తుఫాను గండం

ABN , First Publish Date - 2020-11-27T06:07:07+05:30 IST

నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో జిల్లాలో వర్షాలు కురుస్తు న్నాయి.

తుఫాను గండం
రుద్రవరం మండలం పెద్దకంబలూరులో నేలవాలిన వరి పంటను చూపుతున్న రైతు

  1. మొదలైన నివర్‌ ప్రభావం
  2. నంద్యాల డివిజన్‌లో వర్షాలు
  3. నేలవాలి.. నీట మునిగిన వరి
  4. తడిసిన మొక్కజొన్న ధాన్యం
  5. అధికార యంత్రాంగం అప్రమత్తం
  6. శిరివెళ్ల, రుద్రవరంలో కలెక్టర్‌, ఎస్పీ పర్యటన


(న్యూస్‌ నెట్‌వర్క్‌, ఆంధ్రజ్యోతి) నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో జిల్లాలో వర్షాలు కురుస్తు న్నాయి. నంద్యాల రెవెన్యూ డివిజన్‌లో వరి, మొక్కజొన్న పంటలపై దుష్ప్రభావం కనిపిస్తోంది. పలు చోట్ల వరిపంట నేలవాలి నీట మునిగింది. కల్లాల్లో ఆరబెట్టిన మొక్కజొన్న ధాన్యం తడిసిపోయింది. వర్షానికి ఈదురు గాలులు తోడవ్వడంతో పట్టలు కప్పినా ఫలితం కనిపించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రబీలో సాగు చేసిన ఇతర పంటలకూ నష్టం జరుగుతోందని రైతులు వాపోతు న్నారు. తుఫాన్‌ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమ య్యారు. శిరివెళ్ల, రుద్రవరం మండలాల్లో కలెక్టర్‌, ఎస్పీ పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. విపత్తును ఎదుర్కొనేం దుకు పునరావాస కేంద్రాలను, కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేశామని కలెక్టర్‌ వీరపాండియన్‌ తెలిపారు.


కలెక్టర్‌, ఎస్పీ పర్యటన

నివర్‌ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్‌ వీరపాండియన్‌ అధికారులను ఆదేశించారు. శిరివెళ్ల, రుద్రవరం మండలాల్లో ఎస్పీ ఫక్కీరప్ప, ఇతర అధికారులతో గురువారం పర్యటించారు. బంగారమ్మ వాగు, కోడిపిల్ల వాగులను, మాలమాగు వాగు, వక్కిలేరు వాగు, బంగారపు వంకల్లో ప్రవాహాన్ని పరిశీలించారు. వరద ఉధృతి అధికమై వాగులు పొంగిపొర్లే ప్రమాదం ఉందని, ప్రజల రాకపోకలను నిలువరించాలని శిరివెళ్ల తహసీల్దారు నాగరాజుకు సూచించారు. ఖాదరబాదర గ్రామంలో అత్యవసర వైద్య సేవలు అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాగుల వద్ద పోలీసు, వీఆర్వోలను కాపలా ఉంచాలని ఆదేశిం చారు. రుద్రవరం మండలానికి వైద్య బృందాన్ని పంపి స్తానన్నారు. ఒక విపత్తు వాహనం, రెస్క్యూ టీమ్‌ను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. తుఫాన్‌ తీవ్రత దృష్ట్యా నంద్యాల రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టామని కలెక్టర్‌ తెలిపారు. నంద్యాల సబ్‌ కలెక్టర్‌ కల్పనా కుమారి, అడిషనల్‌ ఎస్పీ గౌతమశాలి, ఆళ్లగడ్డ డీఎస్పీ రాజేంద్ర, తహసీల్దార్‌ వెంకటశివ, ఇన్‌చార్జి ఎంపీడీవో వరలక్ష్మి, ఏవో ప్రసాద్‌రావు, శిరివెళ్ల ఇన్‌చార్జి ఎంపీడీవో సాల్మన్‌, వీఆర్వో చెన్నయ్య, పంచాయతీ కార్యదర్శి సుబ్బరాయుడు కలెక్టర్‌ పర్యటనలో పాల్గొన్నారు. 


కొత్తపల్లి మండలంలో రైతులు ఆరబోసుకున్న మొక్కజొన్న తడిసి ముద్దయింది. 20 రోజుల క్రితమే మార్క్‌ ఫెడ్‌ ఆధ్వర్యంలో మొక్క జొన్నను కొనుగోలు చేశారు. కానీ ధాన్యం రైతుల పొలాల్లోనే ఉండిపోయింది. ఇదంతా నీట తడిసింది.


కోవెలకుంట్ల మండలంలో వరి, పత్తి పంటలు నేలవాలాయి. గుళ్లదుర్తి, కోవెలకుంట్ల, వల్లంపాడు, చిన్నకొప్పెర్ల, పెద్దకొప్పెర్ల, లింగాల, బిజినవేముల తదితర గ్రామాల్లో బుధవారం రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. నూర్పిడి చేసి ఆరబెట్టిన ధాన్యానికి రైతులు టార్పాలిన్లు కప్పారు. 


పగిడ్యాల మండలంలో రైతులు మొక్కజొన్న ధాన్యాన్ని కల్లాల్లో ఆరబెట్టుకున్నారు. మార్క్‌ ఫెడ్‌ కొనుగోలు చేసిన ధాన్యం కూడా రైతుల వద్దే ఉంది. వర్షానికి భయపడి పలువురు రైతులు సొంత ఖర్చుతో గోడౌన్లకు తరలిస్తున్నారు. మరికొందరు కల్లాల్లోనే బస్తాలు ఉంచి పట్టలు కప్పారు.


బండిఆత్మకూరు మండలంలో మోస్తరు వర్షం కురుస్తోంది. ఈదురు గాలులు వీయడంతో కోతకు వచ్చిన వరి పంట నేల కూలింది. రైతులు ధాన్యం ఆరబోసుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు. 


మహానంది మండలంలో గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. వర్షం వల్ల క్షేత్రంలో భక్తుల రద్దీ పూర్తిగా తగ్గిపోయింది. ఆలయ పరిసరాలు నిర్మానుష్యంగా మారాయి. వరి, మొక్కజొన్న పంటలకు అపార నష్టం చేస్తుందని రైతులు అంటున్నారు.


సంజామల మండల వ్యాప్తంగా గురువారం తెల్లవారుజామున నుంచి వర్షం కురుస్తూనే ఉంది. చేతికొచ్చిన వరి పంట నేలకొరిగింది. రబీలో సాగు అయిన శనగ పంట సైతం దెబ్బతింటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వరి, మొక్కజొన్న కోయించిన రైతులు ధాన్యంపై టార్పాలిన్‌ కప్పి భద్రపరుచుకుంటున్నారు.


జూపాడుబంగ్లా మండలంలో నివర్‌ తుఫాను ప్రభావంతో మొక్కజొన్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని తీసుకుపోలేదు. మరికొంత మంది రైతులు ధాన్యం ఆరబెట్టుకున్నారు. అంతలోపే చిన్నపాటి వర్షం పడటంతో రైతులు తీవ్ర అవస్థలు పడ్డారు. 


చాగలమర్రి మండలంలో గుడిసెల్లో నివసిస్తున్న కుంచపూరిలు, చెంచు కాలనీల గిరిజనులను ఇన్‌చార్జి తహసీల్దార్‌ శివశంకర్‌ రెడ్డి కలిశారు. కాలనీల్లో వరద నీరు రాకముందే కస్తూర్బా పాఠశాలలోని పునరావాస కేంద్రానికి వెళ్లాలని సూచించారు. 


ఉయ్యాలవాడ మండలంలో వరి, పత్తి, మిరప పంటలకు భారీ నష్టం వాటిల్లింది. కల్లాల్లో ఉంచిన వరి ధాన్యం, పండుమిర్చి, మొక్కజొన్నలు తడిసిపో యాయి. సీడు పత్తి కాయలు రాలిపోయాయి.



రుద్రవరం మండలంలో 20వేల ఎకరాల్లో వరి నేలవాలింది. 300 ఎకరాల్లో మినుము కట్టె తడిసిపోయింది. రుద్రవరంలో గ్రామంలో మిరప పంట దెబ్బతింది. పొలాల్లో వరి ధాన్యంపై కప్పిన పట్టలు గాలికి ఎగిరిపోయాయి. దీంతో 50 వేల బస్తాల ధాన్యం తడిసిపోయిందని రైతులు గుండెలు బాదుకుంటున్నారు. మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో వృక్షం కూలింది. 


పాఠశాలలకు సెలవు

కర్నూలు(ఎడ్యుకేషన్‌): నివర్‌ తుఫాన్‌ వల్ల జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పాఠశాలలకు శుక్రవారం సెలవు ప్రకటించినట్లు డీఈవో గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలల యాజమా న్యాలు విధిగా పాటించాలన్నారు. విద్యార్థులు  ఇళ్లల్లోనే ఉండాలని సూచించారు. 



Updated Date - 2020-11-27T06:07:07+05:30 IST