కాటేస్తున్న టెయిలింగ్‌ పాండ్‌

ABN , First Publish Date - 2022-01-17T05:30:00+05:30 IST

యురేనియం శుద్ధి కర్మాగారం పరీవాహక గ్రామాల్లో టెయిలింగ్‌ పాండ్‌ ఒక పెద్ద సమస్యలా మారింది. ఇటు వాతావరణాన్ని, అటు భూగర్భజలాలను, పచ్చని పంటపొలాలను సైతం యురేనియం వ్యర్థాలు కాటేస్తున్నాయి. వర్షం వస్తే యురేనియం వ్యర్థాలను నిల్వ చేసే టెయిలింగ్‌ పాండ్‌ పొంగి పొర్లుతోంది. వర్షం నీటితో కలిసిన నీరు పంట పొలాలను, భూగర్భ జలాలను నాశనం చేస్తున్నాయి.

కాటేస్తున్న టెయిలింగ్‌ పాండ్‌
ఎం.తుమ్మలపల్లె వద్ద యురేనియం శుద్ధి కర్మాగారం

వర్షం వస్తే పంట పొలాలపై కలుషిత నీరు

పంటలు నాశనం, భూగర్భజలాలు కలుషితం

ఇది యూసీఐఎల్‌ గ్రామాల రైతుల దుస్థితి

పులివెందుల, జనవరి 17: యురేనియం శుద్ధి కర్మాగారం పరీవాహక గ్రామాల్లో టెయిలింగ్‌ పాండ్‌ ఒక పెద్ద సమస్యలా మారింది. ఇటు వాతావరణాన్ని, అటు భూగర్భజలాలను, పచ్చని పంటపొలాలను సైతం యురేనియం వ్యర్థాలు కాటేస్తున్నాయి. వర్షం వస్తే యురేనియం వ్యర్థాలను నిల్వ చేసే టెయిలింగ్‌ పాండ్‌  పొంగి పొర్లుతోంది. వర్షం నీటితో కలిసిన నీరు పంట పొలాలను, భూగర్భ జలాలను నాశనం చేస్తున్నాయి. టెయిలింగ్‌ పాండ్‌ను అందులో వ్యర్థాలను జాగ్రత్తగా ఉంచాల్సిన యూసీఐఎల్‌ వాటిని గాలికొదిలేసింది. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాల్లోకెళితే... యురేనియం కార్పొరేషన ఆఫ్‌ ఇండియా (యూసీఐఎల్‌) పులివెందుల సమీపంలోని ఎం.తుమ్మలపల్లె వద్ద 2006లో యురేనియం శుద్ధి కర్మాగారం ఏర్పాటుకు పనులు ప్రారంభించింది. దాదాపు రూ.1107 కోట్లతో యూసీఐఎల్‌ శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది. 2008 నాటికి శుద్ధి కర్మాగారం యురేనియం శుద్ధి పనులను ప్రారంభించింది. యురేనియం శుద్ధి చేసే సమయంలో వెలువడే యురేనియం వ్యర్థాలు, రసాయనాలు మానవాళికి, ప్రకృతికి ఎంతో ప్రమాదకరమని వాటిని టెయిలింగ్‌ పాండ్‌లో భద్రపరుస్తారు. టెయిలింగ్‌ పాండ్‌ నిర్మాణ సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉన్నత ప్రమాణాలతో ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందులోని వ్యర్థాలు బయటకు రావడం గాని, ఇందులోకి వర్షపునీరు చేరడం గాని జరగకుండా యూసీఐఎల్‌ గట్టి చర్యలు చేపట్టాల్సి ఉంది. కానీ వీటన్నింటినీ యూసీఐఎల్‌ పట్టించుకోకుండా టెయిలింగ్‌ పాండ్‌ నిర్మాణ పనులను ప్రైవేటు సంస్థలకు అప్పగించి చేతులు దులుపుకుందనే ఆరోపణలు ఉన్నాయి. పనులు ఇష్టానుసారంగా చేయడం రైతుల పాలిట శాపంగా మారిందని రైతులు వాపోతున్నారు. 2017లో మొట్టమొదటిసారి అధిక వర్షాలకు టెయిలింగ్‌ పాండ్‌ పొంగి పొర్లింది. ఆ సమయంలో భూగర్భ జలాలు కలుషితమై బోర్లలో యురేనియం వ్యర్థాలు వచ్చి పంట పొలాలను నాశనం చేస్తున్నాయని రైతులు పెద్దఎత్తున ఆందోళన చేశారు. ఆ సమయంలో యూసీఐఎల్‌ నీటిని, భూమిని పరిశీలిస్తామని హామీ ఇచ్చి వాటిని గాలికి వదిలేసింది. 2019, 2020 సంవత్సరాల్లో కురిసిన భారీ వర్షాలకు పలుమార్లు టెయిలింగ్‌ పాండ్‌ పొంగి పొర్లి చుట్టుపక్కల ఉన్న వాగులు వంకల్లో ప్రవహించి పంట పొలాలపై ఈ కలుషిత నీరు చేరడంతో పంటలు పూర్తిగా నాశనమయ్యాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. టెయిలింగ్‌ పాండ్‌ సమస్యకు యూసీఐఎల్‌ శాశ్వత పరిష్కారం చూపడంలో యూసీఐఎల్‌ పూర్తిగా విఫలమైందని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. సెప్టెంబరు, అక్టోబరు మాసాల్లో కురిసిన భారీ వర్షాలకు టెయిలింగ్‌ పాండ్‌ పలుమార్లు పొంగి పొర్లడం పంటలు పెద్దఎత్తున దెబ్బతిన్నాయని రైతులు అంటున్నారు. ముడి యురేనియం శుద్ధి సమయంలో వాడే రసాయనాలు, వెలువడే వ్యర్థాలు ఎంతో ప్రమాదకరం అయినా యూసీఐఎల్‌ వాటిని పట్టించుకోకుండా గాలికొదిలేసిందని ఆ ప్రాంత ప్రజలు ఆవేదన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ కావడంతో యూసీఐఎల్‌ నిర్లక్ష్యాన్ని ఎండగట్టేందుకు ఎవరు ప్రయత్నించినా అది విఫలమవుతోందని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. ఏదిఏమైన టెయిలింగ్‌ పాండ్‌ యూసీఐఎల్‌ పరీవాహక గ్రామాలకు శాపంలా మారింది. 



Updated Date - 2022-01-17T05:30:00+05:30 IST