సమానత్వం కోసం సైకిల్‌ యాత్ర

ABN , First Publish Date - 2021-01-08T06:51:13+05:30 IST

సిలిగురి పర్వత సానువుల్లో

సమానత్వం కోసం సైకిల్‌ యాత్ర

- లింగ వివక్షకు వ్యతిరేకంగా ప్రచారం

- సైకిల్‌పై దేశయాత్రలో పశ్చిమ బెంగాల్‌ యువకుడు

- హైదరాబాద్‌ చేరిన యాత్రికుడు


‘‘కళ్లముందు జరిగే అమానవీయ ఘటనలపై కొందరు పెదవి విరుస్తారు. మరికొందరు ‘అయ్యో పాపం’ అని ఊరుకుంటారు. ఇంకొందరు మాత్రం అన్యాయంపై పోరాడేందుకు కార్యక్షేత్రంలోకి దుముకుతారు. సామాజిక మార్పు కోసం తమవంతు బాధ్యతను భుజానేసుకుంటారు. అదే కోవకి చెందిన ఒక యువకుడు సమాజంలోని లింగవివక్ష నిర్మూలన కోసం కొత్తదారి ఎంచుకున్నాడు. రోడ్డు భద్రతపై కూడా అవగాహన కల్పించేందుకు వినూత్న శైలిలో ప్రచార కార్యాక్రమాన్ని చేపట్టాడు. ‘‘జెండర్‌ ఈక్వాలిటీ’’, ‘‘సేఫ్‌డ్రైవ్‌ సేవ్‌ లైఫ్‌’’ అంటూ ‘భారత్‌దర్శన్‌’ పేరుతో  సైకిల్‌యాత్రకు బయలుదేరాడు. అతడే పశ్చిమబెంగాల్‌కి చెందిన 27ఏళ్ల మధాయి పాల్‌. దేశ పర్యటనలో భాగంగా ఆయన గురువారం హైదరాబాద్‌ చేరుకున్నాడు. ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతి మధాయిపాల్‌ను పలకరించింది. 


హైదరాబాద్‌ సిటీ, జనవరి7 (ఆంధ్రజ్యోతి) సిలిగురి పర్వత సానువుల్లో పుట్టి, పెరిగిన మధాయి పాల్‌ గతేడాది డిసెంబరు ఒకటిన ఇంటి నుంచి భారత్‌దర్శన్‌కు సైకిల్‌పై బయలుదేరాడు. రోజుకు సుమారు పదిగంటల చొప్పున 120 కిలోమీటర్లు సైకిల్‌ తొక్కుతూ ప్రయాణిస్తున్నాడు. ఇంటర్మీడియేట్‌ వరకూ చదివిన మధాయి కొంతకాలం ఫార్మసీ పరిశ్రమలో ఉద్యోగం చేశాడు. అతనిది నిరు పేద కుటుంబం. ఇద్దరు అక్కలున్నారు. మధాయి చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు. అప్పటి నుంచి తల్లే కష్టపడి సంతానాన్ని పెంచి, పెద్దచేసింది. పేదరికం వల్ల తన ఇద్దరక్కలకూ చిన్నవయసులోనే పెళ్లిళ్లు అయ్యాయి. దాంతో తన తోబుట్టువులు ఎదుర్కొన్న కష్టాలను కళ్లారా చూసిన మధాయి బాల్యవివాహాల వల్ల తలెత్తే సమస్యలను గుర్తించాడు. అదే సమయంలో 16 ఏళ్ల తన అక్క కూతురికి పెళ్లి నిశ్చయమైంది. ఒకవైపు ప్రభుత్వాలు బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం అంటున్నా, పేద, మధ్యతరగతి కుటుంబాల్లో మాత్రం చిన్నవయసులోనే అమ్మాయిలకి పెళ్లి చేస్తుండడాన్ని గుర్తించాడు.


ప్ర‌మాదాల్లో ప్రాణాలు

భారతదేశంలో రోజుకి సుమారు నాలుగొందల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించడం కూడా మధాయిని కదిలించింది. రోడ్డు ప్రమాదాలకు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకపోవడమే ప్రధాన కారణమని విశ్వసించే అతను ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలనుకున్నాడు. అందుకోసం ‘‘జెండర్‌ ఈక్వాలిటీ’’తో పాటు ‘‘సేఫ్‌ డ్రైవింగ్‌-సేవ్‌ లైఫ్‌’’ నినాదంతో భారత్‌ దర్శన్‌కు బయలుదేరాడు. ఇప్పటి వరకు సుమారు రెండు వేల కిలోమీటర్లు సైకిల్‌మీద ప్రయాణించిన మధాయి మంగవారం తెలంగాణ రాష్ట్రానికి చేరుకున్నాడు. 


తల్లి వద్దని వారించినా....

మధాన్‌ రోజూ ఉదయం ఆరునుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే ప్రయాణిస్తాడు. అనంతరం ఆయా ప్రాంతంలోని దేవాలయాలు, సత్రాల్లో రాత్రి బస చేస్తాడు. మధాన్‌ సైకిల్‌ యాత్ర ఉద్దేశాన్ని తెలుసుకొన్న చాలామంది స్థానికులు ఎక్కడిక్కడ అతని కోసం ప్రత్యేక విడిదితో పాటు ఆహార సదుపాయాలను అందించడం విశేషం. రెపరెపలాడే త్రివర్ణపతాకం తగిలించిన మధాన్‌ సైకిల్‌ వెనుక గాలిపంపు, దుస్తుల బ్యాగుతో పాటు శయనానికి అవసరమైన పరుపు, స్నానపానాదులకు బక్కెటు తదితర వస్తువులు కనిపిస్తాయి. సాధారణ సైకిల్‌పై దేశాన్ని చుట్టిరావడం మాటలు కాదు, వద్దని కుటుంబసభ్యులు వారించారు. సాహసయాత్రలో ఆరోగ్య సమస్య తలెత్తింది. అయినా, అతనెక్కడా వెనకడుగువేయలేదు. ‘‘నా ప్రయత్నాన్ని మొదట కుటుంబ సభ్యులెవరూ అంగీకరించలేదు. అమ్మ అయితే, వద్దని నన్ను బతిమాలింది. ఏడ్చింది. నా యాత్ర ఉద్దేశం వివరించి చెప్పడంతో కొంత స్థిమితపడింది.’’ అని మధాన్‌ చెబుతున్నాడు.


ఏడాదిన్నర ప్రయాణం...

- మధాన్‌ పాల్‌

‘‘కశ్మీరుకు కూడా వెళతా. నా భారత్‌ దర్శన్‌ సైకిల్‌ యాత్ర మొత్తం సుమారు ఏడాదిన్నర పడుతుందని అంచనా. 2022 మే నాటికి విజయవంతంగా యాత్ర ముగించుకొని తిరిగి మా సొంతూరు సిలుగురికి చేరుకోవాలనేది నా లక్ష్యం. 

Updated Date - 2021-01-08T06:51:13+05:30 IST