జో బైడెన్‌కు ఆధ్యాత్మిక నేత దలైలామా శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2021-01-21T20:20:29+05:30 IST

అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన జో బైడెన్‌కు టిబెట్‌కు చెందిన ఆధ్యాత్మిక నేత దలైలామా గురువారం శుభాకాంక్షలు తెలిపారు. జో బైడెన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ దలైలామా ఆయనకు లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలపై

జో బైడెన్‌కు ఆధ్యాత్మిక నేత దలైలామా శుభాకాంక్షలు

ధర్మశాల: అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన జో బైడెన్‌కు టిబెట్‌కు చెందిన ఆధ్యాత్మిక నేత దలైలామా గురువారం శుభాకాంక్షలు తెలిపారు. జో బైడెన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ దలైలామా ఆయనకు లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలపై దలైలామా మాట్లాడారు. జో బైడెన్ వాతావరణ మార్పు అంశానికి అత్యధిక ప్రాధాన్యతనివ్వడాన్ని దలైలామా ప్రశంసించారు. పారిస్ వాతావరణ ఒప్పందంలో అమెరికాను తిరిగి చేర్చడాన్ని కొనియాడారు.‘నేను అమెరికా దేశాన్ని, అక్కడి ప్రజాస్వామ్యం, స్వేచ్చ, న్యాయపాలనను ఎంతో కాలం నుంచి ఆరాధిస్తున్నాను. ప్రపంచం మొత్తం అమెరికా నాయకత్వంపైనే తమ ఆశను ఉంచుతుంది’ అని లేఖలో ప్రస్తావించారు. 


జో బైడెన్ దీర్ఘకాలంగా టిబెట్ ప్రజలకు మద్దతిస్తూ వచ్చినందుకు దలైలామా కృతజ్ఞతలు తెలిపారు. ఆకలి, వ్యాధి, హింస వంటి వాటితో బాధపడుతున్న ప్రజలకు సహాయం లభించే విధంగా శాంతియుతమైన ప్రపంచాన్ని నెలకొల్పేందుకు బైడెన్ ప్రభుత్వం దోహదపడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా.. బుధవారం ఉదయం(అమెరికా కాలమానం ప్రకారం) అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ ప్రమాణ స్వీకారం చేశారు. 

Updated Date - 2021-01-21T20:20:29+05:30 IST