Abn logo
Nov 29 2020 @ 23:46PM

కష్టం దక్కేనా..

తడిచిన ధాన్యం ఆరబెడుతున్న రైతులు


ఆచంట, నవంబరు 29: నివర్‌ తుఫాన్‌తో పంటపొలాలు నీటమునిగాయి. మాసూలు చేసిన చేసిన ధాన్యం సైతం తడిచిముద్దయ్యింది. ఆదివా రం ఎండకాయడంతో రైతులు కాస్త ఊపిరిపీల్చుకున్నారు. తడిచిన ధాన్యాన్ని రైతులు ఆరబెట్టుకునే పనుల్లో నిమగ్నమైయున్నారు.

 

నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఏఎంసీ చైర్మన్‌ సుంకర ఇందిరాసీతారాం అన్నారు. నీట మునిగిన చేలన ఆమె పరిశీలించారు. మండలంలో సుమారు 2500 ఎకరాల్లో పంట నష్టపోయినట్టు తెలిపారు. కార్యక్రమంలో పలువురు వైసీపి నాయకులు పాల్గొన్నారు.


రైతాంగాన్ని ఆదుకోవాలి 

భీమవరం అర్బన్‌ : తుఫాన్‌తో నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌బ్లాక్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లంక కృష్ణమూర్తి డిమాండ్‌ చేశారు. భీమవరంలో ఆదివారం జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదేళ్లుగా రైతాంగానికి చెల్లించాల్సిన ఇన్‌పుట్‌ సబ్సిడీ, బీమా బకాయిలను విడుదల చేయాలన్నారు. పంట పోయిన వెంటనే నష్ట పరిహారం అందితే రైతుకు ఉపశమనం కలుగుతుందన్నారు. నివర్‌ భీభత్సంతో నష్టపరిహారం ఎప్పుడిస్తారు, ఎంతిస్తారో ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కనుమూరి వెంకటపతిరాజు, పట్టణ కన్వీనర్‌ దండు శ్రీనివాసరాజు, మోకా బాలకృష్ణ పాల్గొన్నారు.


సబ్సిడీపై విత్తనాలు అందించాలి

నరసాపురం రూరల్‌: నష్టపోయిన రైతులకు దాళ్వా సాగుకు సబ్సిడీపై విత్తనాలందించాలని ఏఎంసీ చైర్మన్‌ దొండపాటి స్వామి, డీసీసీబీ డైరెక్టర్‌ కెనడీ ఏవో జాన్సన్‌కు వినతిపత్రం అందించారు. మూడు సార్లు నష్టపోయిన రైతులకు నివర్‌ తుఫాన్‌ కన్నీటిని మిగిల్చిందన్నారు. జిల్లా అధికారులతో చర్చించి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని విన్నవించారు.

మొగల్తూరులో తడిచిన ధాన్యం ఒబ్బిడి చేస్తున్న కూలీలు

మొగల్తూరు: తుఫాన్‌తో తడిచిన వరి పనలను రైతులు ఒబ్బిడి చేస్తు న్నారు. మండలంలోని 1,500 ఎకరాల్లో వరి సాగు చేయగా మొత్తం చేలన్ని ముంపుకు గురై తీవ్రంగా నష్టపోయారు. కనీసం పశుగ్రాసం కోసమైనా గడ్డిని ఒబ్బిడి చేసుకునేందుకు వరి పనలు ఎండబెడుతున్నారు. మునిగిన చేలల్లో ధాన్యం మొలకెత్తుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

పాలకొల్లు మండలం గొల్లవాని చెరువులో ధాన్యం ఆరబెడుతున్న కూలీలు

పాలకొల్లు రూరల్‌ : ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు ఆదివారం తగ్గుముఖం పట్టి ఎండ రావడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. మండలంలోని రైతులు మాసూలు చేసిన ధాన్యం ఎగరబోత, ఆరబోత పనులను చేపట్టారు. చేలల్లో నీటిని ఇంజన్ల సహాయంతో బయటకు నీటిని తోడుకున్నారు. మండలంలో సుమారు 1875 హెక్టార్లలో పంట నష్టపోయినట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. చేలు, వరి కుప్పలు, పనలపై ఉప్పు నీరు పిచికారీ చేసుకోవాలని ఏడీఏ ఎల్‌బీవీ.సత్యనారాయణ సూచించారు.

భీమవరం మండలంలో వరిని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌

రైతులను ఆదుకుంటాం


భీమవరం రూరల్‌ / వీరవాసరం : వర్షాలకు నష్టపోయిన రైతులను పూర్తిగా ఆదుకుంటామని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ రైతులకు భరోసా ఇచ్చారు. మండలంలోని తాడేరు, తుందుర్రు, బేతపూడి ప్రాంతాల్లో చేలను ఆదివారం ఆయన పరిశీలించారు. పంట నష్టం వివరాలను వ్యవసాయ అధికారులు ఆధ్వర్యంలో సేకరించి నెలరోజులలోనే రైతులకు నష్టపరిహారం అందిస్తామని తెలిపారు. ఆయనతో పాటు ఏడీఏ శ్రీనివాసరావు, ఏడీ శ్రీనివాస్‌, పేరిచర్ల నరసింహరాజు, చినమిల్లి నాగన్న, కొట్టి కుటుంబరావు, నామన మహేష్‌, కోమటి రాంబాబు, తదితరులు ఉన్నారు.


వీరవాసరం, బాలేపల్లి, దూసనపూడి, మత్స్యపురిపాలెం చేలను పరిశీలిం చి రైతులతో మాట్లాడారు. పలు ప్రాంతాల్లో రైతులు కుళ్ళిన, నీటమునిగిన వరిని తీసుకువచ్చి ఎమ్మెల్యేకు చూపించారు. పంట నష్టంపై అధికారులు సర్వే చేస్తున్నారని, నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని ఎమ్మెల్యే చెప్పారు. గొలగాని సత్యనారాయణ, గూడూరి ఓంకార్‌, నాగరాజు శ్రీనివాసరాజు, పోలిశెట్టి దాసు, చికలే మంగతాయారు, తదితరులు పాల్గొన్నారు.

కొప్పర్రులో వరి పనలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే ప్రసాదరాజు

నరసాపురం రూరల్‌: తుఫాన్‌తో నష్టపోయిన రైతులను అదుకుంటా మని ఎమ్మెల్యే ప్రసాదరాజు భరోసా ఇచ్చారు. మండలంలోని కొప్పర్రులో ముంపుబారిన వరి చేలు, వరి పనలను ఆయన పరిశీలించారు. ఎకరాకు రూ.15వేలు చొప్పున పరిహారం అందించేలా రైతులకు న్యాయం చేస్తామ న్నారు. దాళ్వా సాగుకు సబ్సిడీపై విత్తనాలు అందించేలా చూస్తామన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో పంట నష్టంపై చర్చించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఏవో జాన్సన్‌, వైసీపీ నాయకులు దొంగ మురళీ, గోపి, కెనడీ, బాబా, యాదంరెడ్డి సూరిబాబు, రావి బ్రహ్మజీ పాల్గొన్నారు.

మోగల్లులో ధాన్యం పరిశీలిస్తున్న మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ

ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం..


పాలకోడేరు: తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ అన్నారు. మోగల్లులో వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదివారం వెంకటరమణ పరామర్శించారు. పంట పొలాలను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు. ఆయన వెంట సాంబ్రని సుకరుడు, మాజీ ఎంపీటీసీ శివరామరాజు, నాయకులు, రైతులు ఉన్నారు.

Advertisement
Advertisement
Advertisement