సరికొత్త దందా.. ఇంటికొచ్చి దోచేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త!

ABN , First Publish Date - 2020-03-17T15:00:25+05:30 IST

సైబర్‌ నేరగాళ్లు కొత్తరకం మోసాలకు తెరతీశారు. ఇంటికొచ్చి మరీ దోచేస్తున్నారు. అదెలాగో చదవండి.

సరికొత్త దందా.. ఇంటికొచ్చి దోచేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త!

  • నైజీరియన్‌ సైబర్‌ నేరగాళ్ల సరికొత్త దందా
  • గిఫ్ట్‌ బాక్స్‌ అంటూ మాయమాటలు
  • పాస్‌వర్డ్‌ పేరుతో లక్షల రూపాయలు కాజేస్తున్న వైనం

హైదరాబాద్‌ : సైబర్‌ నేరగాళ్లు కొత్తరకం మోసాలకు తెరతీశారు. ఇంటికొచ్చి మరీ దోచేస్తున్నారు. అదెలాగో చదవండి. ఇప్పటి వరకు గిఫ్ట్‌ ఫ్రాడ్స్‌, లక్కీడిప్‌, విదేశాల నుంచి విలువైన కానుకల పార్శిల్స్‌ పేరుతో జరిగిన మోసాలన్నీ విమానాశ్రయం వరకే పరిమితమయ్యేవి. ఖరీదైన కానుక పంపిస్తున్నామని బురిడీకొట్టించే సైబర్‌ నేరగాళ్లు విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారని,  ఇండియన్‌ కరెన్సీ రూపంలో పన్నులు, జీఎస్టీ, ఇతర చార్జీలు చెల్లించాలని నమ్మించి అమాయకులను బురిడీ కొట్టించి లక్షల రూపాయలు దండుకునే వారు. ప్రస్తుతం నైజీరియన్‌ సైబర్‌ నేరగాళ్లు కొత్తరకం దందాకు తెరతీశారు.


పార్శిల్‌ ఇంటికి పంపించి...

ఖరీదైన బహుమతుల పేరిట తమ ఉచ్చులో పడిన అమాయకులను సైబర్‌ నేరగాళ్లు మోసం చేస్తున్న విషయం తెలిసిందే. విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు పార్శిల్‌ పట్టుకున్నారని, అందులో రూ. కోట్ల విలువైన డాలర్లు, బంగారు నగలు ఉన్నాయని, వివిధ రకాల చార్జీలు కలిపి రూ. లక్షల్లో చెల్లించాలని చెప్పగానే వారి మాటలు నమ్మిన అమాయకులు అత్యాశకు పోయి లక్షల రూపాయలను నేరగాళ్లు చెప్పిన ఖాతాలో జమచేస్తున్నారు. ఆ తర్వాత ఫోన్‌లు స్విచాఫ్‌ రావడంతో మోసపోయామని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇదంతా పాత కథే. నైజీరియన్‌లు  ఎయిర్‌పోర్ట్‌ ఎపిసోడ్‌ అయిపోయిన తర్వాత ఫోన్‌లు చేయకుండా మరో కొత్తరకం మోసానికి పాల్పడుతున్నారు. ఆ పార్శిల్‌ను ఇంటికి పంపిస్తున్నారు. పార్శిల్‌ అందిన తర్వాత ఫోన్‌ చేసి,  కస్టమ్స్‌ క్లియరెన్స్‌ అయిపోయింది కాబట్టి పార్శిల్‌ ఇంటికి వచ్చేలా చేశాను అని చెబుతున్నారు. వచ్చిన గిఫ్ట్‌ బాక్స్‌ మాత్రం ఓపెన్‌ చేసే అవకాశం ఉండదు.


నంబర్‌ లాకింగ్‌ అంటూ..

నేను పంపిన గిఫ్ట్‌ బాక్స్‌ ఓపెన్‌ చేయడానికి నంబర్‌ పాస్‌వర్డ్‌ ఉంటుంది. నంబర్‌ లాకింగ్‌ కస్టమ్స్‌ వారికి చెప్పాను. వారు గిఫ్ట్‌ బాక్స్‌ చెక్‌ చేసిన తర్వాత వేసిన నంబర్‌ లాకింగ్‌ చెప్పలేదు అని నమ్మిస్తారు. అప్పటి వరకు కస్టమ్స్‌ అధికారులమని నమ్మించిన వ్యక్తులకు ఫోన్‌ చేయగా.. పాస్‌వర్డ్‌ చెప్పాలంటే లక్షల రూపాయలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. గిఫ్ట్‌ బాక్స్‌ చేతికి అందిందని భావిస్తున్న అమాయకులు పాస్‌వర్డ్‌ కోసం వారు అడిగినంత చెల్లిస్తున్నారు. దాంతో అందినంత దండుకుంటున్న నైజీరియన్‌లు ఆ తర్వాత ఫోన్‌లు స్విచాఫ్‌ చేస్తున్నారు. ఇటీవల మోసపోయిన మహిళా డాక్టర్‌ ఇలాగే రెండుసార్లు నైజీరియన్‌ చేతిలో మోసపోయారు. విమానాశ్రయంలో పార్శిల్‌ను విడిపించడానికి రూ. 7.45 లక్షలు చెల్లించారు. ఆ తర్వాత ఓ నైజీరియన్‌ నేరగాడు బాధితురాలి ఇంటికి వెళ్లి గిఫ్ట్‌ బాక్స్‌ అందించాడు. వెళ్లిపోయిన తర్వాత నంబర్‌ లాకింగ్‌ పాస్‌వర్డ్‌ పేరుతో మరోసారి వంచించాడు. ఆ బాక్స్‌లో డాలర్లు, బంగారం ఉందని భావించిన మహిళా డాక్టర్‌ మరో  రూ. 5 లక్షలు సైబర్‌ నేరగాళ్ల ఖాతాలో జమచేశారు. ఆ తర్వాత ఫోన్‌లు స్విచాఫ్‌ రావడంతో మొత్తం రూ. 12.45 లక్షలు మోసపోయానని గ్రహించిన బాధితురాలు సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించారు. 


అప్రమత్తంగా ఉండాలి

నైజీరియన్‌ సైబర్‌ నేరగాళ్లు రోజుకో కొత్త రకం సైబర్‌ మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు ఏకంగా గిఫ్ట్‌లు అందజేయడానికి ఇంటికే వస్తున్నారు. బాక్స్‌ ఓపెన్‌ చేయాలంటే పాస్‌వర్డ్‌ కావాలని.. దానిపేరుతో లక్షల రూపాయలు కాజేస్తున్నారు. ఇలాంటి మోసాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అత్యాశకు పోవద్దు. - శ్రీనివాసకుమార్‌, సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ, సైబరాబాద్‌

Updated Date - 2020-03-17T15:00:25+05:30 IST