Hyderabad: బేస్‌ పెంచితే కేసే!

ABN , First Publish Date - 2022-10-01T17:12:48+05:30 IST

‘బేసు జర పెంచి కొట్టు.. బాక్సులు పగిలేటట్లు’’ అంటే ఇకపై కుదరదు. పబ్‌లలో డీజేల హోరు.. ఇక ముందు వినిపించకూడదని పోలీసులు

Hyderabad: బేస్‌ పెంచితే కేసే!

పబ్‌ల్లో శబ్దాలు బయటకు వస్తే చర్యలు 

కోర్టు ఆదేశాలతో అప్రమత్తమైన పోలీసులు

నిబంధనలు పాటించకపోతే కేసులు : సీపీ 

హైదరాబాద్‌ సిటీ: ‘బేసు జర పెంచి కొట్టు.. బాక్సులు పగిలేటట్లు’’ అంటే ఇకపై కుదరదు. పబ్‌లలో డీజేల హోరు.. ఇక ముందు వినిపించకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రాత్రి, పగలు అన్న తేడా లేకుండా స్పీకర్ల ద్వారా ఇరుగు పొరుగు వారికి ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవంటున్నారు. నివాస గృహాలకు ఆనుకొని ఉన్న పబ్‌ల కారణంగా తలెత్తుతున్న సమస్యలపై పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. కొంతమంది హైకోర్టును ఆశ్రయించడంతో ఈ విషయం సీరియస్‌ అయింది. పబ్‌లలో డీజేలు వాడటానికి లైసెన్స్‌ ఉందా? అని హైకోర్టు ప్రశ్నించింది. దీంతో పోలీస్‌ అధికారులు డీజే, మ్యూజిక్‌ హోరు, శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న పబ్‌లపై చర్యలకు సిద్ధమవుతున్నారు. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో కొన్ని పబ్‌లు నివాసగృహాల మధ్య ఉండటం.. రాత్రి వేళల్లో పెద్ద పెద్ద డీజేలు, స్పీకర్ల ధ్వనులు రావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు ఫిర్యాదులు చేశారు. కొన్ని చోట్ల పబ్‌లలో మద్యం తాగి ఖాళీ సీసాలు, ఇతర చెత్తను ఇళ్ల ముందు పడేస్తున్నారనే ఫిర్యాదులూ అందాయి. మరికొన్నిచోట్ల పార్కింగ్‌ ఏర్పాట్లు లేకుండానే పబ్‌లు నిర్వహిస్తున్నారని, పబ్‌కు వచ్చే వారి వాహనాలు రోడ్లపైనే పార్క్‌ చేయడంతో ట్రాఫిక్‌ సమస్యలు కూడా తలెత్తుతున్నాయని ఫిర్యాదులు వచ్చాయి.


కఠిన చర్యలు : సీవీ ఆనంద్‌

ఎక్సైజ్‌, పోలీస్‌, ట్రాఫిక్‌ అధికారులు పబ్‌ నిర్వాహకులతో త్వరలో సమావేశం కానున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ తెలిపారు. ధ్వని కాలుష్యం, స్థానికులకు ఇబ్బందులు లేకుండా పబ్‌లు నిర్వహించుకోవాలన్నారు. అలా చేయని పబ్‌లను అక్కడి నుంచి తరలించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పబ్‌ల డీజేల శబ్దం బయటకు రాకుండా తగిన ఏర్పాట్లు చేసుకునేలా పబ్‌ల యాజమాన్యానికి హెచ్చరికలు జారీ చేయనున్నారు. పార్కింగ్‌ ఏర్పాట్లు లేని పబ్‌లకు కూడా నోటీసులిస్తామన్నారు. డీజేల హోరుకు సంబంఽధించిన లైసెన్స్‌ల గురించి కోర్టు ప్రస్తావించినందున అనుమతి లేకుండా మ్యూజిక్‌ ప్లే చేయరాదని హెచ్చరించనున్నారు. నిబంధనలు పాటించని పబ్‌లపై కేసు నమోదు చేస్తామన్నారు.

Updated Date - 2022-10-01T17:12:48+05:30 IST