Advertisement
Advertisement
Abn logo
Advertisement

దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్ సంచలన నిర్ణయం

కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా పేస్ లెజెండ్ డేల్ స్టెయిన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు నేడు (మంగళవారం) ప్రకటించాడు. 38 ఏళ్ల స్టెయిన్ ట్విట్టర్ ద్వారా తన రిటైర్మెంట్‌ను ప్రకటించాడు. స్టెయిన్ తన 17 ఏళ్ల సుదీర్ఘ కెరియర్‌లో 93 టెస్టుల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. 439 వికెట్లు పడగొట్టాడు. అలాగే, 125 వన్డేల్లో 196 వికెట్లు తీసుకున్నాడు. 47 టీ20లలో 64 వికెట్లు పడగొట్టాడు.  


గాయాల కారణంగా స్టెయిన్ ఆగస్టు 2019లోనే టెస్టుల నుంచి తప్పుకున్నాడు. మిగతా క్రికెట్ నుంచి ఈ ఏడాది తప్పుకోవడమే మంచిదని నమ్ముతున్నానని స్టెయిన్ తన పోస్టులో పేర్కొన్నాడు. గత 20 ఏళ్లుగా ట్రైనింగ్, మ్యాచ్‌లు, ప్రయాణం, విజయాలు, ఓటములు, జెట్‌లాగ్, ఆనందం, సోదరభావం వంటి వాటితో గడిపేశానని పేర్కొన్నాడు. చెప్పేందుకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయన్నాడు. చాలామందికి కృతజ్ఞతలు చెప్పాల్సి ఉందన్నాడు.


తాను ఎంతో ప్రేమించే క్రికెట్ నుంచి ఈ రోజు అధికారికంగా రిటైర్ అవుతున్నానని పేర్కొన్న స్టెయిన్.. కొన్ని చేదు అనుభవాలు, మరికొన్ని మధుర జ్ఞాపకాలు ఉన్నాయని, ఏదేమైనా వాటికి తాను కృతజ్ఞతగా ఉంటానని అన్నాడు. తన కుటుంబ సభ్యుల నుంచి జర్నలిస్టులు, అభిమానులు సహా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నాడు. 

Advertisement
Advertisement