సైబర్‌ షాక్‌..!

ABN , First Publish Date - 2022-06-26T05:41:09+05:30 IST

సైబర్‌ షాక్‌..!

సైబర్‌ షాక్‌..!

విద్యుత్‌ వినియోగదారులకు నకిలీ సందేశాలు

బిల్లు చెల్లించలేదని, సరఫరా నిలిపేస్తామని హెచ్చరిక

ఈ నెంబరుకు కాల్‌ చేయమంటూ లింక్‌

లింక్‌ క్లిక్‌చేసి రూ.75 వేలు పోగొట్టుకున్న ఓ ఉద్యోగిని


ప్రియమైన వినియోగదారుడా.. మీ విద్యుత్‌ సరఫరా ఈరోజు రాత్రి 9.30 గంటలకు నిలిచిపోతుంది. ఎందుకంటే గడిచిన నెలలో మీ విద్యుత్‌ బిల్లు అప్‌డేట్‌ కాలేదు. మీరు వెంటనే విద్యుత్‌ అధికారి 6297735188 నెంబర్‌లో సంప్రదించండి.

..ఈ సందేశం కొద్దిరోజులుగా చాలామంది విద్యుత్‌ వినియోగదారుల ఫోన్లకు వస్తోంది. ఇవి విద్యుత్‌ శాఖ నుంచి వచ్చే మెసేజ్‌లు అనుకుంటే  పొరపాటే. ఇప్పటి వరకు ఖాతాదారులకు ఝలక్‌ ఇచ్చిన సైబర్‌ నేరగాళ్లు తాజాగా ఇలాంటి సందేశాలతో విద్యుత్‌ వినియోగదారులనూ తెలివిగా దోచుకుంటున్నారు. 


(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : వినియోగదారులకు షాక్‌ల మీద షాక్‌లు ఇచ్చే విద్యుత్‌ శాఖకు ఇప్పుడు సైబర్‌ షాక్‌ తగులుతోంది. అపరిచిత వ్యక్తులు ఇస్తున్న సెల్‌ఫోన్‌ సందేశాలను చూసి వినియోగదారులు అధికారులకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. గడువు దాటిన విద్యుత్‌ బిల్లును జరిమానాతో చెల్లించవచ్చు. ఆ తర్వాత బిల్లు చెల్లించకపోతే విద్యుత్‌ శాఖ సిబ్బంది ఫ్యూజును తొలగిస్తారు. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. ఇప్పుడు సైబర్‌ నేరగాళ్లు మెసేజ్‌ల ద్వారా వినియోగదారులను భయాందోళనకు గురిచేస్తున్నారు. వాట్సాప్‌లకు సందేశాలు పంపి భయపెడుతున్నారు. సైబర్‌ నేరగాళ్లు ఇచ్చిన ఫోన్‌ నెంబర్‌కు కాల్‌ చేయగా, కొంతమందితో హిందీలో మాట్లాడినట్టు సమాచారం. ఆ తర్వాత నుంచి ఆ నెంబర్‌ స్విచ్ఛాఫ్‌ అని వస్తోంది. కొన్నిరోజులుగా వస్తున్న ఈ మెసేజ్‌లు విద్యుత్‌ వినియోగదారులను అయోమయంలో పడేస్తున్నాయి. బిల్లులు చెల్లించినా ఈ తరహా మెసేజ్‌లు ఎందుకు వచ్చాయో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. ఇలాంటి వినియోగదారులంతా విద్యుత్‌ కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. మరికొంతమంది నేరుగా సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయిస్తున్నారు. 

రూ.75 వేలు స్వాహా

సచివాలయంలో పనిచేసే మహిళా ఉద్యోగి ఒకరు భవానీపురంలో అద్దెకు ఉంటున్నారు. ఇంటి యజమాని హైదరాబాద్‌లో ఉంటారు. ఈ మహిళా ఉద్యోగి ప్రతినెలా క్రమం తప్పకుండా విద్యుత్‌ బిల్లును చెల్లిస్తున్నారు. మే నెల బిల్లునూ ఆన్‌లైన్‌లో చెల్లించారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌లో ఉంటున్న ఇంటి యజమానురాలి మొబైల్‌కు విద్యుత్‌ బిల్లు చెల్లించలేదని సైబర్‌ నేరగాళ్లు ఒక లింకును పంపారు. ఆమె దానిని సచివాలయ ఉద్యోగికి పంపింది. ఆమె లింకుతో పాటు వచ్చిన ఫోన్‌ నెంబరుకు కాల్‌ చేసింది. ముందుగా ఒక రూపాయి పంపాలని అవతలి వ్యక్తి నుంచి సమాధానం వచ్చింది. ఆమె రూపాయి పంపినా వెళ్లలేదు. తద్వారా ఆమె ఖాతా వివరాలు, ఓటీపీలు తెలుసుకున్న ఆ సైబర్‌ నేరగాడు మాటల్లో పెట్టి రూ.75 వేలు లాగేశాడు.


వినియోగదారులు స్పందించొద్దు

విద్యుత్‌ బిల్లులు చెల్లించకపోతే సరఫరాను నిలుపుదల చేస్తాం. ఆ పని విద్యుత్‌ శాఖ సిబ్బంది మధ్యాహ్నం రెండు గంటలలోపు మాత్రమే చేస్తారు. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఫీజు తీయడం గానీ, డిస్‌ కనెక్ట్‌ చేయడం గానీ చేయరు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో విద్యుత్‌ సరఫరా నిలుపుదల చేయం. ఈ విషయాన్ని వినియోగదారులు గుర్తించాలి. ఇలాంటి సందేశాలు వస్తే వినియోగదారులు స్పందించవద్దు. - శివప్రసాద్‌రెడ్డి, సీపీడీసీఎల్‌ ఎస్‌ఈ


విద్యుత్‌ కార్యాలయంలో సంప్రదించండి

ఈ మధ్యకాలంలో సైబర్‌ నేరగాళ్ల నుంచి విద్యుత్‌ బిల్లులకు సంబంధించి నకిలీ మెసేజ్‌లు వస్తున్నాయి. వాటిపై వినియోగదారులు స్పందించవద్దు. ఒకవేళ ఎవరికైనా ఇలాంటి మెసేజ్‌లు వస్తే సంబంధిత లైన్‌మ్యాన్‌, లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ను సంప్రదించాలి. లేనిపక్షంలో సమీపంలో ఉన్న విద్యుత్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేయొచ్చు. - పూర్ణచంద్రరావు, డీఈ




Updated Date - 2022-06-26T05:41:09+05:30 IST