Abn logo
Oct 28 2020 @ 07:45AM

లింకులు పంపిస్తారు.. ఖాతాలు ఖాళీ చేస్తారు..

Kaakateeya

హైదరాబాద్‌ : తక్కువ వడ్డీకి లోన్‌ కావాలా..? క్రెడిట్‌ కార్డు కావాలా..? అంటూ అను నిత్యం మనకు ఫోన్‌కాల్స్‌ వస్తూనే ఉంటాయి. అలాగే రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్లు, స్కూళ్లు, కాలేజీలు... వర్క్‌ఫ్రమ్‌ హోం ద్వారా లక్షల ఆదాయం.. విదేశాలు తిరిగే అవకాశాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆశలు కల్పిస్తూ ప్రచారాలు జరుగుతుంటాయి. అలాంటి మార్కెటింగ్‌ కాల్స్‌ను 90శాతానికి పైగా జనం అంతగా పట్టించుకోరు. స్ర్కీన్‌పై స్పామ్‌ అని చూపిస్తే అసలు ఫోన్‌ రిసీవ్‌ కూడా చేయడం లేదు. కానీ దీన్నే సైబర్‌ నేరగాళ్లు తమ పంథాగా మార్చుకున్నారు. లోన్‌లు, కార్డులు అంటూ అవే ఆశలు చూపుతూ లింకులు పంపిస్తున్నారు. ఏదో వచ్చింది కదా అని ఆశతో లింకు ఓపెన్‌ చేస్తే ఇక అంతే సంగతులు. క్షణాల్లో ఫోన్‌ ద్వారా డేటా తస్కరిస్తున్న సైబర్‌ మోసగాళ్లు అకౌంట్‌లో ఉన్న డబ్బులు మాయం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఓటీపీ, పిన్‌ నెంబర్లు కాజేసి డబ్బులు తస్కరించే ముఠాలు జనానికి బురిడీ కొట్టించడానికి కొత్త కొత్త పంథాలు ఎంచుకుంటున్నాయి. తాజాగా లింకుల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు.


వాట్సాప్‌... మెయిల్‌ ద్వారా... 

వడ్డీ లేని రుణం.. తక్కువ వడ్డీ మీద లోన్‌.. మీకు లాటరీ వచ్చింది.. ఆదాయపు పన్ను రిటర్న్‌లో తేడా ఉంది. ఇలా వివిధ సాకులతో వాట్సా్‌పపై, మెయిల్‌ ద్వారా లింకులు వస్తుంటాయి. అలాంటి లింక్‌లను కలిగి ఉన్న మెయిల్‌లు, వాట్సా్‌పలను చాలా సందర్భాల్లో క్లిక్‌ చేస్తాము కూడా. కానీ ఆయా లింకులు చాలా మోసపూరితమైనవనే విషయం చాలామందికి తెలియదు. అలాంటి లింకులను క్లిక్‌ చేసి ఇప్పటికే ఎంతోమంది ఖాతాల్లోని డబ్బులు పోగొట్టుకున్నారు. బ్యాంక్‌ ఖాతా నుంచి డబ్బు తస్కరించడానికి సైబర్‌ మోసగాళ్లు ఇలాంటి సందేశాలను పంపి వల వేస్తుంటారు. తెలియకుండానే లింకులు క్లిక్‌ చేసి మోసపోతుంటారు.


మోసం జరిగేదిలా..

మోసగాళ్లు పంపే మెయిల్‌, వాట్సాప్‌ మెసేజ్‌ల ద్వారా వచ్చే లింక్‌లపై క్లిక్‌ చేస్తే అందులో ట్రోజన్‌ వైరస్‌ లేదా మాల్వేర్‌ వంటి హానికరమైన ఫైళ్లు ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్‌ అయ్యే ప్రమాదముంది. దాంతో కొన్ని సందర్భాల్లో మనకు తెలియని లింక్‌ క్లిక్‌ చేసినప్పుడు అసలు వెబ్‌సైట్‌లుగా కనిపించే నకిలీ వెబ్‌సైట్లు కూడా దర్శనమిస్తాయి. హ్యాకర్లు, సైబర్‌ మోసగాళ్లు తమ పనిలో సక్సెస్‌ అయి అమాయకులను ట్రాప్‌ చేసిన తర్వాత నకిలీ వెబ్‌సైట్‌ ద్వారా వ్యక్తిగత సమాచారం సేకరిస్తారు. నమ్మే అమాయకులు వారు చెప్పినట్టే వివరాలు నమోదు చేయగానే నేరగాళ్లు ఖాతాలపై విరుచుకు పడతారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికే నార్త్‌ ఇండియాలో అధికంగా చోటుచేసుకున్నాయి. హైదరాబాద్‌ సైబర్‌ క్రైంలోనూ ఇలాంటి ఫిర్యాదులు వచ్చాయి. నమోదైన కేసుల్లో ఓ వ్యాపారి అనుకోకుండా లింక్‌ క్లిక్‌ చేయగా మరుసటి రోజు అతడి అకౌంట్‌లోంచి డబ్బులు మాయమయ్యాయి. ఇలాంటి ఎన్నో కేసులు వేర్వేరు నగరాల్లో నమోదవుతూనే ఉన్నాయి.


నివారణ ఎలా? 

లింక్‌లను కలిగి ఉన్న వాట్సాప్‌, మెయిల్‌ల మెసేజ్‌లు వచ్చినప్పుడు వాటిపై క్లిక్‌ చేసే ముందు కొన్ని ప్రాథమిక అంశాలను గుర్తించాలి. ముఖ్యంగా పంపిన వ్యక్తి కాంటాక్ట్‌ లిస్టులో ఉన్న వారేనా.. అతను పరిచయమేనా? వచ్చిన మెసేజ్‌ను అతను గతంలోనూ పంపించి మోసం చేసే ప్రయత్నం చేశాడా అనేదీ గుర్తించాలి. మెయిల్‌ ఐడీ, లింకుతో పాటు వచ్చే మెసేజ్‌లో స్పెలింగ్‌ సరిగా ఉందా..? సెంటెన్స్‌ సరిగా ఉందా? చెక్‌ చేయాలి. పంపిన మెయిల్‌కు సంబంధించి ఆయా కంపెనీ గురించి ఆరా తీయాలి. చిన్న, చిన్న స్పెలింగ్‌ తప్పులతో మోసం చేస్తుంటారు. అయినా ఇలాంటి విషయాల్లో సాయం కోరే వారు ఇండియన్‌ మనీ డాట్‌ కామ్‌, ఐయామ్‌ చీటెడ్‌ డాట్‌ కామ్‌ లాంటి పోర్టళ్ల ద్వారా వివరాలు పొందవచ్చు.

Advertisement
Advertisement