డబ్బిస్తేనే మ్యుటేషన్‌!

ABN , First Publish Date - 2022-05-26T05:20:32+05:30 IST

డబ్బిస్తేనే మ్యుటేషన్‌!

డబ్బిస్తేనే మ్యుటేషన్‌!

- అర్జీదారులను తిప్పుకుంటున్న వైనం

- అన్నీ సక్రమంగా ఉన్నా పని చేయరు

- చేతిలో పడగానే గంటల్లో పని పూర్తి

- రెవెన్యూశాఖలో సాగుతున్న తంతు ఇది

- ఇతర వ్యవహారాల్లోనూ ఘనాపాటీలే

- ప్రభుత్వ ఉద్యోగులనూ వదలని వైనం

- మామూళ్లు సమర్పించగానే సర్టిఫికెట్లు మంజూరు 

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి) 


- కోటబొమ్మాళి మండలం శ్రీజగన్నాథపురం పంచాయతీ కుజిపేటకు చెందిన దుప్పల అప్పారావు మ్యుటేషన్‌ కోసం మూడు నెలలు కిందట దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికీ రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


- కొత్తూరు మండలం బలద గ్రామానికి చెందిన బోడసింగి వెంకటరమణమూర్తి తండ్రి ఎనిమిదేళ్ల కిందట మరణించారు. అతని మరణాంతరం తల్లి పేరుమీద భూమి ఉంది. వీరు నలుగురు అన్నదమ్ములు. మూడు ఎకరాల భూమి కోసం పూచీకత్తులు రాశారు. నాలుగేళ్ల నుంచి పదుల సంఖ్యలో మ్యుటేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేదు. మ్యుటేషన్‌ గడువు ముగిసింది. కానీ భూమి మ్యుటేషన్‌ జరగలేదని వాపోతున్నారు. 


మ్యుటేషన్స్‌పై ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇది నేనేమీ కావాలని చెప్పడంలేదు. ఏసీబీ, విజెలెన్స్‌ నివేదికల ఆధారంగానే చెబుతున్నా. ఒకరి ఆస్తులు మరొకరికి మార్పు చేసేందుకు కొన్నిచోట్ల ఏకంగా రికార్డులనే మార్చేస్తున్నారు. ఈ హక్కు ఎవరికీలేదు. ఇది చాలా తప్పిదం. 

ఇటీవల ఓ కార్యక్రమంలో రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యలు ఇవి.


డబ్బులు కావాలని డైరెక్టుగా అడగరు. ఏదో పత్రం లేదంటూ కొర్రీలు వేస్తారు. వారాల తరబడి తిప్పుకుంటారు. ఇప్పుడు సమయంలేదని వెనక్కి పంపిస్తారు. అసలు విషయం గ్రహించిన కొందరు అంతోఇంతో చేతిలో పెడితే వెంటనే పని కానిచ్చేస్తారు. రెవెన్యూలో సాగుతున్న ఈతంతుపై ఏకంగా ఆశాఖ మంత్రే అసంతృప్తి వ్యక్తం చేశారంటే తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. రెవెన్యూశాఖను ప్రక్షాళన చేస్తున్నామని ప్రభుత్వం ఆర్భాటంగా చెబుతోంది. ఆన్‌లైన్‌లో సేవలు అందుబాటులోకి తెస్తున్నామంటోంది. కానీ ఆచరణలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. దాదాపు అన్ని స్థాయిల్లోనూ కొందరు అధికారులు అందిన కాడికి తీసుకుంటున్నారు. డబ్బు ఇవ్వందే ఫైల్‌ ముందుకు తీసుకెళ్లడం లేదు. 


డబ్బులివ్వనిదే ఏపనీ జరగట్లేదు!

ప్రతి సోమవారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇక్కడికి వచ్చే వినతుల్లో రెవెన్యూ సమస్యలే అత్యధికం. వీటిలోనూ భూ ఆక్రమణలకు గురయ్యాయని, ధ్రువపత్రాలు మంజూరు చేయడంలేదని, మ్యుటేషన్స్‌ చేయట్లేదని వంటివి అధికంగా ఉన్నాయి. వీటిని పరిష్కరిస్తారన్న ఆశలో రెండు వారాలకోమారు స్పందనకు వస్తూనే ఉన్నారు. కానీ వారి సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. మరింత కొర్రీలు వేస్తారేమోనన్న భయంతో.. సంబంధిత అధికారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు ప్రజలు వెనుకడుగు వేస్తున్నారు.   


మ్యుటేషన్‌ చేయించుకోవాలంటే.. 

భూమిని అమ్మినా.. కొనుగోలు చేసినా రిజిస్ట్రేషన్‌ పూర్తయి నెలరోజుల తర్వాత మ్యుటేషన్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలి. తద్వారా రెవెన్యూ రికార్డుల్లో పేరు మార్పించుకోవాలి. ఇది ఆన్‌లైన్‌ ప్రక్రియ అయినా మాన్యువల్‌గాను మరో కాపీని కార్యాలయాల్లో జతచేయాలి. అయితే మ్యుటేషన్‌ చేసేందుకు కొందరు అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. డబ్బు కావాలని డైరెక్టుగా అడగరు. ఏదో ఒక పత్రం లేదంటూ కొర్రీలు వేస్తుంటారు. చేయి తడిపిన తర్వాతే పని చేసి పెడుతున్నారు. హైవేకు ఆనుకుని ఉన్న భూమికి అయితే ఒక ధర... సిటీ పరిధిలో ఉంటే ఇంకో ధర నిర్ణయిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1500 వరకు దరఖాస్తులు మ్యుటేషన్‌కు పెండింగ్‌లో ఉన్నాయి. 


మిగతా వాటిలోనూ రెవెన్యూదే ఘనత

ఒక్క మ్యుటేషనే కాదు.. మిగతా వ్యవహారాల్లోనూ రెవెన్యూశాఖ ‘ఘనత’ వహించింది. ఫ్యామిలీ సర్టిఫికెట్‌ కావాలన్నా, నో ఎర్నింగ్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాలన్నా సమర్పించుకోవాల్సిందే. చివరకు ప్రభుత్వ ఉద్యోగలను కూడా వదలడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. గతంలో పలు కార్యాలయాలపై ఏసీబీ ర్యాండమ్‌గా తనిఖీలు నిర్వహించేది. ఒకసారి రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలపైన, మరోసారి హాస్టల్స్‌పైనా, ఒంకోసారి మున్సిపల్‌ కార్యాలయాలపైనా దాడులు చేసేంది. అయితే చాన్నాళ్ల నుంచి రెవెన్యూ శాఖపై దృష్టి సారించలేదన్న అభిప్రాయాలు ఉన్నాయి.


మచ్చుకు కొన్ని..

- రణస్థలం మండలంలోని ఓ ప్రభుత్వ కార్యాలయం జూనియర్‌ అసిస్టెంట్‌ కరోనా బారినపడి మృతి చెందారు. ప్రభుత్వ పరంగా అందే ప్రయోజనాల కోసం రెవెన్యూశాఖ ఇచ్చే ధ్రువపత్రాలు తప్పనిసరి. అయితే ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ కోసం ఆ కుటుంబం శ్రీకాకుళం సచివాలయంలో దరఖాస్తు చేసుకుంది. తహసీల్దార్‌ కార్యాలయానికి కూడా వెళ్లి మరో కాపీ సమర్పించింది. అయితే ఓ అధికారి విచారణ పేరుతో కాలయాపన చేసి.. చివరకు తన చేయి తడిపాక ఎఫ్‌ఎంసీ మంజూరు చేయించారు. 


- నగరంలోని ఓ ఉద్యోగి అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలంటే ‘ఆదాయం లేదు’ (నో ఎర్నింగ్‌) సర్టిఫికెట్‌ అవసరం. ఇందుకు ఆ ఉద్యోగి భార్య, కుమారుడు దరఖాస్తు చేసుకున్నారు. దీన్ని ఆసరగా చేసుకున్న ఓ ఉద్యోగి ‘డిమాండ్‌’ చేశారు. బయట వాళ్ల వద్ద రూ. 10వేల నుంచి 20 వేలు తీసుకుంటామని, మీదీ ఉద్యోగి కుటుంబమే కాబట్టి.. ఈ సర్టిఫికెట్‌తో ఉద్యోగం వస్తుంది కనుక ఎంతోకొంత ఇవ్వండని బేరం పెట్టారు. ప్రజాప్రతినిధుల కార్యక్రమాలు జరిగినప్పుడు వారికి జీడిపప్పు, స్నాక్స్‌, మంచినీళ్లు, ప్రొటోకాల్‌ ఖర్చులు తామే భరించాల్సి వస్తుందని, అందుకే డబ్బులు తీసుకుంటామని చెప్పి వసూలు చేశారు. 


ఇవీ ఏసీబీ కేసులు

జిల్లాలో రెవెన్యూ సిబ్బందిపై 2014లో ఒక ఏసీబీ కేసు నమోదైంది. 2015లో నాలుగు, 2016లో రెండు, 2017లో నాలుగు,  2018లో రెండు కేసులు నమోదయ్యాయి. 2019లో నాలుగు, 2020లో మూడు, 2021లో ఐదు కేసులు నమోదయ్యాయి. ఇందులో భారీ తిమింగళం గతేడాది పట్టుబడింది. టెక్కలిలో ఓ తహసీల్దార్‌ రూ.4 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. 2017లో ఎచ్చెర్లలో ఓ డిప్యూటీ తహసీల్దార్‌ రూ.50వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. మిగిలిన కేసులన్నీ.. పాస్‌ పుస్తకాలు, ఇతరత్రా రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం లంచం డిమాండ్‌ చేసి వీఆర్వోలు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌లు పట్టుబడినవే. కాగా రెవెన్యూ శాఖపై ఏసీబీ అధికారులు మరింత దృష్టి సారించాలి. కార్యాలయాల్లో నిరంతర తనిఖీలతో పాటు.. పెండింగ్‌ ఉన్న దరఖాస్తులపై ఆరా తీయాలని.. అవినీతిని అరికట్టాలని జిల్లావాసులు కోరుతున్నారు. 


గడువులోపు పరిష్కరించకుంటే క్రిమినల్‌ కేసులు

రెవెన్యూ సేవలు అందించేందుకు ప్రభుత్వం గడువు విధించింది. ప్రతి మంగళవారం సీసీఎల్‌ఏ నుంచి రెవెన్యూ సమస్యలపై వీడియో కాన్ఫెరెన్స్‌ నిర్వహిస్తున్నాం. అర్జీదారులకు న్యాయం చేయాల్సింది పోయి.. వారిని పలుకారణాలతో ఇబ్బందులకు గురిచేయడం సరికాదు. గడువులోపు పరిష్కరించుకున్నా.. డబ్బులు డిమాండ్‌ చేసినా క్రిమినల్‌ కేసులు నమోదు చేసేందుకు ఆదేశాలున్నాయి. ఇప్పటికే రెవెన్యూ సిబ్బందిని హెచ్చరించాం. ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మ్యుటేషన్‌ దరఖాస్తుల పరిష్కారం వేగవంతం చేస్తున్నాం. 

- విజయసునీత, జాయింట్‌ కలెక్టర్‌


Updated Date - 2022-05-26T05:20:32+05:30 IST