సైక్లింగ్‌ను అలవాటుగా మార్చుకోవాలి...

ABN , First Publish Date - 2021-06-04T05:09:31+05:30 IST

సైక్లింగ్‌ను అలవాటుగా మార్చుకోవాలి...

సైక్లింగ్‌ను అలవాటుగా మార్చుకోవాలి...
రాజును అభినందిస్తున్న వినయ్‌

 చీఫ్‌విప్‌ వినయభాస్కర్‌

 బ్యాటరీ సైకిల్‌ తయారుచేసిన  రాజుకు అభినందనలు

హన్మకొండ టౌన్‌, జూన్‌ 3: ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు వ్యాయామంలో భాగంగా సైకిల్‌ తొక్కాలని ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయభాస్కర్‌ పిలుపునిచ్చారు. ప్రపంచ సైక్లింగ్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని వినయభాస్కర్‌ గురువారం యువకులు, చిన్నారులతో కలిసి సైకిల్‌ తొక్కారు. ఈ సందర్భంగా వినయభాస్కర్‌ మాట్లాడుతూ.. రోజువారీ కార్యకలాపాల కోసం బయటకు రావడానికి సైకిల్‌ అలవాటు చేసుకుంటే ఇంధనం పొదుపుతో పాటు పర్యావరణాన్ని కాపాడుకోవచ్చన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ చొరవతో వరంగల్‌ నగరం సైకిల్‌ ఫర్‌ ఛాలెంజ్‌కు ఎంపిక అయిందన్నారు. వారంలో ఒకరోజు తాను సైకిల్‌ వినియోగిస్తానని వినయభాస్కర్‌ తెలిపారు. 

బ్యాటరీ సైకిల్‌

రూ.20వేలకే బ్యాటరీ సైకిల్‌ తయారు చేసిన ముప్పారపు రాజును చీఫ్‌విప్‌ వినయభాస్కర్‌ అభినందించారు. రాజు వరంగల్‌ రూరల్‌ జిల్లా దుగ్గొండి మండల గోపాలపురం గ్రామంలో టూల్‌ వర్క్‌షాపు నడుపుతున్నాడు. కాగా, గంటకు 25 కిలోమీటర్ల వేగంతో నడిచే సైకిల్‌ను తన క్యాంపు కార్యాలయంలో పరిశీలించారు. గంట చార్జింగ్‌ చేస్తే 25కిలోమీటర్లు నడవడంతో పాటు చార్జింగ్‌ అయిపోతే సాధారణ సైకిల్‌లా తొక్కుకుంటూ వేళ్లే వెసులుబాటు ఉండటం మంచి విషయమన్నారు. 

కాగా, రాజు బ్యాటరీ సైకిల్‌ను విభిన్నంగా తయారుచేశాడు. పెట్రోల్‌ ధరలు పెరుగుతున్నందున సోలార్‌ బ్యాటరీ అమర్చారు.  సైకిల్‌కు సోలార్‌ ప్యానెల్‌ అమర్చి దాని ద్వారా బ్యాటరీ చార్జింగ్‌ అయ్యేలా  రూపొందించాడు. ఈ సైకిల్‌కు అయిన ఖర్చు రూ.9వేలు. కాగా, రాజు పొలాల్లో కలుపు తీసేందుకు బ్యాటరీతో పని చేసే గ్రాస్‌ కట్టర్‌ను తయారు చేసి తక్కువ ధరకు విక్రయిస్తున్నాడు. రాజును అభినందించిన వినయభాస్కర్‌ ఓ సైకిల్‌ను కొనుగోలు చేశారు.

Updated Date - 2021-06-04T05:09:31+05:30 IST