తండ్రీకొడుకుల వాట్సాప్ చాట్‌ను ట్వీట్ చేసిన ట్రాఫిక్ పోలీసులు

ABN , First Publish Date - 2021-01-21T23:01:40+05:30 IST

ట్రాఫిక్ నిబంధనలపై ప్రచారానికి పోలీసులు వినూత్న మార్గాలను అనుసరిస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే.. జరిగే అనర్థాలను వివరించడానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నారు.

తండ్రీకొడుకుల వాట్సాప్ చాట్‌ను ట్వీట్ చేసిన ట్రాఫిక్ పోలీసులు

ఇంటర్నెట్ డెస్క్: ట్రాఫిక్ నిబంధనలపై ప్రచారానికి పోలీసులు వినూత్న మార్గాలను అనుసరిస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే.. జరిగే అనర్థాలను వివరించడానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నారు. ఎప్పటికప్పుడు వీడియో సందేశాలను, మీమ్‌లను పోస్టు చేస్తూ.. అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఓ ట్వీట్ చేశారు. వాహనాలను పిల్లలకు ఇచ్చే తల్లిదండ్రులు.. ఆ పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలంటూ ఓ హెచ్చరికలాంటి సూచనను ఆ ట్వీట్‌లో చేశారు. దీనికి సంబంధించి ఓ సరదా వాట్సాప్ చాట్‌ను పోస్ట్ చేశారు. 




ట్రాఫిక్ చలాన్లు నేరుగా తండ్రి మొబైల్ ఫోన్‌కు చేరుకోగా.. ఆ మెసేజ్‌‌ను తన కొడుకు వాట్సాప్‌ నంబర్‌కు ఫార్వార్డ్ చేస్తాడు. ‘ఏంట్రా ఇది’ అంటూ తనయుడిని తండ్రి ప్రశ్నిస్తాడు. ‘ఏమో నాన్న.. రాంగ్ చలానా అనుకుంటా’ అని ఆ అబ్బాయి సమాధానమిస్తాడు. ‘అవునా.. మరి ఇదేంటో’ అంటూ చలాన్‌కు సంబంధించిన ఫొటోను పంపిస్తాడు. ‘సారీ నాన్న.. కాలేజీకి వెళ్లే తొందరలో’ అని తనయుడు రిప్లై ఇస్తాడు.


‘మీ కాలేజీ కోఠీలో కదరా... ఇన్ ఆర్బిట్ మాల్‌లో స్పెషల్ క్లాస్ చెప్తున్నారా .. ఇంటికి రా మాట్లాడాలి’ అంటూ కొడుక్కి షాక్ ఇస్తాడు సదరు తండ్రి. దీంతో ఆ కొడుకు షాక్‌కు గురైనట్టు ఓ ఏమోజీని పెడతాడు. ‘కోఠీకి ఏ బస్సు వెళుతుందో తెలుసుకుని రా... రేపటి నుంచి అందులోనే వెళ్లాలి’ అంటూ చాటింగ్‌ను ముగిస్తాడు తండ్రి.   


ఈ ట్వీట్‌కు నెట్టింట మంచి స్పందన లభిస్తోంది. హాస్యాన్ని జోడిస్తూ.. చక్కని సందేశమిచ్చారంటూ పోలీసులను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Updated Date - 2021-01-21T23:01:40+05:30 IST