Abn logo
Sep 26 2021 @ 02:17AM

‘గులాబ్‌’ గుబులు

  • బంగాళాఖాతంలో తుఫాన్‌
  • నేడు తీరం దాటే అవకాశం
  • ఉత్తరాంధ్రకు పొంచిఉన్న ముప్పు
  • భారీ నుంచి అతిభారీ వర్షాలు
  • చేపలవేటకు వెళ్లొద్దని హెచ్చరిక 
  • అధికారులతో సీఎం జగన్‌ సమీక్ష 

అమరావతి/విశాఖపట్నం/శ్రీకాకుళం, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రకు తుఫాన్‌ ముప్పు పొంచి ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. శనివారం వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుఫాన్‌గా మారింది. దీనికి పాకిస్థాన్‌ ‘గులాబ్‌’ (గుల్‌-ఆబ్‌) అనే పేరు పెట్టింది. ఆదివారం సాయంత్రం కళింగపట్నం- గోపాల్‌పూర్‌ (ఒడిసా) మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తరాంధ్రపై తుఫాన్‌ తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉభయగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఉత్తరాంధ్ర-ఒడిసా తీరప్రాంతంలో గంటకు 70-90 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, సముద్ర అల్లకల్లోలంగా మారే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. మత్స్యకారులు 27వ తేదీ వరకు సముద్రంలో వేటకు వెళ్లరాదని సూచించింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరింది. దక్షిణ కోస్తాలో అక్కడక్కడా భారీ వర్షాలు, అనేక చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రాయలసీమలో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. ఒడిసా, తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశముందని వెల్లడించింది. కోస్తాలో అన్ని ఓడరేవుల్లో ఒకటో నంబరు ప్రమాద సూచిక ఎగురవేశారు.  శనివారం సాయంత్రం 6 గంటలకు కళింగపట్నం(ఏపీ)కు తూర్పు-ఈశాన్య దిశగా 480 కిలోమీటర్ల దూరంలో, గోపాల్‌పూర్‌ (ఒడిసా)కు తూర్పు-ఆగ్నేయ దిశగా 410 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో శనివారం రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. ఉత్తరకోస్తాలో భారీ వర్షాలు కురిశాయి. 


యంత్రాంగం అప్రమత్తం

గులాబ్‌ తుఫాన్‌ ప్రభావిత ఏపీ, ఒడిసా రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. ముప్పును ఎదుర్కొనేందుకు మొత్తం 18 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను మోహరించారు. ఆర్మీ, నౌకా దళానికి చెందిన రెస్క్యూ టీమ్‌లను రంగంలోకి దించారు. ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు..  తహసీల్దార్లు, ఆర్డీవోలను అప్రమత్తం చేశారు. తీరప్రాంతంలో 59,496 మత్స్యకార కుటుంబాలు, లోతట్టు ప్రాంతాల్లో 8 వేల కుటుంబాలను గుర్తించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దించారు. వీరిని సురక్షిత ప్రాంతాలకు తరలింపు ప్రక్రియ చేపట్టారు.  సహాయక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. విశాఖపట్నంలో ఒక ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందం, శ్రీకాకుళం, విశాఖపట్నంలో ఒక్కో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధంగా ఉంచారు. ఉత్తరాంధ్రలో 24 గంటలూ అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లను తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో సేవలకు వినియోగించనున్నారు. శ్రీకాకుళం జిల్లాలో అత్యవసర సేవలు పొందేందుకు టోల్‌ఫ్రీ  నెంబరు 08942 240557 అందుబాటులో ఉంచారు. 


ఒడిసాలో హై అలర్ట్‌..

తుఫాన్‌ ముప్పు హెచ్చరికతో ఒడిసాలోని 7 జిల్లాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ప్రభావిత ప్రాంతాలకు సహాయక బృందాలను తరలించింది. గజపతి, గంజాం, రాయగఢ్‌, కొరాపుట్‌, మల్కాన్‌గిరి, నబరంగ్‌పూర్‌, కాందమల్‌ జిల్లాలకు  ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలతో పాటు మరో 42 ఆ రాష్ట్ర బృందాలు, అగ్నిమాపక దళాలను పంపించారు. తుఫాన్‌ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్న గంజాం జిల్లాలో 15 బృందాలను మోహరించారు. 


అన్ని జాగ్రత్తలు తీసుకోండి: జగన్‌ 

తుఫాన్‌ పరిస్థితులపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి శనివారం రాత్రి సీఎంవో అధికారులతో సమీక్షించారు. అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే తుఫాన్‌ ప్రభావిత జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశామని సీఎంకు అధికారులు తెలిపారు. గ్రామ సచివాలయాల వారీగా కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశామన్నారు. తుఫాన్‌ అనంతర పరిస్థితులపైనా అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. తీరం దాటిన తర్వాత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, తగినవిధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 

క్రైమ్ మరిన్ని...