విపత్తుల వేళ.. గుడి, బడే దిక్కు

ABN , First Publish Date - 2022-07-26T04:28:20+05:30 IST

తుఫాన్‌లు, విపత్తుల వేళ తీర ప్రాంతవాసులకు రక్షణ కరువవుతోంది. తుఫాన్‌ రక్షిత భవనాలు శిథిలావస్థకు చేరుకోవడంతో గ్రామానికి సమీపంలో ఉన్న ఆలయాలు, పాఠశాలలే దిక్కవుతున్నాయి. జిల్లాలో ఇచ్ఛాపురం నుంచి రణస్థలం వరకు 193 కిలోమీటర్ల మేర సముద్రతీరం ఉంది.

విపత్తుల వేళ.. గుడి, బడే దిక్కు
శిథిలావస్థకు చేరిన పెద్దలక్ష్మీపురం తుఫాన్‌ రక్షిత భవనం

శిథిలావస్థలో తుఫాన్‌ రక్షిత భవనాలు

ఆందోళనలో తీరప్రాంత ప్రజలు

(ఇచ్ఛాపురం రూరల్‌)

- ఇచ్ఛాపురం మండలం పెద్దలక్ష్మీపురంలోని తుఫాన్‌ రక్షిత భవనం ఇది. రెండేళ్లుగా ఇది శిథిలావస్థకు చేరుకుని ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. తుఫాన్ల సమయంలో ఆ గ్రామ ప్రజలకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈదుపురం పాఠశాలలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. భవనం ఉన్నా నిర్వహణ లేకపోవడంతో తుఫాన్ల సమయంలో ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు వాపోతున్నారు.

- ఇది కవిటి మండలం కొత్తపాలెంలోని తుఫాన్‌ రక్షిత భవనం. ఇది శిథిలావస్థకు చేరి నాలుగేళ్లవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. తుఫాన్ల సమయంలో గ్రామస్థులను కవిటిలో పునరావాస కేంద్రానికి తరలిస్తున్నారు. అక్కడ కనీస సదుపాయాలు కరువవుతున్నాయని గ్రామస్థులు పేర్కొంటున్నారు. 

తుఫాన్‌లు, విపత్తుల వేళ తీర ప్రాంతవాసులకు రక్షణ కరువవుతోంది. తుఫాన్‌ రక్షిత భవనాలు శిథిలావస్థకు చేరుకోవడంతో గ్రామానికి సమీపంలో ఉన్న ఆలయాలు, పాఠశాలలే దిక్కవుతున్నాయి. జిల్లాలో ఇచ్ఛాపురం నుంచి రణస్థలం వరకు 193 కిలోమీటర్ల మేర సముద్రతీరం ఉంది. సముద్రాన్ని ఆనుకుని వందల సంఖ్యలో గ్రామాలు ఉన్నాయి. కడలి కల్లోలంగా మారిందంటే తొలుత నష్టపోయేది తీరప్రాంత గ్రామస్థులే. అందుకే తుఫాన్‌ పేరు వింటేనే తీరప్రాంత వాసులు హడలిపోతారు. రాకాసి అలలు ఎటు నుంచి విరుచుకుపడతాయోనని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతారు. ముఖ్యంగా వర్షాకాలం వచ్చిందంటే చాలు.. బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడి తుఫాన్లగా మారుతున్నాయి. అటువంటి సమయంలో ఆసరా కోసమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీరప్రాంత గ్రామాల్లో తుఫాన్‌ రక్షిత భవనాలు నిర్మించాయి. ప్రస్తుతం వీటిలో అధికశాతం శిథిలావస్థలకు చేరాయి. జిల్లాలో 11 మండలాల్లో 102 తుఫాన్‌ రక్షిత భవనాలు ఉండగా.. వీటిలో 73 శిథిలావస్థకు చేరుకున్నాయి. మరికొన్ని భవనాలు నిర్వహణ లేక అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. విపత్తుల వేళ తప్ప.. మిగిలిన సమయంలో ఈ భవనాల నిర్వహణ కోసం అధికారులు పట్టించుకోవడం లేదు. తుఫాన్ల సమయంలో తీరప్రాంతవాసులను సురక్షిత ప్రదేశాలకు హడావుడి చేస్తుంటారు. తుఫాన్‌ రక్షిత భవనాలు శిథిలావస్థకు చేరుకోవడంతో.. అప్పటికప్పుడు బడులు, గుడుల్లో పునరావాసం కల్పించి చేతులు దులుపేసుకుంటున్నారు. మందుగానే వీటిపై అధికారులు దృష్టి సారిస్తే తుఫాన్ల సమయంలో ఉపయోగపడతాయని తీరప్రాంత వాసులు పేర్కొంటున్నారు. నిరంతరం వీటిని పర్యవేక్షించాలని, విపత్తుల నిర్వహణకు ప్రత్యేక సిబ్బందిని నియమించాలని కోరుతున్నారు. ఖాళీ సమయాల్లో అద్దె ప్రాతిపదికన వివిధ వర్గాలు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటే నిర్వహణ భారం పడదని అభిప్రాయపడుతున్నారు. 

 ప్రత్యేక దృష్టి 

తీర ప్రాంతంలో కొన్ని మండలాల్లో శిథిలావస్థకు చేరుకున్న భవనాలను తొలగించి కొత్త భవనాలు నిర్మించాం. ఇంకా కొన్ని చోట్ల కొత్త భవనాలు నిర్మించాల్సి ఉంది. తుఫాన్ల సమయంలో ప్రజల రక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. రాబోయే రోజుల్లో తీరప్రాంత గ్రామాల్లో ఆధునాతన భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం. 

-టి.సీతారామమూర్తి, ఆర్‌డీవో, పలాస



Updated Date - 2022-07-26T04:28:20+05:30 IST