హ్యాట్సాఫ్‌.. సైబరాబాద్‌ పోలీస్‌

ABN , First Publish Date - 2021-07-28T06:32:03+05:30 IST

చౌదరిగూడెంకు చెందిన

హ్యాట్సాఫ్‌.. సైబరాబాద్‌ పోలీస్‌
బాధితుల‌కు సొత్తు అంద‌జేస్తున్న సీపీ

రూ.1.50 కోట్ల రికవరీ సొత్తు బాధితులకు

దేశంలో మొదటిసారిగా ప్రాపర్టీ రిలీజ్‌ మేళా

హైదరాబాద్‌ సిటీ, జూలై 27 (ఆంధ్రజ్యోతి): చౌదరిగూడెంకు చెందిన ఆండాళ్లు పొలం పనిమీద వ్యవసాయ భావి వద్దకు వెళ్తుండగా స్నాచర్‌ ఆమె మెడలోని పుస్తెలతాడును తెంపుకొని పరారయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు పైసా పైసా కూడబెట్టుకొని సంపాదించుకున్న సొత్తుతో చేయించుకున్న పుస్తెలతాడు తనకు ఎంతో విలువైనది కావడంతో కొన్ని రోజుల పాటు ఏడ్చింది. మెల్లగా మర్చిపోతున్న సమయంలో ఒక్కసారిగా సైబరాబాద్‌ పోలీసుల నుంచి ఫోన్‌ వచ్చింది. ‘మీ పుస్తెలతాడు కొట్టేసిన దొంగను పట్టుకున్నాం. పుస్తెలతాడును స్వాధీనం చేసుకున్నాం, కోర్టు వివాదాలు పూర్తయిన వెంటనే తిరిగి ఇస్తాం’ అని వారు చెప్పడంతో ఆమె కళ్లలో ఆనందభాష్పాలు రాలాయి. మంగళవారం జరిగిన ప్రాపర్టీ రిలీజ్‌ మేళాలో సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ చేతుల మీదుగా ఆమెకు పుస్తెలతాడును అందజేశారు. ఆమె తన ఆనందాన్ని పోలీసులు, మీడియా ముందు పంచుకుంది. ఆమెలాంటి 176 మంది బాఽధితులకు వాళ్లు పోగొట్టుకున్న సొత్తును రికవరీ చేసి అందజేశారు. మొన్నటి వరకు కన్నీళ్లతో నిండిన వారి కళ్లలో ఆనందభాష్పాలు నింపారు పోలీసులు.


దేశంలోనే మొదటి సారిగా.. 

కేసు పెట్టినా పోయిన వస్తువు దొరకడం కష్టం. రికవరీ జరిగిన సొత్తును కోర్టు ద్వారా బాఽధితులు తీసుకోవాలంటే చాలా సమయం పడుతుంది. సొత్తు దొరికిందని ఆనందపడాలో, కోర్టు చుట్టూ తిరగలేక బాధపడాలో అర్థం కాని పరిస్థితి. ఈ నేపథ్యంలో సీపీ సజ్జనార్‌ బృహత్తరమైన ఆలోచనకు శ్రీకారం చుట్టారు. సైబరాబాద్‌ క్రైమ్స్‌ టీమ్‌, సీసీఆర్‌బీ, కోర్టు మానిటరింగ్‌ సిబ్బందితో సమావేశమై ప్రాపర్టీ రిలీజ్‌ మేళా అనే కొత్త కార్యక్రమం ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. కమిషనరేట్‌ పరిధిలోని 36 పోలీస్‌ స్టేషన్‌లను ఏకం చేశారు. కమిషనరేట్‌ పరిధిలోని 3 జిల్లాల న్యాయమూర్తులతో మాట్లాడి కోర్టు ప్రాసెస్‌, ఇతర ప్రొసీడింగ్స్‌ అన్నీ పోలీసులే చూసుకునేలా చేశారు. కోర్టు అనుమతితో రికవరీ అయిన సొత్తును బాధితులకు అందజేసేలా ప్రణాళికలు రూపొందించారు. మంగళవారం సైబరాబాద్‌ కమిషనరేట్‌ మైదానంలో స్టోలెన్‌ ప్రాపర్టీ రిలీజ్‌ మేళా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. శంషాబాద్‌, మాదాపూర్‌, బాలానగర్‌ జోన్‌ల పరిధిలో మొత్తం 176 కేసులను ఛేదించారు. ఆయా కేసుల్లో రికవరీ చేసిన రూ. 1.50కోట్ల విలువైన సొత్తును సీపీ సజ్జనార్‌ చేతుల మీదుగా బాధితులకు అందజేశారు. అప్పటి వరకు బంగారం, వెండి, బైక్‌లు, కార్లు, ఆటోలు పొగొట్టుకున్న బాధితులు తమ సొత్తు తమకు సీపీ సజ్జనార్‌ స్వయంగా అందజేయడంతో ఆనందంతో ఉప్పొంగి పోయారు. పోలీసుల తీరుపై ప్రశంసలు కురిపించారు. ఇలాంటి కార్యక్రమం రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే మొట్టమొదటి సారి కావడం గమనార్హం అని పోలీస్‌ ఉన్నతాఽధికారులు పేర్కొన్నారు.


సజ్జనార్‌కు సన్మానం 

జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉండే బెహరారామ్‌ ఇంట్లో ఉన్న రూ. 5లక్షల నగదును ఓ దొంగ ఎత్తుకెళ్లాడు. ఫిర్యాదు మేరకు జీడిమెట్ల ఇన్‌స్పెక్టర్‌ బాలరాజు తన టీమ్‌తో కేవలం 15 రోజుల్లోనే దొంగను పట్టుకున్నారు. రికవరీ చేసిన రూ.5 లక్షల నగదును అందజేయడంతో బెహరారామ్‌ ఆనందానికి హద్దుల్లేవ్‌. తమ ఆచారం ప్రకారం.. పగిడితో సీపీ సజ్జనార్‌, డీసీపీ క్రైమ్‌ విజయ్‌కుమార్‌, బాలానగర్‌ డీసీపీ పద్మజారెడ్డి, ఏసీపీ పురుషోత్తం, ఇన్‌స్పెక్టర్‌ బాలరాజులను సన్మానించారు. ‘మా అమ్మగారికి అనారోగ్యంగా ఉందని కుటుంబమంతా ఊరెళ్లాం. ఇంట్లో దొంగలు పడి బంగారం, వెండి, నగదును దోచుకెళ్లారు. సనత్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాం. కేవలం నెలరోజుల వ్యవధిలోనే సొత్తు రికవరీ చేసి అందించిన సైబరాబాద్‌ పోలీసులకు హ్యాట్సాప్‌’ అని రిటైర్డ్‌ ఉద్యోగి శేషారి సాయికృష్ణ తన ఆనందాన్ని వెలిబుచ్చారు. కార్యక్రమంలో క్రైమ్‌ డీసీపీ విజయ్‌కుమార్‌, డీసీపీ ప్రకాశ్‌రెడ్డి, పద్మజ, ఏసీపీలు, అన్ని పోలీస్‌ స్టేషన్‌ల ఇన్‌స్పెక్టర్‌లు, డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌లు, ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు, కోర్టుకానిస్టేబుళ్లు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-28T06:32:03+05:30 IST