దళిత బంధు పథకం కోసం రూ. 500 కోట్లు

ABN , First Publish Date - 2021-07-29T20:46:32+05:30 IST

రాష్ట్రంలో దళితుల అభ్యున్నతి కోసం దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం ముందుకు తెచ్చింది. దళితుల జీవితాల్లో గుణాత్మకమార్పు

దళిత బంధు పథకం కోసం రూ. 500 కోట్లు

హైదరాబాద్: రాష్ట్రంలో దళితుల అభ్యున్నతి కోసం దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం ముందుకు తెచ్చింది. దళితుల జీవితాల్లో గుణాత్మకమార్పు తీసుకురావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ దళిత బంధు పథకానికి రూపకల్పన చేసి హుజురాబాద్‌ నుంచే ఆ పథకం అమలుకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. అందులోభాగంగా దళిత బంధు కోసం మొదటి విడతలో ఐదు వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. పైలెట్ ప్రాజెక్టు కింద హుజురాబాద్‌లో అమలు చేసేందుకు ప్రభుత్వం ఫండ్స్ రిలీజ్ చేసింది. హుజురాబాద్ నియోజకవర్గానికి రెండువేల కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇప్పటికే దళిత బంధు పథకం అమలు కార్యాచరణపై కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో దళిత బంధు పథకం లబ్ధిదారులకు కొత్తగా ‘దళిత బీమా’ పథకాన్ని కూడా తీసుకురావడానికి ప్రభుత్వం ఆలోచిస్తోందని కేసీఆర్‌ చెప్పారు. ఈ సదస్సులో మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, హరీశ్‌రావు, దళిత ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, వివిధ శాఖ ముఖ్య కార్యదర్శులు, కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ కర్ణన్‌, హుజూరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన 450 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. 


పైలట్‌ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌

హుజూరాబాద్‌ నియోజకవర్గాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా ఎంచుకొని ఇక్కడి నుంచే ఈ పథకం అమలును ప్రారంభించనున్నారు. నియోజవకర్గంలోని హుజూరాబాద్‌ మండలంలో 5,323 దళిత కుటుంబాలకు, కమలాపూర్‌ మండలంలోని 4,346 కుటుంబాలకు, వీణవంక మండలంలోని 3,678 కుటుంబాలకు, జమ్మికుంట మండలంలోని 4,996 కుటుంబాలకు, ఇల్లందకుంట మండలంలో 2,586 కుటుంబాలకు మొత్తం హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని 20,929 మంది దళిత కుటుంబాల నుంచి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. నిబంధనల మేరకు ఎంపిక చేసిన లబ్ధిదారుల కుటుంబాలకు పరిపూర్ణ స్థాయిలో ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. 


Updated Date - 2021-07-29T20:46:32+05:30 IST