Abn logo
Oct 23 2020 @ 00:52AM

డాక్టర్‌ రెడ్డీస్‌పై సైబర్‌ దాడులు

Kaakateeya

  • తాత్కాలికంగా తయారీ యూనిట్లలో ఉత్పత్తి నిలిపివేత
  • 24 గంటల్లో పునరుద్ధరిస్తాం
  • ప్రతికూల ప్రభావం ఉండదు
  • డేటా సెంటర్‌ సేవలు వేర్వేరుగా

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌కు చెందిన ప్రధాన ఫార్మాస్యూటికల్‌ కంపెనీ డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీ్‌సపై సైబర్‌ దాడులు జరిగాయి. కంపెనీకి చెందిన డేటా సర్వర్‌లోకి అక్రమంగా సైబర్‌ నేరగాళ్లు ప్రవేశించినట్లు తెలుస్తోంది. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం ఈ దాడులు జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సైబర్‌ దాడులు జరగడంతో భారత్‌, బ్రెజిల్‌, రష్యా, బ్రిటన్‌, అమెరికాలోని ప్లాంట్లలో కంపెనీ తాత్కాలికంగా ఉత్పత్తిని నిలిపివేసింది. రష్యాకు చెందిన కొవిడ్‌ వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌పై భారత్‌లో రెండు, మూడో దశ క్లినికల్‌ పరీక్షలు నిర్వహించడానికి ఇటీవల డాక్టర్‌ రెడ్డీ్‌సకు డీసీజీఐ నుంచి అనుమతి లభించింది.


ఈ నేపథ్యంలో భారత కంపెనీలపై జరిగిన ప్రధాన సైబర్‌ దాడుల్లో ఇది ఒకటని నిపుణులు భావిస్తున్నారు. దేశీయంగా డాక్టర్‌ రెడ్డీ్‌సకు 17 తయారీ యూనిట్లు, 6 పరిశోధన కేంద్రాలు ఉన్నాయి. విదేశాల్లో 6 తయారీ యూనిట్లు మూడు పరిశోధన కేంద్రాలను కంపెనీ నిర్వహిస్తోంది. దాదాపు 42 దేశాల్లో కంపెనీ కార్యకలాపాలు విస్తరించి ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరానికి రూ.17,460 కోట్ల ఆదాయంపై రూ.1,950 కోట్ల నికర లాభాన్ని డాక్టర్‌ రెడ్డీస్‌ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 400కు పైగా హై క్వాలిటీ జెనరిక్‌ ఔషధాలను విక్రయిస్తోంది. మొత్తం ఆదాయంలో గ్లోబల్‌ జెనరిక్స్‌ విభాగం వాటా 79 శాతం ఉంది. 


సమీక్షిస్తున్నాం..

ప్రస్తుత ఐటీ నెట్‌వర్క్‌పై కంపెనీ సమీక్ష నిర్వహిస్తోంది. సైబర్‌ దాడి ఎలా జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చే స్తోంది.  దాడి జరిగిన నేపథ్యంలో డేటా సెంటర్‌ కార్యకలాపాలను వేర్వేరుగా నిర్వహిస్తున్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ ముకేశ్‌ రాఠీ తెలిపారు. మరి న్ని దాడులు జరగకుండా తగ్గిన చర్యలు తీసుకున్నామన్నారు. ఉత్పత్తి, ప్లాంట్లకు సం బంధించిన ఇతర కార్యకలాపా లు 24 గంటల్లో తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. సైబర్‌ దాడి వల్ల కంపెనీ కార్యకలాపాలు, ఉత్పత్తిపై ఎటువంటి ప్రధాన ప్రతికూల్చ ప్రభావం ఉండదని రాఠీ తెలిపారు.  సైబర్‌ దాడుల వార్తలతో గురువారం బీఎస్‌ఈలో ఇంట్రాడే ట్రేడింగ్‌లో డాక్టర్‌ రెడ్డీస్‌ షేరు ఒక దశలో భారీగా నష్టపోయి రూ.4,832.40 కనిష్ఠ స్థాయి ని తాకింది. చివరకు స్వల్ప నష్టంతో రూ.5023.60 వద్ద ముగిసింది. కాగా ఎన్‌ఎ్‌సఈలో 0.49 శాతం నష్టపోయి రూ.5,022 వద్ద క్లోజైంది. 


Advertisement
Advertisement