‘దళిత బంధు’ ఓ ఎన్నికల మాయ

ABN , First Publish Date - 2021-07-23T09:41:01+05:30 IST

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడు సంవత్సరాలు గడుస్తున్నా ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలను నేరవేర్చలేదు. ఇప్పుడు సరికొత్తగా దళితబంధు పథకాన్ని...

‘దళిత బంధు’ ఓ ఎన్నికల మాయ

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడు సంవత్సరాలు గడుస్తున్నా ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలను నేరవేర్చలేదు. ఇప్పుడు సరికొత్తగా దళితబంధు పథకాన్ని ప్రకటించింది. దళితుల అభివృద్ధి కోసం 50 వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం చెప్తున్నా ఆ నిధులను దారి మళ్లించి ఇతర పథకాలకు వాడుకుంటుంది. అనేక  సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న ఎస్సి బ్యాక్‌లాక్ పోస్టులను భర్తీ చేయలేదు. ఫీజు రీయంబర్స్‌మెంట్‌ పథకాన్ని సరిగ్గా వర్తింపచేయకపోవడం వల్ల అనేక మంది విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు. మొన్న వనపర్తి జిల్లాకు చెందిన లావణ్య అనే దళిత ఇంజనీరింగ్ విద్యార్థి, ప్రభుత్వం రీయంబర్స్‌మెంట్‌ నిథులు విడుదల చేయని కారణంగా ఫీజు కట్టలేక సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య చేసుకుంది. దీనిపై వివరణకు సంబంధించి కానీ, పరిహారం గురించి కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన ఇంతవరకూ వెలువడలేదు.


దళితులపై అక్రమంగా ఎన్నో కేసులకు బనాయిస్తున్నారు. గతంలో పదవీ విరమణ చేసిన అనురాగ్ శర్మ, రాజీవ్ శర్మ లాంటి ఉన్నతాధికారులను ప్రభుత్వ సలహాదారులుగా పెట్టుకుంది కానీ దళిత ఉన్నతాధికారులు పదవీ విరమణ చేసినా వారి సేవలను ఉపయోగించుకోవడం లేదు, ఎస్సీ కార్పొరేషన్, ఎస్సీ కమిషన్ లకు చైర్మెన్‌ను, సభ్యులను నియమించలేదు. నిజంగా దళితుల పై ప్రేమే ఉంటే ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని కేవలం హుజురాబాద్‌కే పరిమితం చేయదు. రాష్ట్రంలో ఉన్న రిజర్వుడు నియోజక వర్గాలన్నిటిలో అమలు చేయాల్సింది పోయి కేవలం ఒక్క నియోజక వర్గంలో అమలు చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతి, ఇస్తామని 50,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిన ప్రభుత్వ పెద్దలు ఆ ఎన్నికలు గడిచి ఆరు నెలలు కావస్తున్నా వాటిని ఆచరణలో పెట్టలేదు. దళితబంధు కూడా అలాగే ఉంటుందని అనుమానం లేకపోలేదు. దళితుల అభివృద్ధి అంటే ఆర్థిక సాయమే కాదు వారికి విద్య, ఉపాధి అవకా శాలలో సరైన ప్రాధాన్యం ఇవ్వాలి, ప్రస్తుతం ఉన్నటువంటి దళిత సాధికారికత పథకాలను బలోపేతం చేయాలి. దళిత బంధు పథకం కేవలం ఎన్నికల కోసమే తెచ్చి దళితులను పావుగా వాడుకుంటే మాత్రం భవిష్యత్తులో ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్పకతప్పదు ఇది ప్రభుత్వం గ్రహించాలి.

చింత ఎల్లస్వామి

ఉస్మానియా యూనివర్సిటీ

Updated Date - 2021-07-23T09:41:01+05:30 IST