Abn logo
May 12 2021 @ 01:33AM

సహకార స్ఫూర్తిని పరిరక్షించని డెయిరీ బోర్డు

విశిష్ట వ్యక్తిత్వం, అపూర్వ దాతృత్వం కలిగిన కర్ణుడు కేవలం చెడ్డ సాంగత్యం వల్ల అధర్మపరుడిగా చరిత్రలో నిలిచిపోయాడు. అదేవిధంగా సహకార పాడి వ్యవస్థలో గత ఏడున్నర శతాబ్దాలుగా ప్రపంచానికే ఆదర్శప్రాయంగా నిలిచిన అమూల్‌ డెయిరీ ఈనాడు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో చేతులు కలిపి, ఏపీ లోని సంగం డెయిరీతో పాటు ఇతర డెయిరీల ఆస్తులను కబళించే ప్రయత్నాలకు పాల్పడడం బాధాకరం. 1964లో నాటి ప్రధాని ఆకాంక్షల మేరకు అమూల్‌ తరహా మూడంచెల పాల సహకార వ్యవస్థను దేశవ్యాప్తంగా ఏర్పాటుచేసే ఏకైక లక్ష్యంతో గుజరాత్‍లోని ఆనంద్‌లో ప్రారంభమైన నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంటు బోర్డు (ఎన్‌డిడిబి) సైతం ఇప్పుడు సహకార స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించడం శోచనీయం. పాల సేకరణ కోసం ఒక సహకార సంస్థ వేరొక సహకార సంస్థ పాలసేకరణ పరిధిలోకి ప్రవేశించి అనారోగ్యకరమైన పోటీని నెలకొల్పకుండా చూడవలసిన బాధ్యతను ఇప్పుడు ఏపీ విషయంలో ఎన్‌డిడిబి విస్మరించింది. గుజరాత్ మిల్క్‌ మార్కెట్‌ ఫెడరేషన్‌, దానికి అనుబంధంగా ఉన్న జిల్లా మిల్క్‌ యూనియన్లు, కొన్ని వేల గ్రామీణ సహకార సంఘాలు నేటికీ 1964 సహకార చట్టం ప్రకారమే నడుస్తున్నాయి. అయితే లక్షలాది పాల ఉత్పత్తిదారులకు వివిధ రకాల ప్రయోజనాలు చేకూరుస్తున్న సంగం డెయిరీ వంటి సంస్థలు తొలిసారి పరస్పర సహాయ సంస్థ (1995)గాను, ఆ తదుపరి కంపెనీగాను రూపాంతరం చెందాయి. ఇందులో కొందరి స్వార్థ ప్రయోజనాలు కూడా ఉండి వుండవచ్చు. ఈ సంస్థలకు అనుబంధంగా ఉన్న కొన్ని వేల గ్రామీణ సహకార సంఘాలు మాత్రం ఎన్‌డిడిబి నిర్దేశించినట్లు 1964 సహకార చట్టం కిందనే కొనసాగుతున్నాయి. అంటే ఒక జిల్లా యూనియన్‌ లేదా డెయిరీ కంపెనీని అన్యాక్రాంతం చేస్తే ఆ సంస్థ యజమానులైన పాల సహకార సంఘాల, సభ్యుల అనుమతి అవసరం లేదా?


ఎంతో ముందుచూపుతో శ్వేత విప్లవ పితామహుడు డా. వర్గీస్‌ కురియన్‌ పాల సహకార సంఘాలను రాజకీయాలకు, ప్రభుత్వ బ్యూరోక్రసీకి దూరంగా ఉంచాలనే లక్ష్యంతోనే అమూల్‌ డెయిరీ సమీపంలో ఎన్‌డిడిబి ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచే పాలవెల్లువ పథకాన్ని ఒక మహాశ్వేత విప్లవంగా నడిపించారు. ఈ పథకాలకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందకుండా ఆనాడు ప్రపంచ ఆహార కార్యక్రమం కింద విరాళంగా అందిన పాలపొడి, బటర్‌ ఆయిల్‌ (వెన్న)లను పాలగా మార్చి విక్రయించగా వచ్చిన సుమారు 98 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టి, దేశవ్యాప్తంగా ప్రారంభించిన 18 జిల్లా డెయిరీలలో సంగం డెయిరీ కూడా ఒకటి. ఈ డెయిరీలు ఈరోజు కొన్ని వందల కోట్ల విలువైన పాలను ఉత్పత్తిదారుల నుంచి సేకరిస్తున్నాయి. గిట్టుబాటు ధరకే పాలను నిత్యం సేకరించడంతో పాటు పాల ఉత్పత్తిని పెంచడానికి అవసరమైన పశువైద్య సేవలను, జాతి అభివృద్ధి సేవలను అందిస్తూ, పుష్టివంతమైన సమీకృత దాణాలను సరసమైన ధరలకు సరఫరా చేయడానికి డెయిరీలు వ్యవస్థను ఏర్పాటుచేశాయి. అంతేకాక మేలైన పశుగ్రాసాల సాగుకు సహకారం అందించడం, వార్షిక లెక్కల ద్వారా మిగిలిన నికర లాభాలను బోనస్, ధరల వ్యత్యాసం, డివిడెండు రూపాలలో సభ్యులందరికీ చెల్లించేలా కూడా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. ఇదికాక అంతకుముందు మనకు కనిపించని పటిష్టమైన ఆడిటింగ్‌ వ్యవస్థ, ఎంతో జాగ్రత్తగా రూపొందించిన నిబంధనావళుల వల్ల అమూల్‌ తరహా పాల సహకార సంఘాలు చాలాచోట్ల విజయవంతంగా లాభాలబాటలో పయనిస్తున్నాయి. అయితే 1997లో పరస్పర సహాయ సంఘంగా రూపాంతరం చెందిన సంగం డెయిరీ, 2013 జూన్‌ 18న ‘సంగం మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ కంపెనీ లిమిటెడ్‌’గా మారింది. ఇది ఇప్పుడు ఒక ప్రభుత్వేతర కంపెనీ మాత్రమే. కాబట్టి ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలలో పాలసేకరణను, ఉత్పత్తుల విక్రయాలను, బిస్కెట్లు, కేకులు, ఉలవచారు వంటి ఉత్పత్తులను సైతం విక్రయించి వచ్చే లాభాలను తన వాటాదారులకు పంపిణీ చేస్తోంది. అయితే పాలసేకరణ, విక్రయ, నిర్వహణలు కొంత ప్రత్యేకంగా ఉంటాయి. లాభాలు కేవలం వ్యాపార సామర్థ్యం వల్లనే కాక పాలసరఫరాదారుల అమాయకత్వం, పాలసేకరణ వ్యక్తులు, సంఘాలు పాల్పడే మోసాల వల్ల కూడా రావచ్చు. దీనినే నిర్వాహకులు తమ వ్యాపార సామర్థ్యానికి, దక్షతకు, నిజాయితీలకు సూచికలుగా ప్రకటిస్తూ ఉంటారు కూడా!


నిజమే! పాల సహకార సంఘాలలో సభ్యులుగా చేర్పించుకునే సందర్భాల్లోనూ, ఆ సంఘాలను జిల్లా సంస్థలకు అనుబంధం చేసే సందర్భంలోనూ తొలినాటి నుంచి అధికారపక్షం వారు కులాలకు, రాజకీయ వర్గాలకు అనుకూలంగా పక్షపాతవైఖరిని ప్రదర్శిస్తూ ఉంటారు. అందువల్ల ఈ సంస్థలు గత నాలుగున్నర దశాబ్దాలుగా ఒకే సామాజిక-రాజకీయ వర్గాల ఆధిపత్యంలో సంస్థల పేర్లు, రూపాలు మారినా కొనసాగుతూ ఉండివుండవచ్చు. ఈ అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నాలను కొత్త ప్రభుత్వాలు చేపట్టడంలో తప్పులేదు. అయితే తొందరపాటుతో సంఘాలను, జిల్లా యూనియన్ల పాలక వర్గాలను ప్రభుత్వం ఏకపక్షంగా రద్దుచేయటం వల్ల ప్రయోజనం కంటే ప్రభుత్వానికి వచ్చే అపఖ్యాతే ఎక్కువ. ఇటువంటి తొందరపాటు చర్యనే లోగడ వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేసి, కోర్టు ముందు అవమానం పొందారు. అదే తప్పిదాన్ని సంగం డెయిరీ కంపెనీ స్వాధీనం చేసుకోవడం ద్వారా ప్రస్తుత ప్రభుత్వం చేసింది.


నిజమైన పాల ఉత్పత్తిదారులందరికీ పాల సహకార వ్యవస్థలో సరియైన ప్రాతినిధ్యం కల్పించే దిశగా- సహకార సంఘాలలో ఓటుహక్కుతో కూడిన పాల ఉత్పత్తిదారులను, గ్రామాలను గుర్తించి, అక్కడ సహకార శాఖకు చెందిన అధికారులతో పాటు, పాల సహకార సంఘాల ప్రత్యేకతలు తెలిసిన నలుగురైదుగురు అనుభవజ్ఞులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేయాలి. ఈ బృందాలు గ్రామాలను సందర్శించి, సమావేశాలను ఏర్పాటుచేసి, ఆసక్తి, వనరులు, అర్హతలు కలిగిన వారికి ఆయా సంఘాలలో ప్రాతినిధ్యం కల్పిస్తే, ఇప్పటివరకు అక్రమ మెజారిటీతో అధికారం చెలాయిస్తున్న పాలకవర్గాలకు అడ్డుకట్ట పడుతుంది. ఇదే విధంగా జిల్లా యూనియన్లు, డెయిరీ కంపెనీలలో కూడా అక్రమ ఆధిపత్యాలకు కూడా చెక్‌ పెట్టవచ్చు.


దేశవ్యాప్తంగా సహకార రంగంలో పాడి పరిశ్రమను అభివృద్ధిపరుస్తూ ప్రతి సహకార సంఘాన్ని, యూనియన్‌ను బలోపేతం చేయాల్సిన ప్రాథమిక బాధ్యతను ఎన్‌డిడిబి విస్మరించింది. దానికి కారణం అది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలోని ఒక శాఖలో విభాగంగా ఉండడమే. వర్గీస్‌ కురియన్‌ లక్ష్యాలకు విరుద్ధంగా పనిచేయడం కూడా మరో కారణం. పాల వెల్లువ పథకం ప్రస్తుతం మిల్క్‌ మిషన్‌-1, మిల్క్‌ మిషన్‌-2గా రూపాంతరం చెంది, రెండవ దశ 2020-–2025లో సుమారు 8వేల కోట్ల పెట్టుబడిని వెచ్చించనుంది. వర్తమాన వ్యవస్థలో ఈ సొమ్ములో ఎంత దుబారా కానుందో సంగం డెయిరీకి తగిన జాగ్రత్తలు పాటించకుండా చెల్లించిన సుమారు 116 కోట్ల రూపాయల ఋణమే ఒక ఉదాహరణ. పూర్తిగా సహకార స్ఫూర్తితో నడిచే సహకార సంస్థలకే ఆర్థికసాయంలో ప్రాధాన్యత ఇవ్వాల్సిన ఎన్‌డిడిబి, డెయిరీ కంపెనీకి ఋణం అందించడం హేతుబద్ధంగా లేదు. ఆంధ్రప్రదేశ్‌లో అమూల్‌ పోటీ పాలసేకరణ విధానానికి అడ్డుకట్ట వేసే కనీస బాధ్యతను ఎన్‌డిడిబి విస్మరించడం శోచనీయం. అంతేకాక సంగం డెయిరీ, కృష్ణా డెయిరీ, విశాఖ డెయిరీలు తప్ప ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన అన్ని డెయిరీ ఆస్తులకు నామమాత్రపు వార్షిక అద్దెను నిర్ణయించి, అమూల్‌కు లీజుకు ఇవ్వాలనే ఆలోచన కూడా సమర్థనీయం కాదు. వాస్తవానికి ఎన్‌డిడిబి రంగంలోకి దిగి నష్టాలతో నడుస్తున్న కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం వంటి డెయిరీలను నిపుణులైన తన అధికారులతో నడిపించాలి. తర్వాత సక్రమంగా సహకార సంఘాలను, యూనియన్లను ఏర్పాటుచేసి రెండు మూడేళ్ల తర్వాత ఆయా పాలక వర్గాలకు టర్న్‌కీ ప్రాతిపదికన ఆయా డెయిరీలకు స్వాధీనం చేయవచ్చు. ఈ డెయిరీలకు ఇప్పటికే కోట్లాది రూపాయల విలువైన స్థలాలను, యంత్రాలను రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఎన్‌డిడిబి కూడా అందించింది. బలహీనమైన సంఘాలను, సంస్థలను కాపాడాల్సిన ఎన్‌డిడిబి- అమూల్‌ వంటి సంస్థ చేతికి సహకార డెయిరీ వ్యవస్థను అప్పగించడం పులి నోటికి గొర్రెను అందించడమే.


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లా పాడి రైతుల పట్ల నిజంగా అంత ప్రేమ ఉంటే అమూల్‌ కంపెనీకి బదులుగా ఎన్‌డిడిబిని సంప్రదించి నష్టాల బాటలో ఉన్న డెయిరీల పునరుద్ధరణకు కృషి చేయాలి. ముఖ్యంగా పాలలో ఉప్పుగఱ్ఱ వంటి రాజకీయాలను ఈ సహకార డెయిరీలకు దూరంగా ఉంచాలి.

డా. యంవిజి అహోబలరావు

Advertisement