కరోనా వేళ... సైబర్‌ నేరగాళ్ల వల

ABN , First Publish Date - 2021-05-14T05:12:09+05:30 IST

సైబర్‌ నేరగాళ్లు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, ఇతర మందులు అందుబాటులో వున్నాయంటూ ఫేక్‌ వెబ్‌సైట్లు క్రియేట్‌ చేసి పెడుతున్నారు.

కరోనా వేళ... సైబర్‌ నేరగాళ్ల వల

ఆన్‌లైన్‌లో వైద్య పరికరాలు, మందుల విక్రయం పేరిట మోసం

నకిలీ వెబ్‌సైట్ల సృష్టి

ఎవరైనా సంప్రతిస్తే ఆన్‌లైన్‌లో పేమెంట్‌ చేయాలని షరతు

ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌కు రూ.98 వేలు చెల్లించిన నగరవాసి

డబ్బు ట్రాన్స్‌ఫర్‌ చేయగానే ఫోన్‌  స్విచ్‌ ఆఫ్‌

పోలీసులను ఆశ్రయించిన బాధితుడు

ఆన్‌లైన్‌ షాపింగ్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


కరోనా వైరస్‌ కరాళ నృత్యం చేస్తున్న వేళ...ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతుంటే...ఇదే అదనుగా సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కరోనా చికిత్సకు అవసరమయ్యే మందులు, వైద్య పరికరాలు విక్రయం పేరిట మోసం చేస్తున్నారు. నగరంలో ఇటీవల ఈ తరహా మోసాలు పెరుగుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా వుండాలని పోలీసులు కోరుతున్నారు. 


జిల్లాలో ప్రస్తుతం రోజుకు రెండు వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఆస్పత్రుల్లో బెడ్లు దొరకడం లేదు. సకాలంలో ఆక్సిజన్‌ అందక, సరైన వైద్యం లభించక రోజూ పదుల సంఖ్యలో మృతిచెందుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ముందుచూపుతో ఆక్సిజన్‌ సిలిండర్లు, కాన్సన్‌ట్రేటర్లు, రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్లు కొనుగోలుకు సిద్ధమవుతున్నారు. మార్కెట్‌లో ఇవి లభించకపోవడంతో ఆన్‌లైన్‌లో వెతుకుతున్నారు. దీన్ని సైబర్‌ నేరగాళ్లు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, ఇతర మందులు అందుబాటులో వున్నాయంటూ ఫేక్‌ వెబ్‌సైట్లు క్రియేట్‌ చేసి  పెడుతున్నారు. ఆ విషయం తెలియక కొంతమంది ఆయా వెబ్‌సైట్లలోకి లాగిన్‌ అవుతున్నారు. అందులో వున్న ఫోన్‌ నంబర్‌లకు చేస్తే ఆకర్షణీయమైన ధరలు చెబుతూ, సకాలంలో సరఫరా చేస్తామంటూ సైబర్‌ నేరగాళ్లు ముగ్గులోకి దింపుతున్నారు. అడ్వాన్స్‌గా కొంత మొత్తం చెల్లించి, డెలివరీ తర్వాత మిగతా మొత్తం చెల్లించాలని, పూర్తి మొత్తం చెల్లిస్తే స్థానికంగా వుండే తమ బ్రాంచీ సిబ్బంది గంట వ్యవధిలో డెలివరీ ఇచ్చేస్తారంటూ నమ్మబలుకుతున్నారు. తమకు అవసరమైన వస్తువు స్టాక్‌ అయిపోతుందేమోనన్న భయంతో అవతలవాళ్లు చెప్పినట్టే డబ్బులను ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్‌ చేసేస్తున్నారు. డబ్బులు ఖాతాలో పడగానే సైబర్‌ నేరగాళ్లు తమ ఫోన్‌ను ఆపేస్తున్నారు.


ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌కు రూ.98 వేలు టోకరా


నగరానికి చెందిన ఒక వ్యక్తి తమ కుటుంబంలో ఎవరికైనా కరోనా సోకితే ప్రాథమిక చికిత్సకు ఉపయోగపడుతుందనే భావనతో ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌ కొనాలని భావించారు. నగరంలో ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు దొరకడం లేదు. దీంతో ఆన్‌లైన్‌లో వెతగ్గా, ఒక ఫోన్‌ నంబర్‌ కనిపించింది. ఆ నంబర్‌కు ఫోన్‌ చేయగా కాన్సన్‌ట్రేటర్లకు భారీగా డిమాండ్‌ ఉందని, పూర్తి పేమెంట్‌ రూ.98 వేలు కట్టేస్తే గంట వ్యవధిలో డెలివరీ ఇప్పించేస్తామని అవతలి వ్యక్తి చెప్పాడు. దీంతో బాధితుడు నాలుగు రోజుల కిందట రూ.98 వేలు అవతలి వ్యక్తి చెప్పిన బ్యాంకు ఖాతాకు ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. గంట కాదు...రెండు గంటలైనా డెలివరీ రాకపోవడంతో తాను ముందుగా సంప్రతించిన ఫోన్‌ నంబర్‌కు ఫోన్‌ చేస్తే రింగ్‌ అయినా ఎత్తలేదు. తర్వాత మళ్లీ చేస్తే స్విచ్‌ ఆఫ్‌ వచ్చింది. రెండు రోజుల తర్వాత కూడా అదే పరిస్థితి ఎదురవ్వడంతో తాను మోసపోయినట్టు గుర్తించి, రెండు రోజుల కిందట సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పదిహేను రోజుల కిందట కూడా శివాజీపాలేనికి చెందిన ఒక యువకుడు ఇదే విధంగా మోసపోయాడు. కరోనాతో చికిత్స పొందుతున్న తమ బంధువుకు అత్యవసరంగా రెమిడెసివర్‌ ఇంజక్షన్‌ అవసరం కావడంతో నగరమంతా గాలించాడు. ఫలితం లేకపోవడంతో ఆన్‌లైన్‌లో వెతకగా, ఒక ఫోన్‌ నంబర్‌ కనిపించింది. ఆ నంబర్‌కు ఫోన్‌ చేయగా హైదరాబాద్‌ నుంచి ఇంజక్షన్‌ తేవాల్సి ఉంటుందని, రూ.40 వేలు అవుతుందని చెప్పాడు. దీనికి యువకుడు సరేననడంతో అడ్వాన్స్‌గా రూ.10 వేలు చెల్లించాలని, ఇంజక్షన్‌ అందజేసిన తర్వాత మిగిలిన మొత్తం ఇవ్వాలని చెప్పడంతో అలాగే చేశాడు. డబ్బు ట్రాన్స్‌ఫర్‌ అయిన తర్వాత అవతలి వ్యక్తి ఫోన్‌ నంబర్‌ స్విచ్చాఫ్‌ వచ్చింది. రెండు, మూడు రోజుల తర్వాత కూడా అదే పరిస్థితి కావడంతో తాను మోసపోయినట్టు ఆ యువకుడు గుర్తించాడు. అయితే దీనిపై పోలీసుల దృష్టికి తీసుకువెళ్లాలని స్నేహితులు సూచించినా సరే...ఫిర్యాదు చేసేందుకు విముఖత చూపించాడు. 


ఆన్‌లైన్‌ షాపింగ్‌పై అప్రమత్తంగా ఉండాలి

ఆర్‌వీకే చౌదరి, సైబర్‌క్రైమ్‌ సీఐ


ఎవరైనా ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేస్తే అప్రమత్తంగా ఉండాలి. షాపింగ్‌ మీద, నకిలీ వెబ్‌సైట్లను గుర్తించడంలోనూ అవగాహన కలిగి ఉండాలి.  స్వల్ప తేడాతోనే అసలైన కంపెనీలు, ఏజెన్సీల వెబ్‌సైట్లను పోలినట్టే నకిలీ వెబ్‌సైట్లు ఉంటాయి. ఆ విషయం పసిగట్టలేకపోతే ఎవరైనా సరే మోసపోయినట్టేనని తెలుసుకోవాలి. ప్రస్తుతం కరోనా ఉధృతంగా వున్నందున ఎక్కువమంది మందులు, వైద్య పరికరాల కోసం ఆన్‌లైన్‌లో వెతికే అవకాశం ఉంటుంది. అలాంటివారు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాల్సిందే.

Updated Date - 2021-05-14T05:12:09+05:30 IST