దళారే రైతు..

ABN , First Publish Date - 2022-08-01T04:50:04+05:30 IST

జిల్లాలో గతేడాది అక్టోబరు నుంచి ఈ ఏడాది జూలై వరకు ఖరీఫ్‌, రబీ సీజన్లలో రైతు భరోసా కేంద్రాల ద్వారా 23880 ఎఫ్‌టీవోల (రైతు లావాదేవీ ఖాతా) ద్వారా రూ.1019.76 కోట్ల ధాన్యాన్ని ప్రభుత్వ కేంద్రాల్లో కొనుగోలు చేశారు.

దళారే రైతు..
జిల్లాలో సాగిన ధాన్యం కొనుగోళ్లు (ఫైల్‌)

అన్నదాత పేరుతో భారీ కుంభకోణం

ధాన్యం కొనుగోళ్లలో కిరికిరి

భూమి లేకుండానే ధాన్యం విక్రయాలు!

రైతులపై పేరు మీదే లావాదేవీలు

భోక్తల ఖాతాల్లోకి రూ.34.24 కోట్లు

మరో రూ.14.6 కోట్ల అనుమానాస్పద చెల్లింపులు

అధికారుల తనిఖీల్లో వెలుగులోకి..


రైతుల ముసుగులో భారీ కుంభకోణం. అన్నదాతల పేరిట కొన్ని రూ.కోట్ల ప్రజాధనాన్ని ప్రైవేటు వ్యక్తులు దోచుకున్న వ్యవహారం బయటకొచ్చింది. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరుగుతున్నాయని మొదటి నుంచీ ఆరోపణలు వినిపిస్తుండగా ఇప్పుడు అదే నిజమని తేలిపోయింది. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై ఇటీవల అధికారులు జరిపిన తనిఖీల్లో ఈ భారీ మోసం వెలుగు చూసింది. భూమి లేకపోయినా ఉన్నట్లు ఈ-క్రా్‌పలో చూపించి ధాన్యం విక్రయించడం, చెరువులు, రోడ్లను కూడా పొలాలుగా చూపించడం, రైతులకు తెలియకుండా వారి పేరు మీద లావాదేవీలు జరపడం వంటి వ్యవహారాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇందులో ఆర్‌బీకే సిబ్బంది, పౌరసరఫరాల సంస్థ సిబ్బంది, మిల్లర్లు, దళారుల పాత్రపై అనుమానాలు కలుగుతున్నాయి. 


నెల్లూరు, జూలై 31 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో గతేడాది అక్టోబరు నుంచి ఈ ఏడాది జూలై వరకు ఖరీఫ్‌, రబీ సీజన్లలో రైతు భరోసా కేంద్రాల ద్వారా  23880 ఎఫ్‌టీవోల (రైతు లావాదేవీ ఖాతా) ద్వారా రూ.1019.76 కోట్ల ధాన్యాన్ని ప్రభుత్వ కేంద్రాల్లో కొనుగోలు చేశారు. అయితే ఈ కొనుగోళ్ల సమయంలో అనేక ఆరోపణలు, సమస్యలు తలెత్తాయి. ఆశించినస్థాయిలో కొనుగోళ్లు జరగకపోవడంతో మెజారిటీ రైతులు దళారులను ఆశ్రయించి తక్కువ ధరకు అమ్ముకున్నారు. ఆ దళారులు అదే ధాన్యాన్ని ప్రభుత్వ కేంద్రాల్లో విక్రయిస్తున్నారంటూ మొదటి నుంచి ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో రూ.3 లక్షలు దాటి ధాన్యం విక్రయించిన ఎఫ్‌టీవోలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అటువంటి ఎఫ్‌టీవోలు జిల్లాలో 4484 ఉన్నట్లు గుర్తించిన అధికారులు ఇటీవల తనిఖీలు చేపట్టారు. జేసీ రోణంకి కూర్మనాథ్‌తో పాటు పౌరసరఫరాల సంస్థ డీఎం, ఆర్డీవోలు, తహసీల్దార్‌లు క్షేత్రస్థాయిలో విచారణ జరిపారు. ప్రతి రైతు వద్దకు వెళ్లి మీకు ఎంత భూమి ఉంది, ఎక్కడ, ఎంత ధాన్యం విక్రయించారు? వంటి వివరాలు సేకరించారు. ఈ క్రమంలోనే అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. విచారణ జరిపిన వాటిల్లో 3914 ఎఫ్‌టీవోలు సవ్యంగా ఉన్నాయని, మిగిలినవే అనుమానాస్పదంగా ఉన్నాయని గుర్తించారు. వాటిపై మరింత లోతుగా విచారణ జరిపి 525 ఎఫ్‌టీవోల ద్వారా రూ.34.24 కోట్లు విలువైన ధాన్యాన్ని రైతులు కాకుండా ఇతరులు విక్రయించారని తేల్చారు. భూమి లేకపోయినా ఈ-క్రా్‌పలో ఉన్నట్లు రికార్డు చేయడం, చెరువులు, రోడ్లను కూడా పొలాలుగా రికార్డు చేసి ఆ సర్వే  నెంబర్ల మీద ధాన్యాన్ని ప్రభుత్వ కేంద్రాల్లో విక్రయించారు. అలానే మరో 234 ఎఫ్‌టీవోలకు సంబంధించి రూ.14.60 కోట్ల విలువైన ధాన్యం కొనుగోళ్లపై పలు రిమార్కులను రాశారు. ఇక్కడ మెజారిటీగా రైతుకు సంబంధం లేకుండా వారిపేరు మీద వేరొకరు ధాన్యం విక్రయించారు. ఒకరకంగా ఇది కూడా మోసమేనని అధికారులు చెబుతున్నారు. 


అంతా ఆర్‌బీకేల్లోనే?


గడిచిన రెండేళ్లుగా ధాన్యం కొనుగోళ్లలో అనేక అవకతవకలు జరుగుతున్నట్లు ప్రతి సీజనలోనూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం కనీస మద్దతు ధర రూ.16,660గా నిర్ణయించినా ఆ మేరకు రైతుకు దక్కడం లేదు. ఈదఫా ఆర్‌బీకేల ద్వారా ధాన్యం కొనుగోళ్లు జరిపారు. ధాన్యం తీసుకొని వెళితే అక్కడ సవాలక్ష సమస్యలు ఎదురవయ్యేవి. దీంతో రైతులు బహిరంగ మార్కెట్‌ను ఆశ్రయించారు. అడపాదడపా వర్షాలు పడుతుండడంతో నిల్వ చేసుకునే వసతి లేక దళారులకు పుట్టి రూ.14 వేలలోపే మెజారిటీ రైతులు అమ్మేశారు. మిల్లర్లే దళారుల అవతారమెత్తి తక్కువ ధరకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైతులకే తెలియకుండా వారి పేరు మీదనే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి పుట్టికి రూ.2500కుపైగా సంపాదించకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మరికొన్ని చోట్ల వైసీపీ నాయకులు కూడా దళారుల అవతారమెత్తి రైతుల ముసుగులో అక్రమాలకు పాల్పడినట్లు విమర్శలున్నాయి. అలానే రేషన బియ్యాన్ని బయట మార్కెట్లో కేజీ రూ.10 కొనుగోలు చేస్తున్నారు. వీటిని పాలీష్‌ పట్టి ఆ బియ్యాన్నే మళ్లీ ప్రభుత్వానికి ఇచ్చినట్లు అధికారుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకోసమే చెరువులు, రోడ్లు, పంట లేని భూములను కూడా ఈ-క్రా్‌పలో నమోదు చేశారనే అనుమానిస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేయాలంటే ఈ-క్రాప్‌ తప్పనిసరి కావడంతో రైతు భరోసా కేంద్రాల్లోనే అక్రమాలకు తెరలేచినట్లు ప్రచారం జరుగుతోంది. వ్యవసాయ శాఖ సిబ్బంది, సచివాలయ సిబ్బంది సహాయం లేకుండా ఈ-క్రాప్‌ నమోదు చేయడం సాధ్యం కాదు. దీంతో వారి పాత్రపై అనుమానాలు కలుగుతున్నాయి. అలానే పౌరసరఫరాల సంస్థ సిబ్బందికి తెలియకుండా ఇదంతా జరిగిందా.. అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఇలా రైతులకు దక్కాల్సిన మద్దతు ధర వారికి దక్కకుండా రూ.కోట్లను భోక్తలు జేబులో వేసుకున్నారు. 


రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదిక పంపాం 


జాయింట్‌ కలెక్టర్‌ ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోళ్లలో అనుమానాలు ఉన్న ఎఫ్‌టీవోలపై విచారణ జరిపాం. ఇక్కడ గుర్తించిన విషయాలను రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదించాం. వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయి. 

- పద్మ, డీఎం, పౌరసరఫరాల సంస్థ

Updated Date - 2022-08-01T04:50:04+05:30 IST