Abn logo
Feb 21 2020 @ 00:10AM

ఎనీటైమ్‌... ఇంటి భోజనం!

రుచికరమైన, ఆరోగ్యకరమైన ఇంటిభోజనాన్ని తక్కువ ధరకు అందించడమే కాదు... మహిళా సాధికారతకు పాటుపడుతున్నారు ఢిల్లీకి చెందిన ప్రేరణ. స్వానుభవం నుంచి వచ్చిన ఒక ఆలోచనను భర్తతో కలిసి ఆచరణలో పెట్టారామె. ‘దాల్చిని’ పేరుతో ఇంటి భోజనాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఏటీఎం తరహా మిషన్ల ద్వారా విక్రయిస్తూ సరికొత్త  స్మార్ట్‌ వ్యాపారానికి బాటలు వేశారు.


స్మార్ట్‌ఫోన్‌లో ఎన్ని ఫుడ్‌ డెలివరీ యాప్‌లు ఉన్నా ఇంటి భోజనానికి అవేవీ సాటిరావు. ముంబయిలో ‘డబ్బావాలా’లు అన్నిచోట్లా లేరు కదా. అలాంటప్పుడు ఎక్కడున్నా ఇంటిభోజనం తినడం ఎలా సాధ్యం? అంటే ‘సాధ్యమే’ అని నిరూపించారు ఢిల్లీకి చెందిన ప్రేరణా కల్రా, విద్యాభూషణ్‌ దంపతులు. 

వీరిద్దరూ గతంలో పేటీఎం సంస్థలో పనిచేసేవారు. ప్రేరణ గర్భవతిగా ఉన్నప్పుడు ఉద్యోగం, ఇంటి బాధ్యతలు చూసుకోవడం, వంట చేసుకోవడం కష్టంగా ఉండేది. ‘ఇంటిభోజనం దొరికితే బావుణ్ణు’ అనిపించేది. ఆ సమయంలో కుటుంబ సభ్యుల సహకారంతో ఆమె ఆ ఇబ్బందిని అధిగమించారు. కానీ తనలాగా ఇంటి భోజనం దొరక్క ఇబ్బంది పడేవారి గురించి ఆలోచించినప్పుడు ఆమెకు సరికొత్త వ్యాపార ఆలోచన వచ్చింది. 


ఫుడ్‌ డెలివరీ యాప్‌లకు కాస్త భిన్నంగా...

రెండేళ్ల క్రితం ‘దాల్చిని’ అనే పేరుతో వినూత్న వ్యాపారాన్ని చేపట్టారు. ముందుగా వంటలో కొంతమంది గృహిణుల నైపుణ్యాలను పరీక్షించి ఎంపిక చేశారు. వారికి కావలసిన శిక్షణ ఇచ్చారు. ఇంట్లోనే వంటకు సదుపాయాలు కల్పించారు. అయితే డెలివరీ విషయంలో కొత్త పంథాను ఎంచుకున్నారు. ఫుడ్‌ యాప్‌ల్లాగా ఆర్డరివ్వగానే పార్శిళ్లు, బైక్‌లపైన డెలివరీ ఉండదు. నిర్వహణ ఖర్చులు తగ్గించేందుకు సొంతంగా ఏటీఎం లాంటి డిజిటల్‌ విక్రయ యంత్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు ఈ విక్రయ యంత్రాల్లో 300 ఐటమ్‌లు పెడతారు. సాయంత్రం 4 గంటలకు మరోసారి ఉంచుతారు. లోపల ఉష్ణోగ్రతలను తగు విధంగా ఉంచడం వల్ల ఆహార పదార్థాలు తాజాగా, వేడిగా ఉంటాయి.


ఫుడ్‌ ధర సామాన్యులకు అందుబాటులో ఉంటుంది. ఇందులో ఉంచే ఆహార పదార్థాలు, చిరుతిళ్ల ధరలు కేవలం 39 నుంచి 79 రూపాయలు మాత్రమే. ప్రారంభంలో రెండు డిజిటల్‌ విక్రయ యంత్రాల ద్వారా ఇంటి భోజనం అందించారు. వాటికి ఆదరణ పెరగడంతో క్రమంగా ఇంటిభోజనం అమ్మే యంత్రాల సంఖ్య 170కు చేరింది. రోజూ 8 వేల ఆర్డర్లు వస్తున్నాయి. ఈ యంత్రాలను ఆఫీసులు, హాస్పిటళ్లు, హాస్టళ్లు, రైలు, బస్‌ స్టేషన్లలో ఏర్పాటు చేశారు. వినియోగదారులు ‘దాల్చిని’ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని మొబైల్‌ వ్యాలెట్‌ ద్వారా చెల్లింపులు జరిపి కావలసిన ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తే వారి యాప్‌లో ఓ కోడ్‌ వస్తుంది. ఆ కోడ్‌ను ఎంటర్‌ చేస్తే చాలు యంత్రంలో నుంచి కావలసిన ఆహారపదార్థాల ప్యాకెట్లు బయటకొస్తాయి. 


అరటిచిప్స్‌, వడపావ్‌, శాండ్‌విచ్‌లు, వెజిటబుల్‌ ఊతప్పం, ఇడ్లీ, వడ లాంటి వంటకాలు, రకరకాల స్నాక్స్‌ను అందిస్తున్నారు. ఒకే తరహా ఆహారంతో బోర్‌ కొట్టకుండా ప్రతి రోజూ మెనూను మార్చుతారు. ఒకరోజు రాజ్‌మా చావల్‌, రోటీలు ఇస్తే మరుసటి రోజు చోలే  చావల్‌ ఇస్తారు. అలాగే దాల్‌ రోటీలు, మేథీ పరాటాల్లాంటి రుచికరమైన వంటకాలు ఆరగించొచ్చు. ముంబయి, చండీగఢ్‌, ఢిల్లీ నగరాలతో పాటు త్వరలోనే మరిన్ని నగరాల్లో వ్యాపారాన్ని విస్తరించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. 

పురస్కారాలు... ప్రశంసలు...

ప్రేరణ ఆలోచన వల్ల ఇంటిపట్టున ఉండే గృహిణులకు ఇది ఒక మంచి ఉపాధి అవకాశంగా మారింది. ప్రస్తుతం 20 మంది గృహిణులు వారి సేవలు అందిస్తున్నారు. 60 శాతం యంత్రాలను మహిళలే ఫ్రాంచైజీగా నడుపుతున్నారు. ఆహారం శుచిగా రుచిగా ఉండడంతో ఆహారప్రియుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఒక్కో గృహిణి నెలకు 30 వేల రూపాయల వరకూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఆరోగ్యకరమైన భోజనం తక్కువ ధరకే లభిస్తుండటంతో ఆఫీసుల్లో ‘దాల్చిని’ ఫుడ్‌ వెండింగ్‌ మిషన్ల ఏర్పాటుకు అనుమతులు ఇస్తున్నారు. ‘దాల్చిని’ స్టార్టప్‌నకు ఇప్పటికే అనేక పురస్కారాలు, ప్రశంసలు దక్కాయి. గతేడాది ‘నీతి ఆయోగ్‌’ ద్వారా ‘అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌’కు ఎంపికయ్యింది. ‘సూత్ర’ హెచ్‌ఆర్‌ ప్రకటించిన టాప్‌ 100 స్టార్టప్‌ల జాబితాలో చోటుదక్కింది. దాల్చిని ద్వారా రానున్న రోజుల్లో వేలమంది మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పించాలనే లక్ష్యంతో ప్రేరణ తన వ్యాపార వ్యూహాలను రచిస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement