సైబర్‌ బీమాకు సై

ABN , First Publish Date - 2020-06-13T05:57:32+05:30 IST

మనం అనారోగ్యానికి గురయితే హెల్త్‌ ఇన్స్యూరెన్స్‌లు కాపాడతాయి. మరి కంప్యూటర్లు, ఇతర ఎలకా్ట్రనిక్‌ డివైజ్‌లు, వాటిలో స్టోర్‌ చేసిన డేటాకు రక్షణ ఎలా? అంటే... వాటి భద్రత కోసమే సైబర్‌ ఇన్స్యూరెన్స్‌ ఉంది. కరోనా కాలంలో సైబర్‌ నేరాలు పెరుగుతున్న సమయంలో ఎక్కువ మంది సైబర్‌ బీమా మీద ఆసక్తి చూపుతున్నారు...

సైబర్‌ బీమాకు సై

మనం అనారోగ్యానికి గురయితే హెల్త్‌ ఇన్స్యూరెన్స్‌లు కాపాడతాయి. మరి కంప్యూటర్లు, ఇతర ఎలకా్ట్రనిక్‌ డివైజ్‌లు, వాటిలో స్టోర్‌ చేసిన డేటాకు రక్షణ ఎలా? అంటే... వాటి భద్రత కోసమే సైబర్‌ ఇన్స్యూరెన్స్‌ ఉంది. కరోనా కాలంలో సైబర్‌ నేరాలు  పెరుగుతున్న సమయంలో ఎక్కువ మంది సైబర్‌ బీమా మీద ఆసక్తి చూపుతున్నారు. 

 

సెక్యూరిటీ లోపాలు

కంప్యూటర్లు, మొబైల్‌ ఫోన్లు, రౌటర్లు, ఇతర నెట్‌వర్క్‌ డివైజ్‌లు, వెబ్‌ సర్వర్లు, క్లౌడ్‌ సర్వీసులు, వెబ్‌ అప్లికేషన్లు వంటి వివిధ రూపాల్లో టెక్నాలజీ వినియోగం అంచెలంచెలుగా విస్తరిస్తోంది. దురదృష్టవశాత్తూ వాటిని ఉపయోగించే ఫర్మ్‌వేర్‌ మొదలుకుని ఆపరేటింగ్‌ సిస్టం, వివిధ ఫ్రేమ్‌వర్క్‌, అప్లికేషన్లు వంటి అనేక స్థాయుల్లో భద్రతా లోపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎవరిని టార్గెట్‌ చెయ్యాలో, వాళ్లు ఎలాంటి వ్యవస్థలు వాడుతున్నారో తెలుసుకోగలిగితే చాలు..  హ్యాకర్లు ఆయా ఆపరేటింగ్‌ సిస్టం, అప్లికేషన్లలో ఉండే లోపాలను ఉపయోగించి  సులభంగా వాటిలో ప్రవేశించడం సాధ్యపడుతోంది.  సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ సంస్థలు ఎప్పటికప్పుడు తమ ఫర్మ్‌వేర్‌, అప్లికేషన్లు, ఆపరేటింగ్‌ సిస్టంలకు సెక్యూరిటీ ప్యాచ్‌లు విడుదల చేస్తున్నప్పటికీ, వాటిని అప్‌డేట్‌ చేసుకోవడంలో యూజర్లు అశ్రద్ధ వహించడం వల్ల ప్రమాదాల బారిన పడుతున్నారు. చాలాచోట్ల పైరేటెడ్‌ సాఫ్ట్‌వేర్ల వినియోగం కూడా దీనికి ప్రధాన కారణం. అప్‌డేట్‌ చేస్తే తమ లైసెన్స్‌ జెన్యూన్‌ కాదని, ఆ సాఫ్ట్‌వేర్‌ పనిచేయటం ఆగిపోతుందని చాలామంది యూజర్లు పాత అప్లికేషన్లనే వాడేస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరం.


వన్నాక్రై, పెట్యా... గుర్తున్నాయా? కొన్ని సంవత్సరాల క్రితం టెక్‌ రంగాన్ని అతలాకుతలం చేసిన రాన్‌సమ్‌వేర్లు ఇవి. ప్రపంచవ్యాప్తంగా వీటి వల్ల భారీ మొత్తంలో నష్టం జరిగింది. పెద్ద పెద్ద కంపెనీలు కూడా డేటాను నష్టపోవాల్సి వచ్చింది. ఒక్క మన దేశంలోనే ఒక అంచనా ప్రకారం 48 వేల కంప్యూటర్లు వన్నాక్రై బారిన పడ్డాయి. వాటిలోని కోట్లాది రూపాయల విలువ చేసే డేటా పోయింది. కరోనా వైరస్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న నేపథ్యంలో కొన్ని నెలల క్రితం అంతర్జాతీయ సైబర్‌ సెక్యూరిటీ సంస్థలు ఒక హెచ్చరిక జారీ చేశాయి. సైబర్‌ నేరగాళ్లు ఇదే అదనుగా పొంచి ఉన్నారని, అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. అనుకున్నట్లుగానే ఇటీవల ప్రపంచవ్యాప్తంగా భారీ మొత్తంలో సైబర్‌ నేరాలు జరుగుతున్నాయి. పెద్ద పెద్ద సంస్థలు మాత్రమే కాకుండా, మామూలు వినియోగదారులు కూడా ఈ నేరాల బారినపడి తమ ముఖ్యమైన డేటా  పోగొట్టుకుంటున్నారు, అలాగే సైబర్‌ ఆర్థిక నేరాల కారణంగా డబ్బు కూడా కోల్పోతున్నారు.


ఎలాంటి రక్షణా లేకుండా..!

ఒక సగటు వినియోగదారుడి కంప్యూటర్‌, మొబైల్‌ ఫోన్‌ మొదలుకొని పెద్ద పెద్ద కంపెనీల సంక్లిష్టమైన నెట్‌వర్క్‌ వరకూ ఎక్కడా కూడా సరైన భద్రతా ప్రమాణాలు పాటించడం లేదు. కొందరు స్టార్టప్‌లను మంచి ఆలోచనతో ప్రారంభిస్తున్నారు. కానీ తగిన భద్రత లేకపోవడం వల్ల వారి డేటాబేస్‌లు హ్యాక్‌ అవడం, వారి ఖాతాదారుల డేటా హ్యాకర్ల బారిన పడడం ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో ఉండే ఓ ఐ.టీ. సంస్థ కస్టమర్‌ డేటాని హ్యాకర్లు చేజిక్కించుకున్నారు. కంపెనీ డాష్‌ బోర్డులో ప్రవేశించి కొత్త ఆర్డర్లు సృష్టించి, తగిన మొత్తంలో బిట్‌ కాయిన్‌ ద్వారా చెల్లించకపోతే ఆ డేటా పబ్లిక్‌గా పెడతామని బెదిరించారు.


పరిష్కారం  ఏమిటి?

వ్యక్తి నుంచి సంస్థల వరకు సైబర్‌ సెక్యూరిటీ మీద అవగాహన కలిగి ఉండాలి. ఫైర్‌వాల్స్‌ నెలకొల్పాలి. వివిధ సెక్యూరిటీ టూల్స్‌ ద్వారా తమ డివైజ్‌లపై జరిగే దాడులను గుర్తించి అడ్డుకోవడం చేయాలి. సెక్యూరిటీ అడిట్‌ తరచూ నిర్వహించాలి. అశ్రద్ధ చేయకుండా ఎప్పటికప్పుడు విడుదల అయ్యే అప్‌డేట్లు, సెక్యూరిటీ ప్యాచ్‌లను ఇన్‌స్టాల్‌ చేసుకోవడం చాలా ముఖ్యం. అలాగే భారీ స్థాయిలో కార్యకలాపాలు సాగించే ఐటీ కంపెనీలు, బ్యాంకులు, మౌలిక సదుపాయాల కంపెనీలు, ఆస్పత్రులు వంటివి సుశిక్షితులైన సైబర్‌ సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకోవాలి. తమ నెట్‌వర్క్‌ వ్యవస్థల్లో ఉండే సెక్యూరిటీ లోపాలను గుర్తించి సకాలంలో సరిచేసుకోవాలి. 


బీమాతో రక్షణ

ప్రపంచవ్యాప్తంగా సుదీర్ఘకాలంగా సైబర్‌ ఇన్స్యూరెన్స్‌ అందుబాటులో ఉన్నప్పటికీ, ఇండియాలో మాత్రం ఇటీవల బాగా పాపులర్‌ అయింది. దేశంలో ఉన్న అన్ని ఇన్స్యూరెన్స్‌ కంపెనీలు ఇప్పుడు సైబర్‌ ఇన్స్యూరెన్స్‌ అందిస్తున్నాయి. వ్యక్తిగత కంప్యూటర్లు, మొబైల్‌ డివైజ్‌లు మొదలుకొని కార్పొరేట్‌ కంపెనీలకు బీమా పాలసీ సౌకర్యం కల్పిస్తున్నాయి. అయితే వీటిలో కొన్ని పరిమితులు కూడా ఉంటున్నాయి. ఉదాహరణకు ఫిషింగ్‌ దాడుల నుంచి రక్షించడం కోసం ఈ పాలసీ తీసుకుంటే, ఇన్స్యూరెన్స్‌ చేసిన మొత్తంలో 10 నుంచి 20 శాతం మాత్రమే క్లెయిమ్‌ చేసుకోవడానికి సాధ్యపడుతుంది. అలాగే పాలసీ ఎంపిక చేసుకోబోయే ముందు అన్ని విషయాలు నిశితంగా గమనించాలి. ఉదాహరణకు కొన్ని పాలసీల్లో మాల్‌వేర్‌ ఎటాక్‌ కవరేజ్‌ కూడా లభిస్తుంటే, మరికొన్ని పాలసీల్లో అదనంగా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. 

అధికశాతం సైబర్‌ ఇన్స్యూరెన్స్‌ పాలసీలు ఐడెంటిటీ థెఫ్ట్‌, మాల్‌వేర్‌ ఎటాక్‌, సైబర్‌ స్టాకింగ్‌, ఈ మెయిల్‌ స్ఫూఫింగ్‌, ఫిషింగ్‌ ద్వారా తలెత్తే ఆర్థికపరమైన నష్టాలు, నష్టపోయిన డేటా వెలికి తీయడానికి అయ్యే ఖర్చు, మాల్‌వేర్‌ ద్వారా దెబ్బతిన్న కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌కి అయ్యే ఖర్చు, సైబర్‌ నేరాలను చట్టపరంగా ఎదుర్కోవడానికి అయ్యే ఖర్చులు వంటి వాటికి కవరేజ్‌ ఇస్తున్నాయి. ప్రస్తుతం వీటి ప్రీమియం ఎక్కువగా ఉండటంతో పెద్ద కంపెనీలు మాత్రమే వీటిని కొనగలిగే స్థోమతలో  ఉన్నాయి. అంతగా ఖర్చుచేయలేని మామూలు వినియోగదారులు సైబర్‌ సెక్యూరిటీ పరంగా మరింత అవగాహన పెంచుకొని అప్రమత్తంగా ఉండడం ఉత్తమం.


-నల్లమోతు శ్రీధర్‌

fb.com/nallamothu sridhar


Updated Date - 2020-06-13T05:57:32+05:30 IST