భారత సైబర్‌ సెక్యూరిటీ కేంద్రంపైనే సైబర్‌ దాడి

ABN , First Publish Date - 2020-09-19T07:10:59+05:30 IST

ప్రధానమంత్రి, ఇతర ప్రముఖుల వివరాల కోసం చైనా కంపెనీ ఒకటి దేశవ్యాప్తంగా భారీ ఎత్తున సైబర్‌ దాడి చేసిన విషయం సద్దుమణక

భారత సైబర్‌ సెక్యూరిటీ కేంద్రంపైనే  సైబర్‌ దాడి

వంద కంప్యూటర్ల సమాచారం తస్కరణ

మోదీ, దోవల్‌, షాలకు సంబంధించిన

కీలక సమాచారం సైబర్‌ చోరుల చేతికి

బెంగళూరు కంపెనీ నుంచి మాల్‌వేర్‌?


న్యూఢిల్లీ, సెప్టెంబరు 18: ప్రధానమంత్రి, ఇతర ప్రముఖుల వివరాల కోసం చైనా కంపెనీ ఒకటి దేశవ్యాప్తంగా భారీ ఎత్తున సైబర్‌ దాడి చేసిన విషయం సద్దుమణక ముందే మరో భారీ సైబర్‌ దాడి జరిగింది. ఈసారి ఏకంగా దేశ ఐటీ అవసరాలు, సైబర్‌ సెక్యూరిటీ వ్యవహారాలు చూస్తున్న నేషనల్‌ ఇన్ఫర్మాటిక్స్‌ సెంటర్‌(ఎన్‌ఐసీ) పైనే గురి పెట్టారు. ఆ సంస్థకు చెందిన వంద కంప్యూటర్లను హ్యాక్‌ చేశారు. ఎన్‌ఐసీ దేశ రాజధాని ఢిల్లీలోని సైబర్‌ హబ్‌ కేంద్రంగా పని చేస్తోంది.


ప్రధానంగా దేశంలో పలు రాష్ట్రాల ఈ-గవర్నెన్స్‌ ప్రాజెక్టులకు కన్సల్టెన్సీగా వ్యవహరిస్తోంది. ఎన్‌ఐసీ కంప్యూటర్లలో ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన సమాచారంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షా, జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ దోవల్‌, ఇతర ముఖ్య అధికారులు, దేశ ప్రముఖులకు సంబంధించిన అత్యంత కీలకమైన సమాచారం కూడా ఉంది. 


ఎన్‌ఐసీ కంప్యూటర్ల మీద సైబర్‌ దాడికి సంబంధించిన అలర్ట్‌ అందగానే ఈ నెల మొదటి వారంలో ఢిల్లీ పోలీస్‌ సైబర్‌ విభాగం నిపుణులు కేసు నమోదు చేసి పరిశోధన ఆరంభించారు. ఎన్‌ఐసీ ఉద్యోగి ఒకరు ఈ-మెయిల్‌ తెరవడం సాధ్యం కాకపోవడంతో సైబర్‌ దాడి జరిగినట్లు గుర్తించారు. అతని కంప్యూటర్‌తో పాటు మరికొంత మంది ఉద్యోగుల కంప్యూటర్లకు అదే పరిస్థితి ఎదురు కావడంతో మూకుమ్మడిగా మాల్‌వేర్‌ దాడి జరిగినట్లు గుర్తించారు. వారి కంప్యూటర్లలో సమాచారం తస్కరణకు గురైందని తేల్చారు. ఈ-మెయిల్‌కు వచ్చిన లింక్‌ను క్లిక్‌ చేయగానే కంప్యూటర్లు స్పందించడం మానేశాయి.


బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న అమెరికా ఐటీ కంపెనీ ఐపీ అడ్రస్‌ నుంచి ఈ మాల్‌వేర్‌ వచ్చినట్లు తేల్చారు. ప్రాక్సీ ఐపీ అడ్ర్‌సలతో ఇలాంటి దాడులు చేసే అవకాశం ఉండటంతో బెంగళూరు నుంచే దాడి జరిగిందని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. చైనాకు చెందిన జెన్హువా డాటా ఇన్ఫర్మేషన్‌ సంస్థ ప్రధాని సహా భారతీయ ప్రముఖులపై నిఘా వేస్తోందని కనుగొన్న కొద్ది రోజులకే సైబర్‌ దాడి జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.


ఢిల్లీ పోలీసులు వంద కంప్యూటర్లు హాక్‌ అయ్యాయని ఫిర్యాదు వచ్చిందని అంగీకరిస్తూనే, ఇది ఎన్‌ఐసీ ప్రాథమిక అనుమానం మాత్రమేనని చెప్పారు. కంప్యూటర్ల నుంచి సమాచారం ఏదీ డిలీట్‌ కాలేదన్నారు. ఎన్‌ఐసీ ఉద్యోగి అధికారిక మెయిల్‌ ఐడీకి వచ్చిన లింక్‌ను క్లిక్‌ చేయగానే అతని కంప్యూటర్‌లోకి, దాంతో అనుసంధానమైన మరి కొన్ని కంప్యూటర్లలోకి మాల్‌వేర్‌ చొరబడిందని అనుమానిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

మీడియాలో వస్తున్నట్లు ఉన్నత స్థాయి వ్యక్తుల సమాచారం తస్కరణకు గురైందని ప్రస్తుత స్థాయి దర్యాప్తులో ధ్రువీకరించలేమన్నారు. ఇలాంటి దాడులను ఎదుర్కొనే పటిష్ట ఐటీ వ్యవస్థ మనకు ఉందని వివరించారు. 


Updated Date - 2020-09-19T07:10:59+05:30 IST