వణికిస్తోంది

ABN , First Publish Date - 2021-12-04T07:02:05+05:30 IST

దూసుకువస్తున్న జవాద్‌ తుపాను ముప్పు అధికారులు, అన్నదాతలను వణికిస్తోంది. గంటకు 75 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో పెనుగాలుల తోపాటు అతి భారీ వర్షాలు కూడా కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో నష్టం ఏమేరకు ఉంటుందోననే ఆందోళనకు గురిచేస్తోంది.

వణికిస్తోంది
కాకినాడ-ఉప్పాడ రోడ్డును తాకుతున్న అలల ఉధృతి

  • జిల్లాపై తుపాను ప్రభావంతో అంతటా అప్రమత్తం
  • నేటి ఉదయం ఎనిమిది గంటల నుంచి భారీ వర్షాలు, గాలులు
  • సముద్రంలో వేటకు వెళ్లిన వందల బోట్లు వెనక్కు
  • కాకినాడ రూరల్‌కు చెందిన నాలుగు బోట్ల ఆచూకీ గల్లంతు
  • భారీ గాలులు, వర్షాలతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ముప్పు
  • 1,000 స్తంభాలు,1,050 ట్రాన్స్‌ఫార్మర్లు, 64 జనరేట్లు సిద్ధం చేసిన ట్రాన్స్‌కో
  • కాంట్రాక్టర్లను సంప్రదించి మరో పది వేల స్తంభాలు సిద్ధం చేయాలని ఆదేశాలు
  • విద్యుత్‌ సంబంధిత ఫిర్యాదుల కోసం 7382299960 నెంబర్‌తో కంట్రోల్‌రూం
  • వర్షాల ముప్పుతో రిజర్వాయర్లలో నీటిని ముందుగా ఖాళీ చేసిన జలవనరులశాఖ
  • తుపాను ప్రభావంతో శుక్రవారం జిల్లావ్యాప్తంగా ముసురు..  పెరిగిన చలితీవ్రత
  • ఎక్కడా ప్రాణ నష్టం లేకుండా చూడాలని ఆదేశించిన కలెక్టర్‌ హరికిరణ్‌

దూసుకువస్తున్న జవాద్‌ తుపాను ముప్పు అధికారులు, అన్నదాతలను వణికిస్తోంది. గంటకు 75 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో పెనుగాలుల తోపాటు అతి భారీ వర్షాలు కూడా కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో నష్టం ఏమేరకు ఉంటుందోననే ఆందోళనకు  గురిచేస్తోంది. తుపాను తీరానికి సమీపిస్తున్నకొద్దీ వాతావరణంలో మార్పులు క్రమేపీ పెరుగుతున్నాయి. దీని ప్రభావంతో జిల్లావ్యాప్తంగా  శుక్రవారం ముసురుపట్టింది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయి చలి పెరిగింది. అటు తుపాను నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం నాలుగు మినహా వందలాది బోట్లు వెనక్కు వచ్చేశాయి. అన్నింటికంటే ముఖ్యంగా గాలుల తీవ్రతకు విద్యుత్‌ వ్యవస్థకు ముప్పు ఉంటుందని అంచనాతో ట్రాన్స్‌కో వెయ్యి స్తంభాలను సిద్ధం చేసిది.. మరో పదివేల స్తంభాలు అందుబాటులో ఉంచాలని కాంట్రాక్టర్లకు సూచించింది. విద్యుత్‌ సంబంధిత ఫిర్యాదుల స్వీకరణకు కంట్రోల్‌రూంలు ఏర్పాటు చేసింది. 13 తీరప్రాంత మండలాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించడానికి రెవెన్యూశాఖ 126 పునరావాస శిబిరాలు సిద్ధం చేసింది. 

(కాకినాడ-ఆంధ్రజ్యోతి):

జవాద్‌ తుపాను శనివారం ఉదయానికి తీరానికి దాటుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. తీరానికి సమీపించేకొద్దీ శుక్రవారం అర్ధరాత్రి నుంచి గాలుల తీవ్రత గంటకు 45 నుంచి మొదలై శనివారం ఉద యం నాటికి 90 కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉందని జిల్లా అధికారులకు సమాచారం అందింది. ముప్పు విభాగంలో జిల్లాకు ఆరంజ్‌ అలర్ట్‌ ప్రకటించారు. అంటే పెద్దగా ముప్పు ఉండకపోవచ్చని అర్థం. కానీ గాలులు, భారీ వర్షాలు పడతాయని ప్రకృతి వైపరీత్యాల నివారణ విభాగం పేర్కొంది. ఈనేపథ్యంలో తీరప్రాంత మండలాల్లో రెవెన్యూసహా అన్ని శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అప్రమత్తం చేశారు. 13 తీరప్రాంత మండలాల్లోని 126 చోట్ల పునరావాస ఏర్పాట్లు సిద్ధం చేశారు. అక్కడే భోజన వసతి కల్పించేందుకు పౌర సరఫరాలశాఖ ఏర్పాట్లు చేసింది. మరోపక్క ట్రాన్స్‌కో సైతం అప్రమత్తమైంది. గాలుల తీవ్రతకు లైన్లు తెగిపడడం, చెట్లు నేలకొరగడం, పలుచోట్ల తీరప్రాంతాలను ఆనుకుని స్తంభాలు పడిపోతాయని అంచనా వేసింది. దీంతో తుపాను తర్వాత పునరుద్ధరణ పనుల కోసం వెయ్యి స్తంభాలు సిద్ధం చేసింది. మరో 10 వేల స్తంభాలను ప్రాంతాల వారీగా తరలించడం కోసం కాంట్రాక్టర్లను అప్రమత్తం చేసింది. 1,050 ట్రాన్స్‌ఫార్మర్లు, నాలుగు క్రేన్లు, పోల్‌ డ్రిల్లర్లు 20, 64 జనరేటర్లు, సహాయక కార్యక్రమాల కోసం 1,100 మంది సిబ్బందిని అందుబాటులో ఉంచింది. భారీ వర్షాలతో రిజర్వాయర్లలోకి నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉండడంతో ముం దుగా కొంత నీటిని జలవనరులశాఖ శుక్రవారం దిగువకు వదిలేసింది. అందులోభాగంగా ఏలేరు జలాశయం నుంచి వెయ్యి క్యూసెక్కులు విడిచిపెట్టింది. దిగువ ప్రాంతాల ప్రజలకు వరద ముప్పు ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. కాగా తుపాను హెచ్చరికలతో కాకినాడ హార్బర్‌, కుంభాబిషేకం ప్రాంతానికి శుక్రవారం సాయంత్రం వందలాది బోట్లు వేట నుంచి వెనక్కు వచ్చేశాయి. వీటిని బలమైన తాళ్లతో లంగరు వేశారు. అయితే కాకినాడ రూరల్‌లోని ఉప్పలంకకు చెందిన నాలుగు బోట్ల జాడ మాత్రం ఇంకా దొరకలేదు. ఇందులో 32 మంది మత్స్యకారులు వారం కిందటే డీప్‌సీ ఫిషింగ్‌కు వెళ్లారు. దీంతో వీరి ఆచూకీ ఇంకా అధికారులకు అందలేదు. అయితు తుపాను తీరం దాటను న్న శ్రీకాకుళం తీరం వైపు వీళ్లు వేటకు వెళ్లినట్టు తెలిసి అధికారులు ఆందోళన చెందుతున్నారు. మరోపక్క తుపాను ముప్పు నేపథ్యంలో సీఎం జగన్‌ శుక్రవారం రాత్రి కలెక్టర్‌తో సమీక్షించారు. ప్రాణ నష్టం లేకుండా చూడాలని ఆదేశించారు. అటు కీలక శాఖల అధికారులు, సిబ్బందికి సెలవులు సైతం రద్దుచేశారు. విద్యుత్‌ సమస్య తలెత్తితే, తాగునీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా జనరేటర్లు సిద్ధంచేశారు.

నేడు విద్యా సంస్థలకు సెలవు

అమలాపురం/రాజమహేంద్రవరం, (ఆంధ్రజ్యోతి) డిసెంబరు 3: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయు గుండం తుపానుగా మారడంతో కోనసీమలోను, తీరప్రాంత మండలాల ప్రజలు అప్రమత్తమయ్యారు. అధికారులు చేస్తున్న సూచనలతో ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా తీర గ్రామాల్లో ఉన్న మత్స్యకారులను చేపలవేటకు వెళ్లకుండా నిరోధిస్తు న్నారు. ఇక తుపాను నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు శనివారం సెలవు ప్రకటించారు. ఆదికవి నన్నయ్య విద్యాలయం కూడా సెలవు ప్రకటించింది. ఇంజనీరింగ్‌ విద్యా సంస్థలూ సెలవు ప్రకటించాయి. సీబీఎస్‌ఈ పరీక్ష ఉన్న కారణంగా ఆయా పాఠశాలలకు మాత్రం అనుమతి ఇచ్చారు. శనివారం నాటికి తుపాను తీవ్రత వల్ల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయన్న సూచనల మేరకు వాతావరణ శాఖ ఆరంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. అల్లవరం మండలం ఓడలరేవు, ఎన్‌.రామేశ్వరం, ఎస్‌.పల్లిపాలెం తుపాను షెల్టర్లను మండల తహశీల్దార్‌ ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రసాద్‌ తనిఖీ చేశారు. ఎన్‌.రామేశ్వరంలో సముద్రపు ఒడ్డున నివసిస్తున్న నక్కపల్లికి చెందిన 35 మంది మత్స్యకారులను తుపాను షెల్టర్‌కు తరలిస్తున్నారు. శుక్రవారం కోనసీమలో పలుచోట్ల జల్లులు పడ్డాయి.

ఉప్పాడలో ‘అల’జడి

ఉప్పాడ (కొత్తపల్లి) డిసెంబరు 3: జవాద్‌ తుపాను ప్రభావంతో ఉప్పాడ తీరంలో అలల ఉధృతి పెరిగింది. శుక్రవారం రాత్రి పది గంటల ప్రాంతంలో కెరటాలు రెండు మీటర్ల ఎత్తులో ఎగసిపడుతున్నాయి. శనివారం అమావాస్యకావడం, ప్రస్తుత తుపాను ప్రభావం వల్ల సముద్రం కల్లోలంగా మా రింది. ఉప్పాడ నుంచి కాకినాడ బీచ్‌ రోడ్డు గుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులపై కెరటాలు విరుచుకొని పడుతున్నప్పటికీ ప్రయాణిస్తున్నారు. దీంతో ఉప్పాడ బీచ్‌ రోడ్డులో వాహనాల రాకపోకలను నియంత్రించినట్టు సీఐ   వైఆర్కే శ్రీనివాస్‌ చెప్పారు. బీచ్‌ రోడ్డు మీదుగా రాత్రిళ్లు ఎవరూ ప్రయాణం చేయకుండా పోలీసుల పహారా ఏర్పాటుచేసినట్టు ఎస్‌ఐ అబ్దుల్‌నబి తెలియజేశారు.

అంతటా అప్రమత్తం: కలెక్టర్‌ హరికిరణ్‌

తుపాను ముప్పు జిల్లాకు పెద్దగా ఉండదు. అయినా శనివారం ఉదయం 8 గంటల నుంచి పలుచోట్ల భారీ వర్షాలు పడతాయని సమాచారం అందింది. గాలుల తీవ్రత కూడా కొనసాగనుంది. అందుకే తీరప్రాంత మండలాల అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశాం. పునరావాస శిబిరాలకు వీరిని తరలించాలని ఆదేశించాం. జిల్లాకు రెడ్‌ కాకుండా ఆరంజ్‌ అలర్ట్‌ ప్రకటించారు. దీంతో తీవ్రత తక్కువగా ఉండనుంది. అయినప్పటికీ ట్రాన్స్‌కో, రెవెన్యూ,పీఆర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, పంచాయతీ తదితర శాఖల అధికారులను అప్రమత్తం చేశాం. ఎక్కడా ఇబ్బంది లేకుండా పర్యవేక్షిస్తున్నాం. ఏ ఇబ్బంది వచ్చినా కలెక్టరేట్‌సహా కంట్రోల్‌రూమ్‌లకు ఫోన్‌ చేస్తే సహాయం అందిస్తాం.

7 చోట్ల కంట్రోల్‌ రూమ్‌లు : ఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ

రాజమహేంద్రవరం, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి) : తుపాను కారణంగా విద్యుత్‌ వినియోగదారులు ఇబ్బందిపడకుండా వారి సమస్యలను వెంటనే పరిష్కరించడం కోసం జిల్లాలోని ఏడుచోట్ల కంట్రోలు రూమ్‌లు ఏర్పాటు చేసినట్టు ఏపీఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ టీవీఎస్‌ఎన్‌మూర్తి తెలిపారు. ఈమేరకు శుక్రవారం రాత్రి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కంట్రోలు రూమ్‌లు 24 గంటలూ పనిచేస్తాయన్నారు. రాజమహేంద్రవరం సర్కిల్‌ ఆఫీసులో ఏర్పాటు చేసిన కంట్రోలు రూమ్‌లో 7382299960, 0883-2463354 నంబర్లకు ఫోన్‌చేసి సమస్యలు తెలియజేయవచ్చన్నారు. రాజమహేంద్రవరం డివిజన్‌లో 9490610094 నంబరుకు, కాకినాడ డివిజన్‌లో 9493178718,  జగ్గంపేట డివిజన్‌లో 9490610096,  అమలాపురం డివిజన్‌లో  9440904478,  రామచంద్రపురం డివిజన్‌లో  9490610098,  రంపచోడవరం డివిజన్‌లో 8332046394 నెంబర్లతో కంట్రోలు రూమ్‌ లు పనిచేస్తాయన్నారు. ఎక్కడ విద్యుత్‌కు అంతరాయం ఏర్పడినా తెలియజేయాలని కోరారు.

Updated Date - 2021-12-04T07:02:05+05:30 IST