కేన్సర్‌కు రోబోటిక్‌ రేడియో సర్జరీ... సైబర్‌నైఫ్‌

ABN , First Publish Date - 2021-02-02T07:44:15+05:30 IST

కేన్సర్‌ చికిత్సలో ఎప్పటికప్పుడు అత్యాధునిక చికిత్సా విధానాలు అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి.

కేన్సర్‌కు రోబోటిక్‌ రేడియో సర్జరీ... సైబర్‌నైఫ్‌

కేన్సర్‌ చికిత్సలో ఎప్పటికప్పుడు అత్యాధునిక చికిత్సా విధానాలు అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో కేన్సర్‌ కణాన్ని నిలువరించడంతో పాటు, దుష్ప్రభావాలను తగ్గించడం కోసం అందుబాటులోకి వచ్చిన చికిత్సా విధానమే ‘సైబర్‌ నైఫ్‌’!


కేన్సర్‌ సోకిన కణంతో పాటు, చుట్టూ ఉన్న కణజాలం, లింఫ్‌నోడ్స్‌ను సర్జరీతో తొలగించడం ద్వారా కేన్సర్‌ను నయం చేసే చికిత్స కొనసాగేది. అయితే కొన్ని సందర్భాల్లో కత్తితో అవసరం లేకుండానే సర్జరీ చేయగలిగే వెసులుబాట్లు ఉన్నాయి. మెదడు, వెన్నెముక, ఊపిరితిత్తులు, ప్రోస్టేట్‌, పాంక్రియాస్‌ మొదలైన ప్రదేశాల్లో కణితులను సర్జరీతో తొలగించడం కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో మిస్సైల్‌ టెక్నాలజీతో వ్యాధి సోకిన ప్రదేశం చుట్టుపక్కల కణజాలం దెబ్బతినకుండా కేవలం కేన్సర్‌ కణితి లక్ష్యంగా పనిచేసే రేడియేషన్‌ విధానం రోబోటిక్‌ రేడియో సర్జరీ. వైద్యుల సూచనలతో కేన్సర్‌ కణాలే లక్ష్యంగా శరీరంలోని ఏ ప్రదేశానికైనా చేరుకోగలిగే కచ్చితమైన చికిత్స అందించే ఈ రేడియేషన్‌ పరికరాన్ని ‘సైబర్‌ నైఫ్‌’ అంటారు.


కత్తితో పని లేకుండానే...

రేడియేషన్‌ మోతాదు తక్కువై కేన్సర్‌ కణం లొంగకపోవడం, మోతాదు ఎక్కువై ఇతర అవయవాలు రేడియేషన్‌ ప్రభావానికి గురై, ఆ దుష్ప్రభావాలతో మరణాలు సంభవించిన సందర్భాలూ ఉన్నాయి. రేడియేషన్‌ కణితితో పాటు పక్కన ఉన్న అవయవాలకు సోకడం వల్ల పలు దుష్ప్రభావాలు చోటుచేసుకుంటాయి. ఈ సైడ్‌ ఎఫెక్ట్స్‌ తాత్కాలికం కావచ్చు, శాశ్వతంగానూ ఉండిపోవచ్చు. వాంతులు, వికారం, రేడియేషన్‌ ఇచ్చిన ప్రదేశంలో చర్మం కమిలిపోవడం, నోట్లో పుళ్లు, వెంట్రుకలు రాలిపోవడం వంటివి సాధారణ దుష్ప్రభావాలు. అయితే కత్తి అవసరం లేకుండా రేడియేషన్‌తో రేడియో సర్జరీ చేయడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అవేంటంటే....


 ఐదు లేక ఆరు వారాలలో ఇచ్చే రేడియోథెరపీ సైబర్‌నైఫ్‌ సాయంతో ఒకటి లేదా ఐదు రోజుల్లోపు పూర్తి చేయవచ్చు.

నొప్పి ఏమాత్రం ఉండదు

ఊపిరి బిగబట్టవలసిన అవసరం లేదు

కేన్సర్‌ కణాల మీద మాత్రమే రేడియేషన్‌ ప్రభావం ఉంటుంది

 ఎటువంటి విశ్రాంతి అవసరం లేదు

శరీరంలో ఎంత చిన్న కణితి, ఎక్కడ ఉన్నా కచ్చితమైన రేడియేషన్‌ను అందించవచ్చు

 నిమిషాల్లో కోత లేకుండా కణితిని తొలగించవచ్చు

 కేన్సర్‌ కాని మెనింజియోమాస్‌, పిట్యూటరీ గ్రంథిలోని కణుతులు, మెదడు లోపల, వెలుపల ఉండే కణుతులు, వెన్నెముక మీద వచ్చే కణుతులను తొలగించవచ్చు


వయసు, దశ, గ్రేడింగ్‌ కీలకం!

రోగి వయసు, కేన్సర్‌ దశ, కణితి గ్రేడింగ్‌, కణితి ఉన్న ప్రాంతం ఆధారంగా ఈ రోబోటిక్‌ రేడియో సర్జరీని వైద్యులు నిర్ణయిస్తారు. కేన్సర్‌ తిరగబెట్టిన అవయవానికి లేదా వాల్యుమెట్రిక్‌ మాడ్యులేటెడ్‌ ఆర్క్‌థెరపీ, ఇతర రేడియేషన్‌ పద్ధతులతో పాటు సైబర్‌నైఫ్‌ చికిత్స కూడా అవసరం కూడా ఉండే వీలుంది.


డాక్టర్‌ సిహెచ్‌.మోహన వంశీ

చీఫ్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌,

ఒమేగా హాస్పిటల్స్‌,

హైదరాబాద్‌.ఫోన్‌: 9848011421

Updated Date - 2021-02-02T07:44:15+05:30 IST