సైబరాబాద్‌ పోలీసుల వినూత్న ఆలోచన.. చల్లచల్లగా.. కూల్‌ కూల్‌..!

ABN , First Publish Date - 2021-05-15T17:18:46+05:30 IST

రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. బయటకు వెళ్లాలంటేనే ప్రజలు...

సైబరాబాద్‌ పోలీసుల వినూత్న ఆలోచన.. చల్లచల్లగా.. కూల్‌ కూల్‌..!

  • అభినందించిన సీపీ సజ్జనార్‌
  • పోలీస్‌ డాగ్స్‌కు ప్రత్యేక ఏసీ గదులు
  • 500 పోలీస్‌ వాహనాల్లో..
  • ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్స్‌ ఏర్పాటు

హైదరాబాద్‌ సిటీ : రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. బయటకు వెళ్లాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మనుషుల పరిస్థితి ఇలా ఉందంటే మూగజీవాల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇదే ఆలోచన వచ్చింది సైబరాబాద్‌ కమిషనరేట్‌ కార్‌ హెడ్‌క్వార్టర్‌ అడిషనల్‌ డీసీపీ మాణిక్‌రాజ్‌కు. తమ ఆధీనంలో పనిచేస్తున్న పోలీస్‌ డాగ్స్‌కు విధినిర్వహణలో ఉన్నప్పుడు ఉపశమనాన్ని కలిగించాలని ఆరాటపడ్డాడు. ఇంటర్నెట్‌లో శోధించి పోలీస్‌ డాగ్స్‌కు ఎండ తగలకుండా ఉండటానికి వినూత్న ఆలోచన చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.


వాహనంలోనే ఏసీ గదులు

ఏదైనా క్రైమ్‌ జరిగిందంటే డాగ్‌ స్క్వాడ్‌ పోలీసుల హడావిడిగా బొలెరో వాహనంలో పోలీస్‌ డాగ్స్‌ను తీసుకెళ్లేవారు. అక్కడ ఎండనకా.. వాననకా.. అవి విధి నిర్వహణలో పాల్గొనేవి. ముఖ్యంగా ఎండాకాలంలో వాటిని క్రైమ్‌ సీన్‌కు తీసుకెళ్లినప్పుడు విపరీతమైన ఎండల కారణంగా అవి అలసిపోయి, గ్రాస్పింగ్‌ (వాసన చూడటం) పవర్‌ను కోల్పోయే ప్రమాదం ఉంది. అలా జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో అడిషనల్‌ డీసీపీ మాణిక్‌రాజ్‌ పోలీస్‌ ఇన్నోవా వాహనంలోనే వాటికి ఏసీ గదులు ఏర్పాటు చేయించారు. వాహనం వెనుక ఉన్న సీట్లు తీసేసి ఒక పెద్ద రూమ్‌ చేశారు. మధ్యలో పార్టీషన్‌ చేసి ఒక్కో డాగ్‌కు ఒక్కో గదిలా చిత్రీకరించారు. రెండు గదులకు సరిపడా ఏసీ వచ్చే విధంగా తగిన ఏర్పాట్లు చేశారు. దాంతో పోలీస్‌ డాగ్స్‌ ఏమాత్రం అలిసిపోకుండా, చల్లచల్లగా.. కూల్‌కూల్‌గా ఎండ నుంచి ఉపశమనం పొందుతున్నాయి. వినూత్న ప్రయత్నాన్ని సీపీ సజ్జనార్‌ అభినందించారు. 


500 వాహనాల్లో ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్స్‌

సైబరాబాద్‌ కమిషనరేట్‌లో పెట్రోలింగ్‌, క్రైమ్‌ సహా మొత్తం 500 వాహనాల్లో ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్స్‌ ఉండేలా చర్యలు తీసుకున్నారు సీపీ సజ్జనార్‌. ఈ మేరకు ప్రత్యేకంగా తెప్పించిన కిట్స్‌ను వాహన డ్రైవర్‌లకు అందజేశారు. పోలీసులు బయటకు వెళ్లినప్పుడు ఎక్కడైనా అనుకోని ప్రమాదం ఎదురైనా.. పౌరులు ఎవరైనా గాయపడినా వెంటనే వాహనంలో ఉన్న ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌తో వారికి ప్రథమ చికిత్స చేయాలని సీపీ పోలీసులకు, డ్రైవర్‌లకు సూచించారు.

Updated Date - 2021-05-15T17:18:46+05:30 IST