సార్‌.. ఆపదలో ఉన్నాం.. ఆదుకోండి!

ABN , First Publish Date - 2020-04-03T08:04:00+05:30 IST

‘సార్‌.. నగరంలో లాక్‌డౌన్‌ అమల్లో ఉంది. మెడికల్‌ ఎమర్జెన్సీ ఉన్నా బయటకు వెళ్లాలంటే భయంగా ఉంది. పోలీసులు వెళ్లనిస్తారో.. లేదో తెలియదు. దయచేసి మాకు సాయం చేయండి’...

సార్‌.. ఆపదలో ఉన్నాం.. ఆదుకోండి!

‘కంట్రోల్‌ రూమ్‌’కు బాధితుల ఏకరువు.. 

వారంలోనే 13 వేలకుపైగా ఫోన్‌ కాల్స్‌

సాయం చేస్తున్న సైబరాబాద్‌ పోలీసులు


హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): ‘సార్‌.. నగరంలో లాక్‌డౌన్‌ అమల్లో ఉంది. మెడికల్‌ ఎమర్జెన్సీ ఉన్నా బయటకు వెళ్లాలంటే భయంగా ఉంది. పోలీసులు వెళ్లనిస్తారో.. లేదో తెలియదు. దయచేసి మాకు సాయం చేయండి’ అని మియాపూర్‌కు చెందిన ఒక వ్యక్తి సైబరాబాద్‌ పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేసి తన సమస్యను ఏకరువు పెట్టాడు. దాంతో వెంటనే స్పందించిన పోలీసులు అత్యవసర పాసులు తీసుకొని వారి ఇంటికి వెళ్లారు. బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. అంతేకాదు.. లాక్‌డౌన్‌ పూర్తయ్యే వరకూ మెడికల్‌ ఎమర్జెన్సీకి ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూశారు.

ఫ సార్‌.. మా నాన్నగారికి డయాలసిస్‌ అవసరముంది. వెళ్లడానికి వాహనం అందుబాటులో లేదు. అంబులెన్స్‌కు ఫోన్‌ చేస్తే ఆలస్యమవుతుందని చెబుతున్నారు. సాయం చేస్తారా?.. అని మరో యువకుడి ఫోన్‌. వెంటనే రంగంలోకి దిగిన వలంటీర్లు సైబరాబాద్‌ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో అందుబాటులో ఉన్న అంబులెన్స్‌తో అక్కడికి వెళ్లారు.  పేషెంట్‌ను ఆస్పత్రికి తరలించి.. డయాలసిస్‌ అనంతరం ఇంటికి తీసుకెళ్లి వదిలిపెట్టారు.


ఇలా.. అనేక సమస్యలపై సైబరాబాద్‌ కొవిడ్‌-19 కంట్రోల్‌ రూమ్‌కు రోజూ వందలాది మంది బాధితులు ఫోన్‌ చేస్తున్నారు. కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసిన వారంలోనే 13వేలకు పైగా ఫోన్‌ కాల్స్‌ వచ్చినట్లు సిబ్బంది తెలిపారు. సైబరాబాద్‌ పోలీసులు, వలంటీర్లు రంగంలోకి దిగి వందలాది మంది సమస్యలు పరిష్కరించినట్లు పేర్కొన్నారు. 

కోవిడ్‌-19 కంట్రోల్‌ రూమ్‌ నంబర్స్‌: 94906 17440, 94906 17431

Updated Date - 2020-04-03T08:04:00+05:30 IST