జల కళ

ABN , First Publish Date - 2020-08-05T10:58:47+05:30 IST

మహబూబ్‌నగర్‌ జిల్లాకు జలకళ వచ్చింది. జిల్లాలో రోజూ ఏదో ఒక సమయంలో వర్షం కురుస్తూనే ఉంది

జల కళ

మహబూబ్‌నగర్‌ జిల్లాలో రోజూ కురుస్తున్న వర్షం

జూలై చివరి నాటికే నిండిన చెరువులు, కుంటలు

జోరుగా సాగుతున్న వ్యవసాయ పనులు


మహబూబ్‌నగర్‌, ఆగస్టు 4: మహబూబ్‌నగర్‌ జిల్లాకు జలకళ వచ్చింది. జిల్లాలో రోజూ ఏదో ఒక సమయంలో వర్షం కురుస్తూనే ఉంది. జిల్లా వ్యాప్తంగా జూలై చివరి నాటికే పలు చెరువులు, కుంటలు నిండి, అలుగులు పారాయి. జిల్లాలోని 15 మండలాల్లోనూ అధిక వర్ష పాతం నమోదు కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. మంగళవారం సీసీకుంటలో 17 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. గండీడ్‌లో 17.9 మిల్లీ మీటర్లు, మహబూబ్‌నగర్‌ రూరల్‌లో 13.5, అడ్డాకులలో 21, భూత్పర్‌లో 14.8, మహబూబ్‌నగర్‌ అర్బన్‌లో 15.6, నవాబ్‌పేటలో 17.7, రాజాపూర్‌లో 16.5, జడ్చర్లలో 23.5, మిడ్జిల్‌లో 16.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.


కోయిల్‌సాగర్‌ వద్ద ముందస్తు హెచ్చరికలు

దేవరకద్ర: కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టుకు జలకళ వచ్చింది. జూరాల నుంచి నీటిని తరలించడంతో ప్రాజెక్టు నీటిమట్టం 29 అడుగులకు చేరింది. దాంతో దేవరకద్ర, చిన్నచింతకుంట, ధన్వాడ, మరికల్‌ మండలాల్లోని ఊకచెట్టు వాగు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు ఏర్పాటు చేసుకున్న మోటార్లు, సామగ్రి తొలగించుకోవాలని ప్రాజెక్టు ఏఈ జాకీర్‌ హుస్సేన్‌ ముందస్తు హెచ్చరికలను జారీ చేశారు. వర్షాలు కురుస్తుండంతో పైభాగం నుంచి ప్రాజెక్టులోకి నీరు చేరే అవకాశం ఉందని, ఇప్పటికే ప్రాజెక్టు షట్టర్ల నుంచి నీరు సన్నగా లీకవుతుందని, షట్టర్లను తెరిచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.


నారాయణపేటలో..

నారాయణపేట: నారాయణపేట జిల్లా వ్యాప్తంగా సోమవారం రాత్రి మోస్తరు వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా నర్వ మండలంలో 34.6 మిల్లీ మీటర్లు, అతి స్వల్పంగా ఊట్కూర్‌ మండలంలో 3.4 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది. దామరగిద్దలో 18.2 మిల్లీ మీటర్లు, నారాయణపేటలో 11.6, మాగనూర్‌లో 14.8, కృష్ణాలో 5, మక్తల్‌లో 10, ధన్వాడలో 5, మరికల్‌లో 5.8, మద్దూర్‌లో 17.2, కోస్గిలో 11.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.


దుందుభీకి చేరుతున్న వరద

ఉప్పునుంతల: రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి మంగళవారం ఉప్పునుంతల, వంగూర్‌ మండలాల్లోని దుందుభీ వాగుకు వరద వచ్చింది. మొల్లర-ఉల్పర కాజ్‌ వేపై వాగు సోమవారం రాత్రి నుంచి ఉధృతంగా ప్రవహిస్తోంది. మరో పది రోజులు వరద కొనసాగుతే డిండి ప్రాజెక్టు నిండు కుండలా మారుతుందని రైతులు అంటున్నారు.


అలుగు పారిన పెద్దవాగు

కొల్లాపూర్‌: కొల్లాపూర్‌ మండలంలోని నార్లాపూర్‌, ముక్కిడిగుండం, మొలచింతలపల్లి, ఎల్లూరు, కొల్లాపూర్‌ పట్టణంలో సోమవారం రాత్రి మోస్తరు వర్షం కురిసింది. 16.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఏఎస్‌ఓ విశ్వేష్‌ పేర్కొన్నారు. నార్లపూర్‌, ముక్కిడిగుండం మధ్యలో ఎర్రగట్టు వద్ద పెద్దవాగు అలుగు పారడంతో మంగళవారం మధ్యాహ్నం వరకు రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.


నిండిన చెరువులు

పాన్‌గల్‌: మండలంలో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. మండల కేంద్రంతో పాటు కేతేపల్లి, మహ్మదాపూర్‌, రాయినిపల్లి, బుసిరెడ్డిపల్లి గ్రామాల్లో చెరువులు, కుంటలు పొంగి పొర్లాయి. మహ్మదాపూర్‌ గ్రామంలో వార్డు సభ్యుడు శ్యాంగౌడ్‌ ఇంట్లోకి వర్షపు నీరు చేరింది. మండలంలో 22.6 మిల్లీ మీటర్ల వర్ష పాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2020-08-05T10:58:47+05:30 IST