక్కిందన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఎమ్మెల్యేలు సూచించిన జాబితానే అధికారు లు ఫైనల్‌ చేయడంతో గ్రామాల్లో వివాదాలకు దారి తీస్తోంది. కొందరు స్థానిక నేతలైతే లబ్ధిదారుల నుంచి ముందుగానే తెల్లకాగితాలపై అంగీకారం తీసుకుం టూ యూనిట్లను మంజూరు చేయిస్తున్నట్లు తెలుస్తుంది. తమ మాట వినని వారికి దళితబంధు రాదంటూ ప్రచారం చేయడంతో దళిత కుటుంబాలు అయోమయానికి గురవుతున్నాయి.

జిల్లాలో మొదటి విడతను త్వరలోనే పూర్తి చేస్తాం

: శంకర్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ, ఆదిలాబాద్‌

మొదటి విడత కింద జిల్లాకు మంజూరైన కొన్ని యూనిట్ల గ్రౌండింగ్‌ను చేయాల్సి ఉంది. ముఖ్యంగా డెయిరీ ఫాం, గొర్రె మేకల యూనిట్లను అందించాల్సి ఉంది. వర్షాలు తగ్గుముఖం పడితే సీజనల్‌ వ్యాధుల ముప్పు ఉండదని పశు సంవర్ధక శాఖాధికారులు చెబుతున్నారు. దీంతోనే కొంత ఆలస్యమవుతోంది. ఇప్పటికే అందించిన యూనిట్లు అక్కడక్కడ అమ్మేసుకుంటున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం అందించే రూ.10 లక్షల నిధులు పూర్తిస్థాయిలో సద్వినియోగమయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. రెండో విడతపై ఇంకా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు అందలేదు. 

Updated Date - 2022-08-20T06:13:10+05:30 IST