కలెక్టరు చక్రధరబాబుకు వినతిపత్రం సమర్పిస్తున్న టీడీపీ రైతు సంఘ నాయకులు
కోవూరు, మే23 : గత సీజన్‌లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి ఇంతవరకు నగదు చెల్లించలేదని, వెంటనే బకాయిలు చెల్లించి ఆదుకోవాల్సిందిగా టీడీపీ రైతు సంఘ జిల్లా నాయకులు సోమవారం కలెక్టరు చక్రధరబాబుకు వినతిపత్రం సమర్పించారు. కలెక్టరేట్‌లో జరిగిన స్పందన కార్యక్రమంలో ఆయనకు వారు సమస్యలను వివరించా రు.మార్చిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసి ఇంతవరకు నగదు చెల్లించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వాపోయారు. ప్రభుత్వం అనుసరించిన విధానం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి విపత్కర పరిస్ధితుల్ని చవిచూడలేదన్నారు. జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో చక్కెర కర్మాగారాన్ని తెరుస్తామని హామీ యిచ్చారన్నారు. ఇంతవరకు షుగర్ ఫ్యాక్టరీ సమస్యలపై ప్రభుత్వం, ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి స్పందించలేదన్నారు. చక్కెర కర్మాగార సమస్యలకు పరిష్కారం చూపాల్సిందిగా టీడీపీ నాయకులు కలెక్టరును కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రైతు సంఘ జిల్లా నాయకులు నెల్లూరు ప్రభాకరరెడ్డి, జీ రాధాకృష్ణయ్య, ఇంతా మల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.