సైబర్‌ బూచోళ్లు..!

ABN , First Publish Date - 2020-09-25T07:10:04+05:30 IST

ఆన్‌లైన్‌ పాఠాలు, ఆటలు కారణాలేమైనా పిల్లలు గంటల కొద్దీ స్మార్ట్‌ఫోన్లతోనే గడుపుతున్నారు. రెండేళ్ల చిన్నారి నుంచి 17 ఏళ్ల పిల్లల వరకు స్మార్ట్‌ఫోన్‌తో కాలక్షేపం చేసేందుకు ఆసక్తి

సైబర్‌ బూచోళ్లు..!

పిల్లలకూ తప్పని వేధింపులు

సోషల్‌మీడియా జోలికి వెళ్లొద్దు

ఆన్‌లైన్‌ క్లాసులు, స్మార్ట్‌ఫోన్‌ వాడకంపై..తల్లిదండ్రులు దృష్టి సారించాలి

అలర్ట్‌ చేస్తున్న సైబరాబాద్‌ పోలీసులు


తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక ఇన్‌స్టాగ్రాం వినియోగిస్తోంది. రాజమండ్రికి చెందిన ఇద్దరు యువకులు అమ్మాయిల పేరుతో ఆ బాలికకు ఫ్రెండ్‌ రిక్వెస్టు పంపారు. రోజూ ఏదో ఒక వంకతో పలకరించి చాటింగ్‌ చేసేవారు. వారు నిజంగానే అమ్మాయిలని భావించిన బాలిక వారితో స్నేహం చేసింది. ఆమె బలహీనతను ఆసరాగా చేసుకున్న యువకులు మంచితనం నటిస్తూ ఆమె వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, వీడియోలు సేకరించారు. ఆ తర్వాత ఆమె తల్లిదండ్రుల స్టేటస్‌ తెలుసుకొని బాలిక ఫొటోలు అడ్డంపెట్టుకొని బ్లాక్‌మెయిల్‌ చేయడం మొదలుపెట్టారు. దాంతో భయపడిన బాలిక తన తల్లికి విషయం చెప్పింది.


సైబర్‌ నేరగాళ్లు ఆమెను కూడా బెదిరించారు. అడిగినంత డబ్బు ఇవ్వకుంటే తన కూతురు ఫొటోలు సోషల్‌మీడియాలో పెడతామని బెదిరించారు. అలా విడతల వారీగా ఆమె నుంచి రూ. 14 లక్షలు లాగేశారు. అయినా వారి వేధింపులు ఆగలేదు. దీంతో ఆమె సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ను కలిసింది. సీపీ ఆదేశాలతో రంగంలోకి దిగిన సైబర్‌ క్రైం పోలీసులు ఆ యువకులను కటకటాల్లోకి నెట్టారు. ఈ ఘటన ఇటీవల సైబరాబాద్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఇది మచ్చుకు ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి అనేక సంఘటనలు పోలీసుల దృష్టికి వస్తున్నాయి. 


హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 24 (ఆంధ్రజ్యోతి) : ఆన్‌లైన్‌ పాఠాలు, ఆటలు కారణాలేమైనా పిల్లలు గంటల కొద్దీ స్మార్ట్‌ఫోన్లతోనే గడుపుతున్నారు. రెండేళ్ల చిన్నారి నుంచి 17 ఏళ్ల పిల్లల వరకు స్మార్ట్‌ఫోన్‌తో కాలక్షేపం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే.. తండ్రి ఫోన్‌ కోసం కొట్టుకుంటున్న సందర్భాలు కోకొల్లలు. అంతేకాదు తల్లిదండ్రులు స్మార్ట్‌ఫోన్‌ కొనివ్వలేదని పిల్లలు ఆత్మహత్య చేసుకున్న ఉదంతాలూ ఉన్నాయి. కరోనా తెచ్చిన మార్పుతో ప్రతి విద్యార్థి నేడు ఆన్‌లైన్‌ క్లాస్‌ల కోసం గంటల కొద్దీ స్మార్ట్‌ఫోన్‌తోనే గడుపుతున్నారు. కొంత మంది తల్లిదండ్రులు పిల్లల క్లాసులు, చదువు దృష్టిలో ఉంచుకొని కష్టమైనా సరే ఫోన్‌లు కొనాల్సి వస్తోంది. పిల్లల్లో ఎంత మంది ఫోన్‌లను క్లాసుల కోసమే వినియోగిస్తున్నారనేదే అతిపెద్ద ప్రశ్న. ప్రస్తుత డిజిటల్‌ యుగంలో.. పదేళ్ల దాటిన చిన్నారులు సైతం ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం, వాట్సాప్‌ అంటూ సోషల్‌ మీడియాను విరివిగా ఉపయోగిస్తున్నారు. ఫ్రెండ్స్‌తో చాటింగ్‌లు, మీటింగ్‌లు మెసేజ్‌లు, పోస్టింగ్‌లతో గంటల కొద్దీ గడుపుతున్నారు. ఇదే క్రమంలో రోజు రోజుకు సైబర్‌ నేరాలు పెరిగిపోతున్నాయి. నేరగాళ్లు అదును చూసి పంజా విసురుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్మార్ట్‌ ఫోన్‌ వినియోగంలో చిన్నారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పిల్లలు సోషల్‌మీడియాతో పాటు ఇతర సైట్ల జోలికి వెళ్లకుండా తల్లిదండ్రులు దృష్టి సారించాలని సూచిస్తున్నారు. పొరపాటున నేరగాళ్ల వలలో చిక్కితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు.


తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి...వీసీ. సజ్జనార్‌, సైబరాబాద్‌ సీపీ

ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతో స్మార్ట్‌ఫోన్‌ వినియోగిస్తున్న చిన్నారులపై తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచాలి. వారు సరిగా క్లాసులు వింటున్నారా..? విరామ సమయంలో ఏం చేస్తున్నారు అనేది గమనించాలి. ఇటీవల 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిని ఇద్దరు ప్రైవేటు టీచర్లు లైంగికంగా వేధించారు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ కీచక గురువులను కటకటాల్లోకి నెట్టాము. ఇలాంటి ఘటనలు జరగకుండా తల్లిదండ్రులు పిల్లలకు అవగాహన కల్పించాలి.


సోషల్‌మీడియా జోలికి వెళ్లొద్దు...రోహిణి ప్రియదర్శిని, డీసీపీ క్రైమ్‌, సైబరాబాద్‌

స్మార్ట్‌ఫోన్‌, కంప్యూటర్‌లో ఆన్‌లైన్‌ క్లాసులు వింటున్న చిన్నారులు ఎట్టిపరిస్థితుల్లోనూ సోషల్‌ మీడియా జోలికి వెళ్లొద్దు. తప్పనిసరిగా వినియోగించాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పొరపాటున కూడా వ్యక్తిగత సమాచారం, ఫొటోలు వీడియోలు పోస్టు చేయడం గానీ, షేర్‌ చేయడం గానీ చేయకూడదు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్‌ రిక్వెస్టులను, మెసేజ్‌లను ఓపెన్‌ చేయొద్దు. యూసర్‌ ఐడీలు, పాస్‌వర్డులు ఇతరులకు చెప్పొద్దు. ఒకవేళ ఏదైనా సమాచారం పిల్లలు అప్‌లోడ్‌ చేస్తే అది ఇతరులకు వెళ్లకుండా తల్లిదండ్రులు సెట్టింగ్స్‌ను మార్చుకోవాలి. 


సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించాలి...అనసూయ, డీసీపీ (ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ సేఫ్టీ వింగ్‌), సైబరాబాద్‌

ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్న టీచర్లు ఎప్పటికప్పుడు విద్యార్థులకు తగిన జాగ్రత్తలు చెబుతుండాలి. సైబర్‌ నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పిల్లలకు ప్రత్యేకంగా బోధించాలి. ఇంటర్నెట్‌ను దుర్వినియోగం చేస్తే ఆ తర్వాత జరిగే పరిణామాలపై పిల్లలకు అర్థమయ్యేలా అవగాహన కల్పించాలి. 


ఖాతా ఖాళీ..

హైదరాబాద్‌ సిటీ: కేవైసీ అప్‌డేట్‌ పేరుతో బ్యాంకు ఖాతాదారులను కొల్లగొడుతున్న నేరగాళ్లు పెరుగుతున్నారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు కూడా వీరి బారినపడి రూ. లక్షలు పోగొట్టుకుంటున్నారు. ఇటీవల గచ్చిబౌలికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌కు ‘‘మీ బ్యాంకు ఖాతాకు సంబంధించిన కేవైసీ (నో యువర్‌ కస్టమర్‌) వివరాలు అప్‌డేట్‌ కాలేదు.  వెంటనే అప్‌డేట్‌ చేసుకోకపోతే ఖాతా బ్లాక్‌ చేయబడుతుంది’’ అంటూ ఆర్‌బీఐ నుంచి వచ్చినట్లుగా మెసేజ్‌ వచ్చింది. ఆ తర్వాత ఆర్‌బీఐ నుంచి మాట్లాడుతున్నామంటూ ఓ వ్యక్తి ఫోన్‌ చేసి ‘మీ కేవైసీ వివరాలు అప్‌డేట్‌ చేయండి లేదంటే టీమ్‌వీవర్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసి పాస్‌వర్డు చెబితే మేం అప్‌డేట్‌ చేస్తాం.’’ అంటూ నమ్మించారు. అతను చెప్పినట్టు చేయగానే బాధితుడి స్మార్ట్‌ఫోన్‌లోకి చొరబడిన సైబర్‌ నేరగాడు అతని ఖాతా వివరాలు, నెట్‌ బ్యాంకింగ్‌ ట్రాన్స్‌క్షన్‌ పాస్‌వర్డ్‌ తెలుసుకున్నాడు. ఆ తర్వాత విడతల వారీగా అతని ఖాతాలో ఉన్న రూ. 8లక్షలు దోచేశాడు. 


గూగుల్లోకి సైబర్‌ దొంగలు..ప్రతినిధులతో సీపీ సజ్జనార్‌ భేటీ

హైదరాబాద్‌ సిటీ: గూగుల్‌ను వేదికగా చేసుకొని.. మోసాలకు పాల్పడుతున్న సైబర్‌ నేరగాళ్ల ఆటకట్టించడానికి గూగుల్‌ ప్రతినిధులు పోలీసులకు సహకరించాలన్నారు సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌. ఎప్పటికప్పుడు సైబర్‌ నేరగాళ్ల సమాచారం పోలీసులకు అందజేస్తే వారి భరతం పడతామని చెప్పారు. ఈ మేరకు సైబరాబాద్‌ కమిషనరేట్‌లో గూగుల్‌ ఇండియా ప్రై. లిమిటెడ్‌ ప్రతినిధులతో గురువారం వెబినార్‌ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. 


నోడల్‌ అధికారిని ఏర్పాటు...

సైబర్‌ నేరాలపై పోలీసులకు అందుతున్న ఫిర్యాదులను పరిష్కరించడానికి గూగుల్‌ నుంచి అవసరమైన సమాచారం అందించడానికి ఒక ప్రత్యేక నోడల్‌ అధికారిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ అధికారి సైబర్‌ నేరగాళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. 24/7 విచారణాధికారులకు అందుబాటులో ఉండి సహకరించాలని గూగుల్‌ ప్రతినిధులను కోరారు. అంతేకాకుండా ఒక ప్రత్యేక టెక్నికల్‌ బృందాన్ని ఏర్పాటు చేసి సైబర్‌ నేరగాళ్లపై, వారు వినియోగిస్తున్న టెక్నికల్‌ ఐపీ అడ్రస్‌లపై దృష్టి సారించాలన్నారు. సమావేశంలో డీసీపీ క్రైమ్స్‌ రోహిణి ప్రియదర్శిని, సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ శ్యామ్‌బాబు, ఇన్‌స్పెక్టర్లు, గూగుల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రతినిధులు సునితా మొహంతి, దీపక్‌ సింగ్‌, తదితరలు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-25T07:10:04+05:30 IST