సైబర్‌ నేరగాళ్ల సరికొత్త దోపిడీ!

ABN , First Publish Date - 2021-07-29T04:39:18+05:30 IST

సైబర్‌ నేరగాళ్లు మోసగించడానికి కొత్త విధానం...

సైబర్‌ నేరగాళ్ల సరికొత్త దోపిడీ!

లింకే కదా అని టచ్ చేస్తే ఖాతా ఖాళీనే!

పేరెన్నికగల టోల్‌ ఫ్రీ నెంబర్లలోకి చొరబాటు

ఎనీ డెస్క్‌ యాప్‌ పేరుతో మోసం

క్షణాల వ్యవధిలో డబ్బు అంతా బదిలీ


నెల్లూరు(ఆంధ్రజ్యోతి): ఇటీవల నెల్లూరులోని ఓ వ్యక్తి తన ఇంట్లో మైక్రో ఓవెన్ మరమ్మతు కోసం సదరు కంపెనీ టోల్‌ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేశారు. అవతలి నుంచి వ్యక్తి వివరాలు అడిగి ‘‘ప్రొసీజర్‌ మారింది. ఆనలైన్‌లో అప్లికేషన్ పెట్టుకోవాలి. మీకో లింకు పంపుతున్నాం. దానిని క్లిక్‌ చేయండి’’ని సూచించాడు. దీంతో వచ్చిన లింకును ఓకే చేసేశాడు. ఇంకేముంది.. ఇతని ప్రమేయం లేకుండానే బ్యాంకు ఖాతా నుంచి.. అవతలి వ్యక్తి ఖాతాలోకి నగదు డెబిట్‌ అవుతూ వచ్చింది. మోసం జరుగుతోందని  గ్రహించిన వ్యక్తి వెంటనే మొబైల్‌ ఆఫ్‌ చేసి బ్యాంక్‌ వద్దకు వెళ్లి తన ఖాతాను పరిశీలించగా నిమిషం వ్యవధిలోనే మూడు సార్లు నగదు డ్రా అయ్యింది. ఆ మొత్తం ముంబాయిలోని ఎస్‌ బ్యాంక్‌లోని ఓ ఖాతాకు జమ అయ్యింది.


సైబర్‌ నేరగాళ్లు మోసగించడానికి కొత్త విధానం అవలంభిస్తున్నారు. ఇప్పటివరకు మన ఖాతా నుంచి ఆనలైన్ పర్చేజింగ్‌ చేసే క్రమంలో ఓటీపీ అడిగి తెలుసుకునే వారు. ఈ మోసం పట్ల ప్రజలు అప్రమత్తం కావడంతో ఇప్పుడు కొత్త పద్ధతిని ఎంచుకున్నారు. అదే ఎనీ డెస్క్‌ యాప్‌. వాళ్లు పంపిన మెసేజ్‌ను క్లిక్‌ చేస్తే మన మొబైల్‌లో ఎనీ డెస్క్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ అవుతుంది. ఈ యాప్‌ డౌన్‌లోడ్‌ అయిందంటే చాలు మన మొబైల్‌ పూర్తిగా వారి చేతిలోకి వెళ్లిపోతుంది. మన ఖాతా నుంచి నగదు డ్రా చేసే సందర్భంగా మొబైల్‌కు వచ్చే ఓటీపీని వారు అడిగే అవసరం ఉండదు. మన మొబైల్‌కు బ్యాంక్‌ నుంచి వచ్చే ఓటీపీలు సైబర్‌ నేరగాని సిస్టమ్‌లో కనిపిస్తాయి. క్షణాల్లో ఆ ఓటీపీని ఎంటర్‌ చేసి మన ప్రమేయం లేకుండానే మన ఖాతా నుంచి డబ్బులు కొట్టేస్తారు. రెండు నిమిషాల వ్యవధిలో 3, 4 సార్లు ఇలా డ్రా చేయగలరు. మన మొబైల్‌కు వరుసబెట్టి వచ్చే ఓటీపీల షాక్‌ నుంచి తేరుకునేలోపే నిమిషాల వ్యవధిలో నాలుగైదు సార్లు నగదు డ్రా చేస్తారు. ఇప్పుడు ఇలా ఎనీడెస్క్‌ యాప్‌ ద్వారా మొబైళ్లను హ్యాక్‌ చేసి మన ప్రమేయం లేకుండానే నగదు దోచేస్తున్నారు. 


దోపిడీ మార్గాలు ఇలా...

సైబర్‌ నేరగాళ్లు ప్రజలను దోచుకోవడానికి రకరకాల వేదికలను ఏర్పాటు చేసుకొంటున్నారు. శ్యాంసంగ్‌, ఎల్‌జీ ఇలా పేరెన్నిక గల కంపెనీల పేర్లతో నెట్‌లో టోల్‌ఫ్రీ నెంబర్లుగా నకిలీ నెంబర్లను సృష్టిస్తున్నారు. వీటిని చూసి అవసరాల కోసం ఫోన్ చేసిన ప్రజలను ఆన్‌లైన్ అప్లికేషన్ పేరుతో లింక్‌ పంపి ఎనీ డెస్క్‌ యాప్‌ ద్వారా దోచేస్తున్నారు. 


మనకు తెలియని కొత్త నంబర్ల నుంచి ప్రలోభపెట్టేలా రకరకాల మెసేజ్‌లు వస్తాయి. మీకు లక్షల రుణం మంజూరయ్యిందని, మీ నంబరుకు లక్షల ప్రైజ్‌ మనీ వచ్చిందని మెసేజ్‌లు వస్తాయి. ఇవి పొందాలంటే ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పేరుతో మన వివరాలు సేకరిస్తాయి. మనం ఇచ్చే ఫోన్ నంబర్‌ ఆధారంగా లైన్‌లోకి వచ్చి మాటలతో మాయ చేస్తున్నారు. మన మొబైల్‌ను హ్యాక్‌ చేసి మన ప్రమేయం లేకుండానే మొబైల్‌ బ్యాకింగ్‌ ద్వారా నగదు కాజేస్తున్నారు. 


సైబర్‌ నేరగాళ్లతో జాగ్రత్త!

సైబర్‌ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండాలి. లాటరీ, లోన్లు, ఇన్సురెన్స్‌లు, లక్కీడ్రాలు, ఇలా పలు రకాలుగా మోసాలు చేసేందుకు నేరగాళ్లు సిద్ధంగా ఉన్నారు. అత్యాశకు పోకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలను ప్రభావితం చేసేలా ఎవరైనా ఫోన్లలో మాట్లాడితే వెంటనే స్థానిక పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేయండి.

- సీహెచ్ విజయరావు, ఎస్పీ


Updated Date - 2021-07-29T04:39:18+05:30 IST