సైబర్‌ వల

ABN , First Publish Date - 2022-05-01T06:31:54+05:30 IST

ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన కార్మికులు సైబర్‌ నేరగాళ్ల వలలోపడి అప్పులపాలవుతున్నారు. విదేశాలకు వెళ్లి డబ్బు సంపాదించి కుటుంబాలను ఉన్నతమైన స్థితిలో ఉంచాలని కలలుగన్న వారు మోసాలకు గురవుతున్నారు.

సైబర్‌ వల

ఫేక్‌ వెబ్‌సైట్‌లతో గల్ఫ్‌ కార్మికులకు గాలం 

ఉపాధికోసం విదేశాలకు వెళ్తున్న వారిని వదలని సైబర్‌ నేరగాళ్లు 

ఆన్‌లైన్‌ ద్వారా లక్షల్లో లావాదేవీలు  

లబోదిబోమంటున్న బాధితులు 8 రోడ్డున పడుతున్న కుటుంబాలు

సుభాష్‌నగర్‌, ఏప్రిల్‌ 30: ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన  కార్మికులు సైబర్‌ నేరగాళ్ల వలలోపడి అప్పులపాలవుతున్నారు. విదేశాలకు వెళ్లి డబ్బు సంపాదించి కుటుంబాలను ఉన్నతమైన స్థితిలో ఉంచాలని కలలుగన్న వారు మోసాలకు గురవుతున్నారు.  లక్షల్లో డబ్బులు పోగొట్టుకుని బాధితులు నడిరోడ్డున పడుతున్నారు. ఇప్పటి వరకు దుబాయి ఏజెంట్లను నమ్ముకుని మోసపోయిన విదేశాలకు వెళ్లాలనుకునే కార్మికులు ప్రస్తుతం సైబర్‌ నేరగాళ్లబారినపడి నిలువుదోపిడీకి గురవుతున్నారు.  సైబర్‌ నేరగాళ్లు ఆన్‌లైన్‌లలో ఫేక్‌ వెబ్‌సైట్‌లు తయారుచేసి డబ్బులు దండుకుంటున్నారు. విదేశాలకు సంబంధించిన ఎంబసీ అని ఫేక్‌ సైట్‌లు క్రియేట్‌ చేసి దొరికినకాడికి దండుకుంటున్నారు. జిల్లాలో ఇలాంటి సంఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. గల్ఫ్‌కు వెళ్లాలనే చదువులేని వారు దుబాయి ఏజెంట్ల ద్వారా వెళితే ఇంటర్‌, డిగ్రీ పాస్‌ అయిన వారు ఆన్‌లైన్‌ల ద్వారా ఎంబసీలను సంప్రదించి విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారు. ఇక్కడే సైబర్‌ నేరగాళ్లు తమ ఇంటర్‌నెట్‌ పరిజ్ఞానానికి పనిచెప్పి విదేశాలకు వెళ్లాలనుకునేవారిని బురిడికొట్టిస్తున్నారు. గల్ఫ్‌ ఇతర దేశాల ఎంబసీల వెబ్‌సైట్‌ల మాదిరిగానే నకిలీ వెబ్‌సైట్‌లను తయారుచేసి ఆ వెబ్‌సైట్‌లను సంప్రదించినవారిని మెళ్లిగా నమ్మబలుకుతున్నారు. నకిలీ ఆఫర్‌ లేటర్‌లను పంపించి కొంత నగదును ఆన్‌లైన్‌ ద్వారా పంపమంటున్నారు. ఆఫర్‌ లెటర్‌ను పంపిన తర్వాత నిజమైన ఆఫర్‌ లెటరే అనుకుని నగదును ఆన్‌లైన్‌ ద్వారా పంపడంతో వారి మోసం మొదలవుతోంది. తర్వాత వీసా, ఫ్లైట్‌ టికెట్‌, ఇతర ఖర్చులు అంటూ లక్షల్లో ఒక్కొక్కరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి సొమ్ముచేసుకుంటున్నారు. వీరిమీద ఫిర్యాదు చేయాలన్నా ఎలాంటి గుర్తింపు లేకపోవడంతో సైబర్‌ నేరగాళ్లు తేలికగా తప్పించుకుంటున్నారు. జిల్లాలో ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. బయటకి వచ్చిన సంఘటనలు కొన్నయితే బయటకిరాని సంఘటనలు అనేకం ఉన్నాయి. నిజామాబాద్‌ జిల్లా నందిపేట మండలానికి చెందిన కొమిరే ముత్తన్న మలేషియాకు వెళ్తామని ఆన్‌లైన్‌లో వెతకగా ఎంబసీకి సంబంధించిన సైట్‌ ద్వారా వారిని సంప్రదించారు. మొదట ఆఫర్‌ లెటర్‌ ఇచ్చి తర్వాత వీసా, ఫ్లైట్‌ టికెట్‌ అంటూ సుమారు లక్షకుపైగా డబ్బులను దండుకున్నారు. వారిని సంప్రదించాలని ప్రయత్నం చేయగా తర్వాత అది ఫేక్‌ వెబ్‌సైట్‌ అని తెలిసిపోయింది. దీంతో తాను మోసపోయానని హైదరాబాద్‌లో సైబర్‌ సెల్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై ఇంత వరకు ఎటువంటి నేరస్తులను అరెస్టు చేయలేదు. బ్యాంక్‌ అకౌంట్‌ కూడా తాత్కాలిక బ్యాంక్‌ అకౌంట్‌ యూస్‌ చేసి వాటిని క్లోస్‌ చేశారు. కొమిరే ముత్తన్న ఒకసారి 60వేలు, ఇంకోసారి 60వేలు, ఇంకోవేలు 11వేలు, ఇలా సుమారు లక్షా 50వేలకు పైగా ఆన్‌లైన్‌ లావాదేవీల ద్వారా డబ్బులు తీసుకున్నారు. ఇలాంటి మోసాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. సైబర్‌ నేరగాళ్లు గల్ఫ్‌ కార్మికులను కూడా వదలడంలేదు. పొట్టకూటికోసమే గల్ఫ్‌ వెళ్లాలనుకుంటున్న కార్మికులకు సైబర్‌ నేరగాళ్లతో ప్రమాదం పొంచిఉంది. ఇప్పటికైనా గల్ఫ్‌ కార్మికులు నకిలీ ఏజెంట్ల ద్వారా నకిలీ సైబర్‌ నేరగాళ్ల బారినపడకుండా ముందు జాగ్రత్త వహించాలి.

సైబర్‌ నేరగాళ్లపై చర్యలు తీసుకోవాలి..

కొమిరే ముత్తన్న, లక్కంపల్లి

పక్కా మలేషియా వెబ్‌సైట్‌లాగానే నకిలీ వెబ్‌సైట్‌ సృష్టించి సైబర్‌ నేరగాళ్లు మోసం చేశారు. సైబర్‌ నేరగాళ్లపట్ల ప్రజలు జాగ్రత్త వహించాలి. సుమారు రూ.లక్షా50 వేలకు పైగా డబ్బులు చెల్లించాను. పోలీసులు సైబర్‌ నేరగాళ్లపై దృష్టిపెట్టి తిరిగి డబ్బులు ఇప్పించాలి. 

వెబ్‌సైట్‌ మోసాలపై జాగ్రత్తగా ఉండాలి

వెంకటేశ్వర్‌, ఏసీపీ

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వల్ల కొందరు సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వెబ్‌సైట్‌ మోసాలకు పాల్పడుతున్నారు. అటువంటి వారిపట్ల ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా విదేశాలకు వెళ్లే వారు అటువంటి వెబ్‌సైట్‌ల వల్ల మోసపోకుండా ఉండాలి. పూర్తిగా అవగాహన కలిగి ఉండి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఒకవేళ ఎటువంటి అనుమానాలు వచ్చినా అటువంటి వెబ్‌సైట్‌లపై తమ దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2022-05-01T06:31:54+05:30 IST