దైవలక్షణాలు.. అసురలక్షణాలు

ABN , First Publish Date - 2020-03-20T09:40:38+05:30 IST

దైవీ లక్షణాలు ముక్తిదాయకం. అసుర లక్షణాలు భవబంధ ప్రేరకాలు. దైవ లక్షణాలు కలిగినవారు తోటివారిపట్ల, సమస్త జీవుల పట్ల దయ, కరుణ, వాత్సల్యం కలిగి ఉంటూ

దైవలక్షణాలు.. అసురలక్షణాలు

దైవీ లక్షణాలు ముక్తిదాయకం. అసుర లక్షణాలు భవబంధ ప్రేరకాలు. దైవ లక్షణాలు కలిగినవారు తోటివారిపట్ల, సమస్త జీవుల పట్ల దయ, కరుణ, వాత్సల్యం కలిగి ఉంటూ ధన్యజీవులవుతారు. అసుర భావం కలవారు దుర్లభమైన మానవ జన్మను వృథా చేసుకోవడమేగాక.. సమాజమనే వృక్షాన్ని నిలువునా కూల్చివేసేందుకు ప్రయత్నిస్తారు. ఆ రెండు లక్షణాల గురించి భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా వివరించాడు..


అభయం సత్వసంశుద్ధిః జ్ఞానయోగ వ్యవస్థితిః

దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవమ్‌

అహింసా సత్యమక్రోధః త్యాగః శాంతరపైశునమ్‌

దయా భూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలమ్‌

తేజః క్షమా ధృతిః శౌచమద్రోహో నాతిమానితా

భవంతి సంపదం దైవీమభిజాతస్య భారత


ఇవన్నీ దైవీ లక్షణాలు. వ్యక్తికి భయం అనర్థదాయకం, ధైర్యం కార్యసిద్ధి కారకం. మానవులకు బాహ్య శుద్ధి కన్నా అంతఃకరణ శుద్ధి ఎంతైనా అవసరం. అది శాశ్వతానందాన్ని ప్రసాదించి మరోజన్మలేని పరతత్వ స్థితిని చేర్చుతుంది. ఇంద్రియ నిగ్రహం, దానం, యజ్ఞం, పవిత్ర గ్రంథ పఠనం అన్ని విధాలా శ్రేయోదాయకం. ఇంకా.. ఎదుటివారిలో తప్పులను వెతక్కుండా ఉండడం, సర్వజీవుల పట్ల దయ, నిశ్చలత్వం, క్షమాగుణం, పరిశుభ్రత.. దైవీ లక్షణాలున్న వారిలో ఉంటాయి. అలాగే..


దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ

అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీమ్‌

..దంభం, దర్పం, కోపం, పరుషంగా మాట్లాడటం, అజ్ఞానం, గర్వం ఇవన్నీ అసుర లక్షణాలని కూడా గీతలో భగవానుడు చెప్పాడు. 

అసత్యమప్రతిష్టం తే జగదాహురనీశ్వరం

అపరస్పర సంభూతం కి మన్యత్‌ కామ హైతుకం


ఈ ప్రపంచానికి ఆధారమైంది ఏదీలేదని, భగవంతుడనేవాడు లేడని, కామ ప్రేరితులైన స్ర్తీ- పురుషుల సంయోగం వల్ల సంతానం కలుగుతుంది కాబట్టి సృష్టికి కామమే కారణమని అసురలక్షణాలు గలవారు భావిస్తారు. అలాంటివారు ఆత్మను గూర్చి ఆలోచించరు. దేహభావనే వారికి సర్వస్వం. జగతిలో సమస్త జీవుల్లో ఉండే ఆత్మస్వరూపం ఒకటే అనే సద్భావం వారిలో ఉండదు. వారు తమ మానసాన్ని భిన్నత్వ భావనకుగురిచేసి, ఎదుటివారిపై క్రోధం, ద్వేషం పెంచుకొంటారు. స్వార్థం వారి దేహమంతటా నాట్యమాడుతుంటుంది. తమ కోరిక నెరవేరనప్పుడు అధర్మాచరణతో ఎంతటి దుర్మార్గానికైనా ఒడిగడతారు. జనన, మరణ, చక్రభ్రమణాన్ని కోరి తెచ్చుకొంటారు. అందుకే అసురలక్షణాలకు వీడ్కోలు.. దైవలక్షణాలకు స్వాగతం పలికి పరమేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కావాలి.

- వల్లూరు చిన్నయ్య, 9948348918

Updated Date - 2020-03-20T09:40:38+05:30 IST