సంక్షేమ పథకాలు అందడం లేదు

ABN , First Publish Date - 2021-06-22T06:38:40+05:30 IST

తమకు అర్హత ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు అందడం లేదని పలువురు డయల్‌ యువర్‌ కలెక్టర్‌కు ఫిర్యాదుచేశారు.

సంక్షేమ పథకాలు అందడం లేదు
డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కలెక్టర్‌, జిల్లా అధికారులు

డయల్‌ యువర్‌ కలెక్టర్‌కు ఫిర్యాదులు

గుంటూరు, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): తమకు అర్హత ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు అందడం లేదని పలువురు డయల్‌ యువర్‌ కలెక్టర్‌కు ఫిర్యాదుచేశారు. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా స్పందన కార్యక్రమం నిర్వహించలేని పరిస్థితి కొనసాగుతోండటంతో ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకు సోమవారంనుంచి కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉదయం 10నుంచి 11గంటల వరకు 24టెలీఫోన్‌ కాల్స్‌ని రిసీవ్‌ చేసుకొని సమాధానాలు ఇచ్చారు. తాడేపల్లి మునిసిపాలిటీకి చెందిన ఆయేషా తనకు ఇంటి స్థలం, ఒంటరి మహిళ పెన్షన్‌ రాలేదని చెప్పారు. నరసరావుపేటకు చెందిన రహంతుల్లా, కర్లపాలెం నివాసి ఏసమ్మ తమకు ఇంటి స్థలం రాలేదన్నారు. గుంటూరు ఎన్‌టీఆర్‌ స్టేడియం ప్రాంతానికి చెందిన ఆర్‌. మల్లేశ్వరి, క్రోసూరు మండలం గుడిపాడుకు చెందిన మహబూబ్‌ వలి, నూజెండ్ల మండలం ములకలూరు గ్రామ నివాసి మంద వెంకటేశ్వర్లు, యడ్లపాడుకు చెందిన చందూ తమ కుటుంబాలకు వైఎస్‌ఆర్‌ చేయూత పథకం అమలు జరిగేలా అవకాశం కల్పించాలన్నారు. పెదకాకాని రోడ్డు నివాసితుడు సీహెచ్‌ విజయబాబు తనకు వాహనమిత్ర పథకం కింద నగదు జమ కాలేదని కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. వినుకొండకు చెందిన పఠాన్‌ ఆసియా బేగం, చిలకలూరిపేటకు చెందిన నూతలపాటి యామలమ్మ తమకు వితంతు పెన్షన్‌ ఇప్పించాలన్నారు. ఈ విధంగా వచ్చిన ఫిర్యాదులన్ని సంక్షేమ పథకాలకు సంబంధించినవే. వీటిపై కలెక్టర్‌ స్పందిస్తూ సంబంధిత అధికారులకు మీ సమస్యలను నివేదించి పరిష్కరించాల్సిందిగా ఆదేశాలు ఇస్తామన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్లు ఏఎస్‌ దినేష్‌కుమార్‌, పి.ప్రశాంతి, కె.శ్రీధర్‌రెడ్డి, అనుపమ అంజలి, డీఆర్‌వో కొండయ్య, జడ్పీ సీఈవో చైతన్య, డీఆర్‌డీఏ పీడీ ఆనంద్‌నాయక్‌, డ్వామా పీడీ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. 

  

Updated Date - 2021-06-22T06:38:40+05:30 IST