Abn logo
Mar 2 2021 @ 16:24PM

ఎక్స్‌క్లూజివ్.. దగ్గుబాటి అభిరామ్ పట్టాలెక్కబోతున్నాడు

ఎన్నో ప్రయత్నాల తర్వాత, ఎంతో కాలయాపన తర్వాత ప్రముఖ నిర్మాత డి. సురేష్‌బాబు రెండో కొడుకు అభిరామ్ ఎట్టకేలకు పట్టాలెక్కుతున్నట్టుగా సమాచారం. దర్శకుడిగా తనదైన బ్రాండ్‌ని, ట్రెండ్‌ని చాలా స్పష్టంగా ఎస్టాబ్లిస్ చేసుకున్న రవిబాబు ద్వారానే. అదీ తన బ్యానర్ మీదనే అభిరామ్ హీరోగా త్వరలో ఓ డిఫరెంట్ స్టోరీతో సురేష్‌బాబు కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. అసలెప్పుడో అభిరామ్ తెరంగేట్రం అయిపోవాల్సింది. అయినా వినాయకుడి పెళ్ళికి వెయ్యి విఘ్నాలు అన్నట్టుగా ఏదనుకుంటే అదే ఆగిపోయింది. దానికి సవాలక్ష కారణాలు. సురేష్‌బాబుకి కథలు ఓ పట్టాన నచ్చవు. అంతా అయిపోయింది అనుకున్నప్పుడు సడన్‌గా సురేష్‌బాబుకి ఏదో అనుమానం వస్తుంది. అంతే అక్కడికక్కడే అ ప్రాజెక్టుకి ఫుల్‌స్టాప్‌ పడిపోతుంది. అలాగే చాలా సార్లు సినిమా ఫుల్‌స్టాప్‌ పడిపోయింది. 

ఒకసారి సీనియర్ దర్శకుడు వంశీ(లేడీస్ టైలర్) దర్వకత్వంలో అభిరామ్‌తో చెయ్యడానికి అంతా సిద్ధమైపోయింది. వంశీ తన మిత్రులకీ, సన్నిహితులకీ కూడా చెప్పాడు. అభిరామ్ కూడా చెప్పనట్టుగానే చెబుతుండేవాడు. మరేమైందో ఏమో...ఓ గుడ్ మార్నింగ్‌లో అ ప్రయత్నం హఠాత్తుగా ఆగిపోయింది. నిజానికి సురేష్‌బాబు పెద్ద కొడుకు దగ్గుబాటి రానా హీరోగా వచ్చిన తర్వాత వెనువెంటనే కాకపోయినా, కొంత కాలం తర్వాతైనా సరే అభిరామ్ హీరోగా వచ్చేస్తాడు అనుకున్నారంతా. ముఖ్యంగా సురేష్ యూనిట్‌ వాళ్లు. కానీ ఏదీ కార్యరూపం దాల్చలేదు. దానికి ముఖ్యమైన కారణం....సురేష్‌బాబు దేనికీ తొందరపడడు. ఆదుర్దా లేనేలేదు. తన కొడుకు కదా అని భుజాలమీదకి ఎక్కించుకోడు. ఆచితూచి అడుగు వెయ్యడం అనాదిగా ఆయన అలవాటు. ముఖ్యంగా తను బాగా వైబ్ కాకపోతే ప్రాజెక్టు ప్రారంభించలేని నైజం సురేష్‌బాబుది. అదే అభిరామ్ ప్రాజెక్టుని ఇన్నాళ్ళూ అడ్డుకుంది.

రవిబాబు, సురేష్‌బాబుకి మధ్యన మంచి అండర్‌ స్టాండింగ్ ఉంది. ఉత్తినే కూడా వాళ్ళిద్దరూ ఏవో కథలు, స్టోరీ లైన్స్‌ చర్చించుకుంటుంటారు. అలా చర్చించుకున్నప్పుడు ఏదో సురేష్‌బాబుకి నచ్చిన పాయింటేదో తగిలుంటుంది. అభిరామ్ పంట పండింది. ఎలాగైతేనేం.....అభిరామ్ లైమ్‌లైట్‌కి వస్తున్నాడు. తర్వాత వివరాలు, విషయాలు త్వరలోనే తెలిసొస్తాయి. రవిబాబు ఎక్స్‌పెన్సివ్ డైరెక్టర్ కాదు. కంటెంట్‌మీద ఎక్కువగా ఆధారపడతాడు. ఇప్పడు అల్లరి నరేష్ అని పరిశ్రమ, ప్రేక్షకులు పిలుస్తున్న ఇవివి సత్యన్నారాయణ కుమారుడు నరేష్‌ని కూడా రవిబాబే అల్లరి సినిమా ద్వారా పరిచయం చేశాడు. ఆ సెంటిమెంట్ కూడా సురేష్‌బాబు దృష్టిలో వర్కౌట్ అయి ఉంటుంది.    

Advertisement
Advertisement
Advertisement