భరతం పట్టిన రాచకొండ పోలీసులు
తొమ్మిది మంది అరెస్ట్
హైదరాబాద్ సిటీ: జార్ఖండ్ దొంగలతో కలిసి రూ. లక్షలు కొల్లగొడుతున్న సైబర్ దొంగల ముఠాను రాచకొండ పోసులు అరెస్టు చేశారు. తొమ్మిది మందిని కటకటాల్లోకి నెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. జార్ఖండ్ రాష్ట్రం దన్వాడ్ జిల్లాకు చెందిన విక్రాంత్ ఠాగూర్ సైబర్ నేరాలు చేయడంలో ఆరితేరాడు. జార్ఖండ్‌కే చెందిన కత్రావత్ రాజు బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి ఆటోడ్రైవర్‌గా పని చేశాడు. ఆ తర్వాత తిరిగి జార్ఖండ్‌కు వెళ్లాడు. అక్కడ విక్రాంత్ వద్ద ఆటోను అద్దెకు తీసుకొని నడుపుతున్నాడు.
తెలుగు రాష్ట్రాల్లో సైబర్ మోసాలు చేయాలని నిర్ణయించుకున్న విక్రాంత్.. కత్రావత్ రాజు సహకారం తీసుకున్నాడు. భాషాపరమైన ఇబ్బందులు రాకుండా తెలుగు రాష్ట్రాల నుంచి కొంతమంది యువకులను జార్ఖండ్‌కు రప్పిస్తే వారి ద్వారా సైబర్ మోసాలు చేయడం సులభం అవుతుందని, అందుకు కొల్లగొట్టిన సొత్తులో 30 శాతం కమీషన్ ఇస్తానని ఎర వేశాడు. దాంతో కత్రావత్ రాజు నగరానికి వచ్చి గతంలో తనకు పరిచయం ఉన్న కొంతమంది యువకులను ఒప్పించి కమీషన్ పద్ధతిన జార్ఖండ్‌కు పంపేవాడు. వారు అక్కడ విక్రాంత్ ఠాగూర్ వద్ద చేరేవారు. సైబర్ నేరాలు చేయడంలో అతడికి సహకరించేవారు. వివిధ బ్యాంకుల్లో రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి డేటాను సేకరించి, తన వద్ద చేరిన యువకులతో విక్రాంత్ మాట్లాడించేవాడు. బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని నమ్మించేవాడు. వలలో చిక్కిన వారి నుంచి ప్రాసెసింగ్ ఫీజుతో పాటు రకరకాల ఫీజుల కింద ముందుగా డబ్బులు తీసుకునేవారు. అందినంతా దండుకొని ఫోన్లు స్విచాఫ్ చేసేవారు.
అలా వందలాది సిమ్‌లతో వందలమందిని మోసం చేసి రూ. లక్షలు కొల్లగొట్టారు. రాచకొండలో నమోదైన సైబర్ క్రైమ్ ఫిర్యాదులతో రంగంలోకి దిగిన పోలీసులు జార్ఖండ్ ముఠాను గుర్తించారు. సాంకేతిక ఆధారాలు సేకరించి జార్ఖండ్ వెళ్లి తొమ్మిది మంది గల సైబర్ ముఠాను అరెస్టు చేశారు. వారిలో జార్ఖండ్‌కు చెందిన కత్రావత్ రాజు, కత్రావత్ సంతోష్ కాగా.. ఇస్లావత్ గణేష్, ముదావత్ వెంకటేశ్, కేతావత్ రాజు, దేగావత్ శ్రీనివాసులు, కత్రావత్ హరిలాల్, కత్రావత్ గణేష్, ముదావత్ గణే్‌షలు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. వారిలో ఐదుగురు విద్యార్థులు (19ఏళ్లు) ఉండటం గమనార్హం. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు.