పనసపండు కోరిన ప్రణబ్ ముఖర్జీ

ABN , First Publish Date - 2020-08-14T21:58:05+05:30 IST

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తీవ్ర అస్వస్థతతో ఆర్మీ ఆసుపత్రిలో చేరడానికి ఓ వారం రోజుల ముందు జరిగిన ..

పనసపండు కోరిన ప్రణబ్ ముఖర్జీ

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తీవ్ర అస్వస్థతతో ఆర్మీ ఆసుపత్రిలో చేరడానికి ఓ వారం రోజుల ముందు జరిగిన సంఘటన ఇది. తన కుమారుడు, బెంగాల్ రాజకీయాల్లో ఉన్న అభిజిత్‌కు ఫోను చేసి పనసపండు తినాలని ఉందని, తెచ్చిపెట్టమని చెప్పారట. అభిజిత్ స్వయంగా ఈ విషయం మీడియాకు తెలియజేశారు.


'కోల్‌కతా నుంచి పనసపండు తెచ్చిపెట్టమని నాన్నగారు కోరారు. వెంటనే బిర్హూం జిల్లాలోని మా స్వగ్రామమమైన మిరాటికి వెళ్లాను. 25 కిలోల పనసపండును కోయించి దానిని ఆగస్టు 3న రైలులో ఢిల్లీకి తీసుకువెళ్లాను. నాన్నగారిని కలిశాను. మా ఇద్దరికీ కూడా రైలు ప్రయాణాలంటే చాలా ఇష్టం' అని అభిజిత్ తెలిపారు. నాన్నగారు ఎంతో ఇష్టంగా కొన్ని పనస తొనలు తిన్నారని, అప్పుడు ఆయన షుగర్ లెవెల్స్ కూడా ఏమాత్రం పెరగలేదని, పైగా చాలా హ్యాపీగా కూడా ఉన్నారని తెలిపారు.


కాగా, ఆ తర్వాత వారం రోజులకు ప్రణబ్ ముఖర్జీ అకస్మాత్తుగా జబ్బుపడ్డారు. బ్రెయిన్‌లో రక్తం గడ్డకట్టడంతో సర్జరీ చేశారు. దానికి ముందు ఆయనకు వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. దీనిపై అభిజిత్ మాట్లాడుతూ, రక్షణ మంత్రిగా ప్రణబ్ సేవలందించారని, ఆయన మెడికల్ రికార్డులన్నీ ఆర్మీ వైద్యుల దగ్గర ఉండటంతో ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరెల్ ఆసుపత్రిని సంప్రదించామని చెప్పారు. తన తండ్రిని చూసేందుకు నాలుగుసార్లు వెళ్లానని, పీపీఈ సహా అన్ని రక్షణ చర్యలు వైద్యులు తీసుకున్నారని, చివరిసారిగా చూసినప్పుడు ఆయన శ్వాస కూడా నిలకడగా ఉండటం గమనించానని అభిజిత్ తెలిపారు.

Updated Date - 2020-08-14T21:58:05+05:30 IST