కశ్మీర్‌లో గందరగోళం

ABN , First Publish Date - 2020-03-27T07:33:14+05:30 IST

మసీదుల్లో ప్రతిరోజు రాత్రి 8గంటలలోపే ముగిసిపోయే ప్రార్థన(అజాన్‌), రాత్రి 10గంటలకు వినపడటంతో కశ్మీర్‌లో బుధవారం గందరగోళ పరిస్థితి నెలకొంది...

కశ్మీర్‌లో గందరగోళం

  • రాత్రి పదింటికి అజాన్‌!

శ్రీనగర్‌, మార్చి 26: మసీదుల్లో ప్రతిరోజు రాత్రి 8గంటలలోపే ముగిసిపోయే ప్రార్థన(అజాన్‌), రాత్రి 10గంటలకు వినపడటంతో కశ్మీర్‌లో బుధవారం గందరగోళ పరిస్థితి నెలకొంది. కరోనా విపత్తు దృష్ట్యా పూర్తి లాక్‌డౌన్‌ పరిస్థితులున్నా.. ప్రజలు తమకు సమీపంలో ఉన్న మసీదుల వద్దకు భారీ సంఖ్యలో చేరుకుని ప్రార్థనలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలంతా బుధవారం రాత్రి పదింటికి ఇళ్ల వెలుపలికి వచ్చి ప్రార్థనలు నిర్వహించాలంటూ పాకిస్థాన్‌కు చెందిన ఒక ఇస్లాం సంస్థ ఇచ్చిన పిలుపుమేరకే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.


వెంటనే అప్రమత్తమైన స్థానిక అధికారులు.. ప్రజల్ని వారి వారి ఇళ్లకు తరలించారు. ఈ నేపథ్యంలో.. జనం ఎక్కువమంది వచ్చేందుకు కారణమయ్యే మత ప్రదేశాలను పూర్తిగా మూసివేస్తున్నామని, ప్రజలు సహకరించాలని శ్రీనగర్‌ జిల్లా మేజిస్ట్రేట్‌ షాహిద్‌ చౌదరి ట్విటర్‌లో తెలిపారు. హజ్రత్‌బల్‌, నక్ష్‌బంద్‌ సాహెబ్‌, దస్త్‌గిర్‌ సాహెబ్‌, గురుద్వారా సాహెబ్‌ వంటి పవిత్ర ప్రదేశాలన్నీ ఇందుకు సహకరించాయని.. త్వరలోనే మసీదుల్ని కూడా మూసివేస్తామని వెల్లడించారు. 

Updated Date - 2020-03-27T07:33:14+05:30 IST