‘సాయం’ ముసుగులో మోసం

ABN , First Publish Date - 2020-04-10T06:53:19+05:30 IST

సైబర్‌ నేరగాళ్లు రాటుదేలిపోతున్నారు. బ్యాంకు కస్టమర్ల ఖాతాలు ఖాళీ చేసేందుకు రోజుకో ఎత్తుగడ వేస్తున్నారు. రుణ కిస్తీ (ఈఎంఐ)ల వసూళ్లపై..

‘సాయం’ ముసుగులో మోసం

  • ఈఎంఐలు వాయిదా వేయిస్తామంటూ ఫోన్‌ కాల్స్‌
  • ఎలాంటి సమాచారం ఇవ్వొద్దని బ్యాంకుల హెచ్చరిక
  • ఇదీ మోసం చేసే తీరు 

న్యూఢిల్లీ: సైబర్‌  నేరగాళ్లు రాటుదేలిపోతున్నారు. బ్యాంకు కస్టమర్ల ఖాతాలు ఖాళీ చేసేందుకు రోజుకో ఎత్తుగడ వేస్తున్నారు. రుణ కిస్తీ (ఈఎంఐ)ల వసూళ్లపై ఆర్‌బీఐ విధించిన మూడు నెలల మారిటోరియం (వాయిదా) సౌకర్యాన్ని ఇప్పుడు ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారు. మీ ఖాతా వివరాలు చెప్పండి. ఈఎంఐల వాయిదాకు ‘సాయం’ చేస్తామంటూ ఖాతాదారులకు బురిడీ కొడుతున్నారు.  ఖాతా వివరాలు చెప్పిన వెంటనే ఆ ఖాతాలోని సొమ్మంతా కొట్టేస్తున్నారు. ఇలాంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంకులతోపాటు మరికొన్ని బ్యాంకులు తమ ఖాతాదారులను హెచ్చరించాయి.


ఇదీ మోసం చేసే తీరు 

బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వ్యక్తులే ఈ సైబర్‌ కేటుగాళ్ల టార్గెట్‌. వారి వివరాలు తెలుసుకుని ‘మీకు ఈఎంఐల వాయిదా’ కావాలా? కావాలంటే మమ్మల్ని సంప్రదించండి’ అని ఫోన్‌ చేస్తారు లేదా ఈ-మెయిల్‌ పంపిస్తారు. ఇది నిజమేననుకుని ఎవరైనా వారిని సంప్రదిస్తే మాటలతో నమ్మించి వారి బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ, డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల సీవీవీ నంబర్లు లేదా పిన్‌ నంబర్లు రాబడతారు. ఈ వివరాలు చెప్పగానే ఆ బ్యాంకు ఖాతాలో ఉన్నదంతా ఊడ్చేస్తారు. లేదా ఈఎంఐల వాయిదాకు సంప్రదించమంటూ మీ ఈ-మెయిల్‌, వాట్సప్‌ నంబరుకు మెసేజ్‌లు లేదా ఫోన్లకు ఎస్‌ఎంఎ్‌సలు పంపుతారు.  ఒకవేళ వచ్చిన ఆ ఈ-మెయిల్‌ను క్లిక్‌ చేస్తే మీకు తెలియకుండానే మీ ఫోన్‌ లేదా కంప్యూటర్‌లో ఆటోమేటిక్‌గా కొన్ని మాల్‌వేర్స్‌ ఇన్‌స్టాల్‌ అయి మీ బ్యాంకు లావాదేవీలన్నీ ఈ కేటుగాళ్ల ఆధీనంలోకి వెళ్లిపోతాయి. ఆ సమాచారం ఆధారంగా మీ ఖాతాల్లోని సొమ్మంతా మాయం చేస్తారు. గత కొన్ని రోజులుగా ఇలాంటి మో సాలు బ్యాంకుల దృష్టికి రావడంతో అప్రమత్తం గా ఉండాలని ఖాతాదారులను కోరుతున్నాయి.  

Updated Date - 2020-04-10T06:53:19+05:30 IST