మెడికల్‌ వీసాపై హైదరాబాద్ వచ్చి.. యువతిని పెళ్లి చేసుకొని...

ABN , First Publish Date - 2021-04-18T16:52:20+05:30 IST

మెడికల్‌ వీసాపై భారత్‌కు వచ్చాడు.. పార్ట్‌టైమ్‌ ఫుట్‌బాల్‌ కోచ్‌గా కలరింగ్‌ ఇచ్చాడు..

మెడికల్‌ వీసాపై హైదరాబాద్ వచ్చి.. యువతిని పెళ్లి చేసుకొని...

హైదరాబాద్‌ : మెడికల్‌ వీసాపై భారత్‌కు వచ్చాడు.. పార్ట్‌టైమ్‌ ఫుట్‌బాల్‌ కోచ్‌గా కలరింగ్‌ ఇచ్చాడు.. తోటి దేశస్థులతో కలిసి సైబర్‌ మోసాలకు పాల్పడుతూ, రూ. లక్షలు కొల్లగొడుతున్న ఈ నైజీరియన్‌ సైబర్‌ నేరగాడి ఆటకట్టించారు రాచకొండ పోలీసులు. అతడికి సహకరించిన మరొకరిని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. అతడి నుంచి మొబైల్‌ ఫోన్‌, పాన్‌కార్డు, డెబిట్‌కార్డు, రూ. 16వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నైజీరియాకు చెందిన హెన్నీ చుక్‌వీ ఓపెరా మెడికల్‌ వీసాపై భారత్‌కు వచ్చాడు. శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత తిరిగి వెళ్లిపోకుండా ఇక్కడే ఉండాలనే ఉద్దేశంతో కర్ణాటకకు చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. 


గౌతమ్‌ బుద్దానగర్‌ ఉత్తరప్రదేశ్‌లో ఉంటూ.. ఢిల్లీలో పార్ట్‌టైమ్‌ ఫుట్‌బాల్‌ కోచ్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అతడి వద్దకు నైజీరియాకు చెందిన హెన్నీ, చీమా ఫ్రాంక్‌, ముగేషి ఎప్తో అనే వారు కోచింగ్‌ కోసం వచ్చేవారు. తమ దేశస్థులు కావడంతో ఓపెరా వారితో స్నేహంగా ఉన్నాడు. వారంతా ఇండియాలో అక్రమంగా ఉంటూ.. గిఫ్ట్‌ఫ్రాడ్‌, జాబ్‌ఫ్రాడ్‌, లోన్‌ ఫ్రాడ్‌ వంటి సైబర్‌ నేరాలకు పాల్పడుతూ రూ.లక్షలు సంపాదిస్తున్నట్లు గుర్తించాడు. దాంతో ఓపెరా కూడా వారితో కలిసిపోయాడు. తన ఫోన్‌లో యూకే నంబర్‌ వేసుకొని.. హైదరాబాద్‌ నగరానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని వాట్సా్‌ప్‌లో మెసేజ్‌లు పెట్టి పరిచయం చేసుకున్నాడు. తాను యూకేలో పెద్ద సంపన్నుడిని అంటూ చెప్పుకున్నాడు. అలా కొద్దిరోజుల పాటు చాటింగ్‌లు చేసి తన పరిచయాన్ని స్నేహంగా మార్చుకున్నాడు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి తనను పూర్తిగా నమ్మాడని ధ్రువీకరించుకున్న తర్వాత తన సైబర్‌ పథకాన్ని అమలు చేశాడు.


గిఫ్టుగా తెస్తున్నానంటూ.. 

ఇద్దరూ మంచి మిత్రులు అయిన తర్వాత.. తన సైబర్‌ పథకాన్ని అమలు చేశాడు. మరో రెండు రోజుల్లో భారత్‌కు వస్తున్నాను. నువ్వు నాకు బెస్ట్‌ ఫ్రెండ్‌. నీ కోసం రూ. కోట్ల విలువైన యూకే పౌండ్స్‌ను గిఫ్ట్‌గా తెస్తున్నా అంటూ నమ్మించాడు. నాలుగు రోజులు గడిచాక సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి ఫోన్‌ చేశాడు. ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి మాట్లాడుతున్నానని చెప్పాడు. తనను కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారని, యూకే పౌండ్స్‌ను ఇండియాకు అనుమతించాలంటే జీఎస్టీ, ఇతర ప్రాసెసింగ్‌ ఫీజులు, ట్యాక్సీలు చెల్లించాలని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పాడు. 


‘ఇండియన్‌ కరెన్సీలో చార్జీలు చెల్లిస్తే.. యూకే పౌండ్స్‌ ఇచ్చేసి వెళ్లిపోతాను. లేదంటే రూ.కోట్ల విలువైన సొత్తు కస్టమ్స్‌ అధికారులకు వెళ్తుందని నమ్మించాడు. అతడి మాటలు నిజమని నమ్మిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అతను చెప్పిన ఖాతాల్లో విడతల వారీగా మొత్తం రూ.18లక్షలు చెల్లించాడు. ఆ తర్వాత ఇంకా ఇతర చార్జీల పేరుతో డబ్బులు కావాలని అడగడంతో అనుమానం వచ్చి నిలదీశాడు. అప్పటి నుంచి ఓపెరా ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేశాడు. మోసపోయానని గుర్తించిన బాధితుడు రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు. ఏసీపీ హరినాథ్‌ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌కుమార్‌ తన సిబ్బందితో రంగంలోకి దిగారు. టెక్నికల్‌ ఎవిడెన్స్‌ సేకరించగా ఢిల్లీలో ఉంటున్న నైజీరియన్‌ ఈ మోసానికి పాల్పడినట్లు గుర్తించారు.


బ్యాంకు ఖాతాకు రూ. 50వేలు అద్దె..

నైజీరియన్‌ సైబర్‌ నేరగాడు ఓపెరా.. అమాయకుల నుంచి డబ్బు కొట్టేయడానికి ఢిల్లీ, నోయిడా, ఉత్తరప్రదేశ్‌ ప్రాంతాలలోని చిరువ్యాపారులు, ఆటోడ్రైవర్‌లకు చెందిన బ్యాంకు ఖాతాలను ఉపయోగించుకునేవాడు. ఈ కేసులో నోయిడాకు చెందిన ఆటోడ్రైవర్‌ సూరజ్‌ బ్యాంకు ఖాతాను ఉపయోగించుకున్నాడు. తన ఖాతాను ఇచ్చినందుకు, డబ్బులు విత్‌డ్రా చేసి అతడికి అప్పగించినందుకు సూరజ్‌కు రూ. 50వేలు కమీషన్‌ చెల్లించాడు. దాంతో ఢిల్లీకి వెళ్లిన పోలీసులు ప్రధాన నిందితుడు నైజీరియన్‌ హెన్నీ చుక్‌వీ ఓపెరాతో పాటు.. సూరజ్‌ను అరెస్టు చేశారు.

Updated Date - 2021-04-18T16:52:20+05:30 IST